పెరోల్​పై బయటకొచ్చిన డేరాబాబా

పెరోల్​పై బయటకొచ్చిన డేరాబాబా

చండీగఢ్: ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరా బాబా) మరోసారి జైలు నుంచి బయటకు వచ్చారు. 20 రోజుల పెరోల్​పై హర్యానాలోని సునారియా జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. పెరోల్ పీరియడ్​లో డేరాబాబా ఉత్తరప్రదేశ్​ రాష్ట్రం బర్నావాలోని డేరా ఆశ్రమంలో ఉంటారని ఆయన అనుచరులు వెల్లడించారు. అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో డేరాబాబా పెరోల్ అప్పీల్​ను ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ఎన్నికల సంఘానికి పంపింది.

అయితే, పెరోల్ టైంలో హర్యానాకు దూరంగా ఉంటానన్న డేరా బాబా హమీ పత్రం మేరకు ఎలక్షన్ కమిషన్ పెరోల్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఆపై హర్యానా సర్కారు ఆయన విడుదలకు ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనొద్దని, బహిరంగ ప్రసంగాలు చేయొద్దని, ఎన్నికలు ముగిసేదాకా హర్యానాకు దూరంగా ఉండాలని కండిషన్లు పెట్టింది. అయితే, వివిధ కారణాలతో నాలుగేండ్లలో డేరాబాబా పదిహేను సార్లు పెరోల్​పై బయటికొచ్చారు.