మేడిగడ్డలో అడుగడుగునా లోపాలే!..తేల్చిచెప్పిన ఐఐటీ రూర్కీ అధ్యయనం

మేడిగడ్డలో అడుగడుగునా  లోపాలే!..తేల్చిచెప్పిన ఐఐటీ రూర్కీ అధ్యయనం
  • డిజైన్స్​, మోడల్​ స్టడీస్​, జియో టెక్నికల్​ఇన్వెస్టిగేషన్స్​ సరిగా చేయలే 
  • ఐఎస్​ కోడ్స్​ ప్రకారం గేట్ల వద్ద జియో టెక్నికల్​ స్టడీస్ నిర్వహించలే
  • బ్యారేజీ ఏడో బ్లాకులో 11 గేట్లుంటే.. ఐదు గేట్ల వద్దే ఆ టెస్టులు చేశారు
  • బ్యారేజీకి ఫౌండేషన్​ అయిన సీకెంట్ ​పైల్స్​నూ సరిగ్గా నిర్మించలే 
  • దిగువన రాఫ్ట్, పైల్స్​కు కనెక్షన్​ లేక రంధ్రాలు పడి వరద లీకేజీ
  • ఇసుక సెడిమెంటేషన్​తో పాటు మరికొన్ని స్టడీస్​ చేయలేదని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న మేడిగడ్డ బ్యారేజీలో అడుగడుగునా లోపాలే ఉన్నట్టు తేలింది. డిజైన్లు, మోడల్​ స్టడీస్​, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్​ మొదలు.. బ్యారేజీకి మూలస్తంభమైన సీకెంట్​పైల్స్​లోనూ లోపాలున్నాయని ఐఐటీ రూర్కీ రిపోర్ట్​ తేల్చి చెప్పింది. పలు పనులను ‘ఇండియన్​ స్టాండర్డ్​ కోడ్స్’​ ప్రకారం చేపట్టలేదని గుర్తించింది. ప్రతి బ్లాకులోని ప్రతి గేటు వద్దా జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ చేయాల్సి ఉన్నా.. కేవలం కొన్ని చోట్లనే ఆ టెస్టులు చేసి.. వాటినే మిగతా వాటికీ ప్రామాణికంగా తీసుకున్నారని వెల్లడించింది.హైడ్రాలజీ, హైడ్రాలిక్స్​ (గేట్లకు సంబంధించిన అంశాలు), జియోటెక్నికల్​ డిజైన్స్​పై ఐఐటీ రూర్కీకి చెందిన సివిల్​ ఇంజినీరింగ్ నిపుణులతో కూడిన టీమ్​ విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసింది. సీకెంట్​ పైల్స్​ కటాఫ్​ (బ్యారేజీలో లీకేజీలు, సీపేజీలు ఏర్పడకుండా భూమిలోపల ఏర్పాటు చేసే ఫౌండేషన్​లాంటి ప్రొటెక్షన్​ వాల్​) ఐఎస్​ కోడ్​ ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని రిపోర్ట్​ తేల్చింది. సీకెంట్​పైల్స్​పై పడే వరద ప్రవాహ ఒత్తిడిని లెక్కలోకి తీసుకోకుండానే వాటిని నిర్మించారని పేర్కొన్నది. అప్​స్ట్రీమ్​, డౌన్​స్ట్రీమ్​లలో రాక్​మ్యాపింగ్​ చేయకుండానే సీకెంట్​ పైల్స్​ను నిర్మించినట్టు తెలిపింది. లాంచింగ్​ ఆప్రాన్​ మందం బ్యారేజీ వరదలకు సరిపోదని పేర్కొన్నది. దిగువన ఒక మీటర్​, ఎగువన 1.2 మీటర్ల మందంతోనే లాంచింగ్​ ఆప్రాన్లను ఏర్పాటు చేశారని, ఐఎస్​ కోడ్స్​ స్టాండర్డ్స్​​ ప్రకారం కనీసం 1.86 మీటర్ల మందం ఉండాలని తెలిపింది. సీసీ బ్లాకుల పొడవు కూడా సరిపోనూ లేదని వెల్లడించింది. 

