- దేశాయిపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న పనులు
- విషయం తెలిసి అందోళనకు దిగుతున్న గ్రామస్తులు
- అనుమతి రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతి
మహబూబ్‌నగర్/గండీడ్, వెలుగు : పల్లెలు, వ్యవసాయ పొలాలు ఉండే ప్రాంతాల్లో గ్రీన్ ఇండస్ట్రీస్ మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉండగా వాటిస్థానంలో రాష్ట్ర సర్కారు పొల్యుషన్ వెదజల్లే ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇస్తోంది. పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుండా ఆ కంపెనీలకు భూములు కేటాయిస్తోంది. అందరికీ ఆమోదం ఉందంటూ తప్పుడు రిపోర్టులు ఇస్తూ, మేకిన్ ఇండియా నుంచి పర్మిషన్లు ఇప్పిస్తోంది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లి గ్రామ శివారులో 1993లో మినీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్క్‌కు అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి కమతం రాంరెడ్డి సర్వే నంబర్ 460లో 14 ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించారు. పార్క్‌ను ఓపెన్ చేశాక టైర్లు, పశువులు, కోళ్ల దాణా తయారీ ఫ్యాక్టరీలను స్థాపించారు. స్థలం చాలకపోవడంతో అదనంగా మరో 11ఎకరాలకు కేటాయించారు. ఇందులో పేపర్ ప్లేట్స్, పెయింట్ తయారీ పరిశ్రమలు నెలకొల్పారు.దీనిలో పెయింట్ తయారీ పరిశ్రమను కొద్ది రోజుల కింద మూసేశారు. ఈ విషయంబయటికి రాకుండా, ఈ పరిశ్రమకు కేటాయించిన భూమితో పాటు మరికొంత భూమిని టీఎస్ఐఐసీ అధికారులు హైదరాబాద్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీకి కేటాయించారు. రెండు నెలల కింద పనులు స్టార్ట్ చేశారు. ట్యాబ్లెట్ల తయారీకి వాడే ముడి సరుకును ఇక్కడ తయారు చేస్తారని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళన చేస్తున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే..
గ్రామాల్లో ఏ పరిశ్రమ స్థాపించాలన్నా ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు కంపెనీ ఏర్పాటు చేయాలా? వద్దా? అనే విషయాన్ని ఫైనల్ చేయాలి. కానీ, దేశాయిపల్లి వద్ద నిర్మిస్తున్న ఫార్మా కంపెనీకి సంబంధించి ఇప్పటి వరకు పబ్లిక్ హియరింగ్ నిర్వహించలేదు. గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకోకుండా పనులు మొదలు పెట్టారు. పైగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించినట్లు, మెజార్టీ ప్రజలు ఆమోదం తెలిపినట్లు తప్పుడు రిపోర్టులు సృష్టించారనే టాక్ వస్తోంది. ఈ రిపోర్టులను మేక్ ఇన్ ఇండియాకు పంపించి పర్మిషన్లు తీసుకొచ్చారనే ఆరోపణలున్నాయి.
ఆందోళనకు దిగుతున్న గ్రామస్తులు..
దేశాయిపల్లిలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తున్నారనే విషయం ఆలస్యంగా తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళనకు దిగుతున్నారు. రెండు వారాల కింద మహమ్మదాబాద్ తహసీల్దార్ఆఫీస్ ఎదుట నిరసన తెలిపి, పనులు నిలిపేయాలని వినతిపత్రం ఇచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్,- చించోలి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం మహబూబ్‌నగర్‌కు చేరుకొని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కంపెనీకి ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేయాలని కోరారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి గండీడ్ మండలంలోని నంచర్ల, మొకర్లాబాద్, దేశాయిపల్లి, గాధిర్యాల్, చౌదర్పల్లి, జులపల్లి, గండీడ్ మండలంలోని కొమిరెడ్డిపల్లి, ఆశిరెడ్డిపల్లి గ్రామాల్లోని 12 వేల ఎకరాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రామాల పరిధిలోని 18 చెరువులు, 258 బోర్లపై ఎఫెక్ట్ పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తులకు బెదిరింపులు..
ఫార్మా కంపెనీ వద్ద ఆందోళనలు చేస్తే కేసులు పెట్టిస్తామని ఓనర్లు బెదిరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మిషన్ తీసుకోవడానికి తాము రూ.2 కోట్లు ఖర్చు చేశామని, అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లండని కంపెనీ వారు బెదిరిస్తున్నారన్నారు. పైగా కంపెనీ వద్దకు వచ్చి గొడవలు చేసి, ఆస్తులు ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటామని తమను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు వార్నింగ్ ఇచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు.
పొల్యూషన్ రాదని బాండ్ రాసిస్తారా?
ఊరి సమీపంలో ఫార్మా కంపెనీ పెడితే పంటలు ఎట్లా పండించుకోవాలి? పశువులు, గొర్రెలను ఎలా కాపాడుకోవాలి? కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలు గ్రౌండ్ వాటర్‌లో కలిస్తే మా పరిస్థితి ఏంటి? ఈ కంపెనీ వల్ల పొల్యూషన్ ఉండదని మీరేమైనా బాండ్ రాసిస్తారా? పోలేపల్లి సెజ్‌లో పశువులు చస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మనుషులకు స్కిన్డిసీజ్లు వస్తున్నా ఎవరూ మాట్లాడటం లేదు. ఈ కంపెనీ వస్తే రేపు మాకు అదే పరిస్థితి వస్తుంది.
–గాజుల రాములు, దేశాయిపల్లి
ఫార్మా కంపెనీ మాకొద్దు..
ఫార్మా కంపెనీ మాకు వద్దు. ఈ కంపెనీతో ఎలాంటి ప్రమాదం ఉందో మాకు తెలుసు. ఈ కంపెనీకి బదులు గ్రీన్ ఇండస్ట్రీస్‌కు పర్మిషన్లు ఇవ్వండి. వాటికి మేం వ్యతిరేకం కాదు.కంపెనీ వాళ్లు దీంతో పొల్యూషన్ రాదని, అందుకే పర్మిషన్లు వచ్చాయని చెబుతుండ్రు. పర్మిషన్లు రద్దు చేసే వరకు పోరాడుతాం.
–రఘు యాదవ్, సర్పంచ్, దేశాయిపల్లి