మునగాల, వెలుగు : ఎట్టకేలకు మునగాల జడ్పీటీసీగా దేశిరెడ్డి జ్యోతి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ముగ్గురు పిల్లల సంతానం ఉండడంతో మునగాల జడ్పీటీసీగా కొనసాగిన నల్లపాటి ప్రమీల ఎన్నిక చెల్లదని హుజూర్నగర్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు2వ స్థానంలో ఉన్న జ్యోతిని మునగాల జడ్పీటీసీగా ప్రమాణస్వీకారం చేయించాలని హైకోర్టు కలెక్టర్ ను ఆదేశించింది. కోర్టు ఆదేశానుసారం జడ్పీ సీఈవో అప్పారావు జ్యోతితో ప్రమాణస్వీకారం చేయించారు. 2019లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం ఉమ్మడి అభ్యర్థిగా దేశిరెడ్డి జ్యోతి, బీఆర్ఎస్ తరఫున నల్లపాటి ప్రమీల పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో ప్రమీల గెలువగా, జ్యోతి రెండో స్థానంలో ఉన్నారు. నిబంధనల ప్రకారం ముగ్గురు సంతానం ఉన్నవారు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రమీలకు ముగ్గురు పిల్లలు ఉన్నందున ఆమెను అనర్హురాలిగా ప్రకటించి, తనకు న్యాయం చేయాలని 2019లో దేశిరెడ్డి జ్యోతి కోర్టును ఆశ్రయించింది. నాలుగేండ్ల విచారణ అనంతరం గత ఫిబ్రవరి 5న జడ్పీటీసీగా నల్లపాటి ప్రమీల ఎన్నిక చల్లదని హుజూర్నగర్ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది. అనంతరం హుజూర్నగర్ కోర్టు జడ్జిమెంట్ కాపీని పరిశీలించిన కలెక్టర్ జడ్పీటీసీగా నల్లపాటి ప్రమీలను తొలగించి రెండో స్థానంలో ఉన్న దేశిరెడ్డి జ్యోతిని జడ్పీటీసీగా కొనసాగించాలని జడ్పీ సీఈవోకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని ప్రమీల హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ పొందారు. స్టే ఆర్డర్ ను రద్దుచేసి తనను ప్రమాణస్వీకారం చేయించేందుకు చర్యలు తీసుకోవాలని దేశిరెడ్డి జ్యోతి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన కోర్టు ప్రమీల స్టే ఆర్డర్ ను రద్దుచేసి జ్యోతితో ప్రమాణస్వీకారం చేయించాలని ఆఫీసర్లకు ఈనెల 5న ఆదేశించింది. దీంతో బుధవారం సూర్యాపేటలోని జడ్పీ ఆఫీసులో సీఈవో అప్పారావు జడ్పీటీసీగా దేశిరెడ్డి జ్యోతితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మండల ప్రజలు, సీపీఎం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.