సన్నాలు సెంటర్లకు వస్తలే

సన్నాలు సెంటర్లకు వస్తలే
  • బహిరంగ మార్కెట్​లో సన్నాలకు డిమాండ్​
  • బోనస్​ ఇస్తమన్న సరిగా తెస్తలేరు
  • కొన్నింటిలో వచ్చినా తేమ కారణంగా కొనడం లేదు
  • సన్న రకం వడ్ల కోసమే సపరేట్​గా 47 సెంటర్లు ఓపెన్

యాదాద్రి, వెలుగు : సన్నాలకు బోనస్​ ఇస్తామని ప్రకటించినా రైతుల నుంచి స్పందన రావడం లేదు. బహిరంగ మార్కెట్​లో సన్న వడ్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున కొనుగోలు సెంటర్లకు దొడ్డు వడ్లను మాత్రమే తెస్తున్నారు. కొన్ని సెంటర్లకు తెచ్చిన సన్న వడ్లను తేమ కారణంగా కొనుగోలు చేయడం లేదు. యాదాద్రి జిల్లాలో 2024 వానాకాలం సీజన్​లో 2.85 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇందులో సన్న రకం వడ్లను 35 వేల ఎకరాల్లో సాగు చేశారు. మొత్తంగా 6.25 టన్నుల దిగుబడి వస్తుందని, ఇందులో సన్నాలు 75 వేల టన్నులు, దొడ్డు రకం 5.50 లక్షల టన్నులు రానుంది.

 రైతుల తిండి అవసరాలు, బయట మార్కెట్​లో అమ్మకాలకుపోనూ 4 లక్షల టన్నులు కొనుగోలు సెంటర్లకు వచ్చే అవకాశాలున్నాయని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. ఇందులో కనీసం 30 వేల టన్నుల సన్నరకం వడ్లు వస్తాయని ఆఫీసర్లు భావించారు. మొత్తం 369 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఇందులో సన్న రకాల కోసమే సపరేట్​గా 47 సెంటర్లు ఓపెన్​ చేశారు. 

సన్నాల్లో 33 రకాలు..

వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్​షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం ఈ సీజన్ నుంచే సన్నాలకు రూ.500 బోనస్​ ఇస్తోంది. దొడ్డు రకంలో గ్రేడ్–ఏకు రూ.2,320, కామన్​ వైరేటీకి రూ.2,300 ఇవ్వనుంది. 33 సన్న రకాలను గుర్తించిన ప్రభుత్వం, ఆ రకాలకు బోనస్​తో కలుపుకొని రూ.2,820 అందించనుంది. 33 రకాల్లో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్​15,048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం వంటి రకాలు ఉన్నాయి. అయితే గింజ పొడవు, వెడల్పును పరిశీలించి ఈ సన్న రకాలను  మైక్రో మీటర్ ద్వారా గుర్తించాల్సి ఉంది. 

సన్నాలు సరిగా వస్తలే..

సన్న వడ్లు క్వింటాల్​కు ప్రభుత్వం రూ.500 బోనస్​ ఇస్తున్నందున కచ్చితంగా వడ్లు వస్తాయని ఆఫీసర్లు భావించారు. అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయి. సన్నాల కోసం సపరేట్​గా 47 సెంటర్లు ఓపెన్​ చేసినా వడ్లు రావడం లేదు. సన్నాలకు బహిరంగ మార్కెట్​లో డిమాండ్ ఎక్కువగా ఉంది. క్వింటాల్ బియ్యానికి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు రేటు పలుకుతోంది. అందుకే వడ్లు మరాడించి అమ్మాలని సన్నాలు పండించిన రైతులు ఆలోచిస్తున్నరు. దీంతో పాటు రైతులు తమ తిండి కోసం సన్నాలనే వాడుకుంటున్నారు. దీనికి తోడు సన్నరకాలను తక్కువగా సాగు చేయడం వల్ల, వచ్చిన ఆ కాస్తా దిగుబడిని రైతులు సెంటర్లకు తేవడం లేదు. కొన్ని సెంటర్లకు సన్నాలు వచ్చినా.. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కొనడం లేదు. 

సన్నాలు 50 టన్నులే..

ధాన్యం సెంటర్లు ఓపెన్​ చేసి నెల కావస్తోంది. ఇటీవల వడ్ల కొనుగోలు స్పీడప్​ అయింది. దీంతో మొత్తంగా 61 వేల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్​డిపార్ట్​మెంట్​కొనుగోలు చేసింది. దీంట్లో సన్నాలు కేవలం 50 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. 30 వేల టన్నులు వస్తాయని అంచనా వేసినా సెంటర్లకు సన్నాలు రాకపోవడంతో చివరకు మూడు వేల టన్నులైనా వస్తయని ఆఫీసర్లు లెక్కలు వేసుకుంటున్నారు.