5 బోర్ హోల్స్​ టెస్టులే..

మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్​లో 33, 34, 35, 36, 37వ నెంబర్​ గేట్ల వద్ద బోర్​ హోల్స్​ టెస్టులు చేశారని ఐఐటీ రూర్కీ రిపోర్టు తేల్చింది. 24 మీటర్ల నుంచి 26 మీటర్ల లోతు వరకు బోర్​హోల్స్​ తవ్వి, టెస్టులను నిర్వహించినట్టు వెల్లడించింది. ‘‘ఐఎస్​ కోడ్​ 13578 (2008) ప్రకారం ప్రతి పియర్, ప్రతి పిల్లర్, ప్రతి గేటు వద్ద జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ, మేడిగడ్డ ఏడో బ్లాక్​లో 11  గేట్లుంటే.. కేవలం 5 గేట్ల వద్దనే నీటి ఒత్తిడిని తట్టుకునే శక్తి, సెటిల్​మెంట్​కు సంబంధించి బోర్​హోల్స్​ టెస్టులు నిర్వహించారు. మిగతా వాటికి టెస్టులు చేయలేదు. బ్యారేజీ ఎగువన, దిగువన సీకెంట్​పైల్స్​ అలైన్​మెంట్​కు తగ్గట్టుగానే పరీక్షలు నిర్వహించారు. బ్యారేజీ సెటిల్​మెంట్​​కు సంబంధించి పునాది వెడల్పును 5 మీటర్లను ప్రామాణికంగా తీసుకొని లెక్కించారు. మేడిగడ్డ ఏడో బ్లాక్​ ఫౌండేషన్​ వెడల్పు 110 మీటర్లుగా ఉంది. అంటే లెక్కించిన దాని కన్నా చాలా ఎక్కువ. తక్కువ వాల్యూస్​ తీసుకోవడం వల్ల జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్​ రిపోర్టులో పేర్కొన్న సెటిల్​మెంట్​​తో పోలిస్తే.. యాక్చువల్​ సెటిల్​మెంట్​​ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నది. వీటికితోడు మట్టి లేదా ఇసుక కొట్టుకుపోయే ముప్పునకు సంబంధించిన టెస్టులనూ చేయలేదని తేల్చింది. 

కొన్ని స్టడీస్​ చేయనేలేదు..

బ్యారేజీ దిగువన ఎనర్జీ డిసిపేషన్​ (బ్యారేజీ గేట్లను ఎత్తాక వరద దిగువకు వెళ్లేటప్పుడు ఏర్పడే వరద ప్రవాహ శక్తిని తగ్గించే ఏర్పాట్లు) బాగానే ఉందని చెప్పినా.. అందుకు గల ప్రామాణికతను మాత్రం జియోఫిజికల్​ ఇన్వెస్టిగేషన్​ రిపోర్టులో ఆనాడు పేర్కొనలేదని ఐఐటీ రూర్కీ రిపోర్ట్​ పేర్కొన్నది ‘‘క్రాక్​ ఫ్లో స్టడీస్​ (గేట్​కు క్రాకులొచ్చి తన్నుకొచ్చే వరద) చేయలేదు. ఆ శక్తిని తగ్గించేందుకు ఏర్పాట్లు లేవు. దిగువన టెయిల్​ వాటర్​ తక్కువగా ఉండడంతో ఈ క్రాక్​ ఫ్లో వల్ల వరద ప్రవాహ వేగం ఎక్కువయ్యే ముప్పు ఉంటుంది. తద్వారా దిగువన గుంతలు పడే ప్రమాదం ఎక్కువ. బ్యారేజీ దిగువన స్టిల్లింగ్​ బేసిన్​ (వరద వదిలినప్పుడు దిగువన నీరు దూకే స్థలం) వద్ద స్కవర్​పై సరైన స్టడీస్​ చేయలేదు. మోడల్​ స్టడీస్​లో ఎక్కడా షూటింగ్​ వెలోసిటీస్​పై అధ్యయనం చేయలేదు. వరద ప్రవాహం ఎట్లుందన్న అంశాలనూ రిపోర్ట్​లో పేర్కొనలేదు. గేట్లను కొద్ది ఎత్తులో తెరిచి వరదను విడుదల చేసినప్పుడు స్టిల్లింగ్​ బేసిన్​ పరిస్థితి ఎలా ఉంటుందో తేల్చే పరీక్షనూ నిర్వహించలేదు. ఐఎస్​ కోడ్స్​ ప్రకారం ప్రతి బ్యారేజీకీ ఇసుక సెడిమెంటేషన్​పై స్టడీ చేయాల్సి ఉంటుంది. కానీ, మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఈ సెడిమెంటేషన్​ స్టడీస్​ను చేయనే లేదు’’ అని ఐఐటీ రూర్కీ రిపోర్ట్ లో తేల్చి చెప్పింది.

