
అతని పేరు అమిత్ శర్మ. కానీ.. తన ఫాలోవర్స్ అందరూ ‘అమిత్ భాయ్’ అని పిలుస్తారు. యూత్ సరదాగా ఆడే గేమ్స్‌ని యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేసి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్నాడు. అతని గేమింగ్ స్టయిల్‌కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అమిత్ చేసే ఫ్రీ ఫైర్ వీడియోలకు కోట్లలో వ్యూస్ వస్తుంటాయి.
అమిత్ శర్మ పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో పుట్టి పెరిగాడు. వాళ్లది చిన్న మధ్యతరగతి కుటుంబం. అతనికి చిన్నతనం నుండీ వీడియో గేమ్స్ మీద ఇష్టం ఉండేది. చదువులో కూడా ముందుండేవాడు. చదువుకునే రోజుల నుంచే ‘గరేనా ఫ్రీ ఫైర్’ ఆడేవాడు. కానీ.. ప్రో ప్లేయర్ కాదు. గ్రాడ్యుయేషన్ తర్వాత అమిత్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. కొన్నాళ్లకు అది వర్కవుట్ కాదనిపించి, గేమింగ్ వైపు మళ్లాడు. అందులో అతనికి ఇంట్రెస్ట్ ఉన్నా.. ప్రో గేమర్ కాదు. అందుకే గేమ్స్ ఎలా ఆడాలో నేర్పించే యూట్యూబర్ల వీడియోలు చూశాడు. కొంతకాలం తర్వాత అతను కూడా ఫ్రీఫైర్‌లో ప్రో ప్లేయర్‌గా మారాడు.
తక్కువ టైంలో..
ఆ తర్వాత యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గేమింగ్ కమ్యూనిటీలో తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ అయ్యాడు. తన ఛానెల్ దేశీ గేమర్స్‌ని 2015లో మొదలుపెడితే.. ప్రస్తుతం 13.8 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. అమిత్ గేమింగ్ వీడియోలు అప్‌లోడ్ చేయడంతోపాటు లైవ్ స్ట్రీమ్స్ కూడా చేస్తుంటాడు. అయితే.. అమిత్ ఛానెల్ పెట్టిన తర్వాత రెండు లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు వచ్చేవరకు ఛానెల్ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ వచ్చాక ఛానెల్ గురించితల్లిదండ్రులకు చెప్పాడు. అప్పటినుంచి వాళ్లు కూడా అమిత్‌కు సపోర్ట్‌గా ఉన్నారు.
కాపీ రైట్ స్ట్రయిక్‌లు
అమిత్ తన ఛానెల్‌లో 2018 నుంచి వీడియోలు అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ.. కంటెంట్ క్రియేట్ చేయడం తెలియక.. మొదట్లో ఇతర క్రియేటర్ల కంటెంట్‌ను కూడా అమిత్ అప్‌లోడ్ చేశాడు. దాంతో చాలా వ్యూస్ వచ్చినా యూట్యూబ్ నుంచి డబ్బు రాలేదు. పైగా ఛానెల్‌కు రెండు కాపీరైట్ స్ట్రయిక్‌లు వచ్చాయి. దాంతో గరెనా ఫ్రీ ఫైర్ ఆడి సొంతంగా కంటెంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లోనే 15 వేల మంది సబ్‌స్క్రయిబర్లు వచ్చారు. ఛానెల్‌లో ఎక్కువగా వీడియో స్ట్రీమింగ్ చేయడం, అప్‌లోడ్ చేయడం చేస్తుండేవాడు. అందువల్ల సబ్‌స్క్రయిబర్ల సంఖ్య పెరగడానికి తక్కువ టైం పట్టింది.
‘ఓన్లీ ఎంపీ40 ఛాలెంజ్’ పేరుతో చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. దానికి అప్పట్లో ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోను నవంబర్ 19, 2018న పోస్ట్ చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా అతని గేమ్‌ప్లే వీడియోల్లో మరొకటి వైరల్ అయింది. ఏప్రిల్ 2019 నాటికి ఛానెల్‌కు 50 వేల మంది సబ్‌స్క్రయిబర్లు ఉండేవాళ్లు. కానీ.. వీడియో వైరల్ అయ్యాక 2019 ఆగస్టు వరకు ఛానెల్‌ను ఐదు మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. యూట్యూబ్ ద్వారా అతను మొదటగా155 అమెరికన్ డాలర్లు అందుకున్నాడు. ప్రస్తుతం అమిత్ ఇతర గేమింగ్ యూట్యూబర్లతో కూడా ఆడుతున్నాడు.
దేశీ ఆర్మీ
అమిత్‌కు మెయిన్ ‘ఛానెల్ దేశీ గేమింగ్’తోపాటు మరికొన్ని ఛానెళ్లు ఉన్నాయి. తన రెండో ఛానెల్ ‘దేశీ ఆర్మీ’కి 3.66 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఈ ఛానెల్‌లో కూడా రెగ్యులర్‌గా గేమింగ్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాడు. దీంతో పాటు షార్ట్ వీడియోలు అప్‌లోడ్ చేసేందుకు మరో ఛానెల్ ‘డీజీ షార్ట్స్’ కూడా నడుపుతున్నాడు. ఈ ఛానెల్‌కు తొమ్మిది లక్షల 24 వేల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ‘అమిత్ శర్మ’ ఛానెల్‌ను ఏడు లక్షల 82వేల మంది, ‘డీజీ ఎక్స్‌ట్రా’ అనే ఛానెల్‌ను లక్షా 52 వేల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. అంతేకాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అమిత్‌ను 2.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
నెట్‌వర్త్
దేశీ గేమర్ ఛానెల్‌కు ప్రతి నెలా సగటున 36 మిలియన్లకు పైగా వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ నుంచి నెలకు దాదాపు15 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. స్పాన్సర్‌షిప్‌లు, అఫ్లియేటెడ్ కమిషన్, ప్రమోషన్స్ ద్వారా కూడా కొంత డబ్బు సంపాదిస్తున్నాడు. అతని మొత్తం ఆస్తుల విలువ 8.5 కోట్ల రూపాయలు ఉంటుందనేది ఒక అంచనా.