రాఫ్ట్​కు సీకెంట్​పైల్స్​ను కనెక్ట్​ చేయలేదు..

బ్యారేజీ దిగువన సీకెంట్​ పైల్స్​ను రాఫ్ట్​కు కనెక్ట్​ చేస్తూ నిర్మించాల్సి ఉన్నా.. అలా చేయలేదని రిపోర్ట్​ తేల్చింది. గ్యాప్​ ఇస్తూ వాటర్​ స్టాప్స్​తో నిర్మించడం వల్ల.. రాఫ్ట్, పైల్స్​కు మధ్య రంధ్రాలు పడి నీటి లీకేజీ లు ఏర్పడ్డాయని తెలిపింది. దాంతోపాటు స్కవర్​(బ్రిడ్జి లేదా బ్యారేజీ పైల్స్​ వద్ద సుడులు ఏర్పడి గుం తలా ఏర్పడడం) సైజును సరిగ్గా అంచనా వేయకుండా సీకెంట్​పైల్స్​ను డిజైన్​ చేశారని పేర్కొన్నది. ‘‘రాఫ్ట్​ బరువు కారణంగా సీకెంట్​పైల్స్​పై పడే ఒత్తిడిని పరిగణనలోకి తీసుకోలేదు. దానికి తోడు ఎర్త్​ ప్రెజర్​, అప్​లిఫ్ట్​ ప్రెజర్​నూ సరిగ్గా లెక్కించలేదు. ఆ ఒత్తిడిని తగ్గించుకునేందుకు బ్యారేజీకి దిగువన భూమిలోపల ఉన్న బండరాళ్ల లోపలికి ఎక్కువ లోతు వరకు సీకెంట్​ పైల్స్​ను నిర్మించాలి. అందుకు తగ్గట్టుగా సీకెంట్​పైల్స్​ను రాఫ్ట్​కు అనుసంధానం చేయాలి. కానీ, అలా చేయలేదు. కేవలం వాటర్​స్టాప్స్​ జాయింట్స్​ను ఏర్పాటు చేశారు. దీంతో వరద ప్రవాహ వేగానికి ఆ జాయింట్లు విచ్ఛిన్నమై పైల్స్​పై ప్రభావం పడింది. వరద ప్రవాహ దిశ.. దూరంలో మార్పులు జరిగి బ్యారేజీ ఎఫెక్ట్​అయింది’’ అని వెల్లడించింది. దీంతో బయటకు వరద తన్నుకు వచ్చే ఎగ్జిట్​ గ్రేడియంట్​ వాల్యూలో తేడాలొచ్చి బ్యారేజీ ఏడో బ్లాక్​కు చేటు చేసిందని తెలిపింది.