(వెలుగు స్పోర్ట్స్ డెస్క్): వరల్డ్ కప్ లో ఐదుసార్లు విన్నర్ ఆస్ట్రేలియా తర్వాత టీమిండియానే సెకండ్ బెస్ట్ టీమ్. 1983, 2011లో కప్పు నెగ్గిన ఇండియా 2003లో రన్నరప్‌గా నిలిచింది. 1987, 1996, 2015, 2019 ఎడిషన్లలో సెమీఫైనల్స్ చేరింది. ఒక్క 2007 ఎడిషన్‌లో గ్రూప్ దశలోనే నిష్ర్కమించినప్పటికీ ఆ తర్వాత ప్రతి టోర్నీలో ఇండియా ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది.
కానీ, గమ్యాన్ని ముద్దాడలేకపోయింది. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఎలాగైనా కప్పు నెగ్గాలన్న టార్గెట్‌తో పక్కా ప్లానింగ్‌తో ముందుకొచ్చింది. ఈ క్రమంలో గత నవంబర్‌లో టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్, కోహ్లీ,రాహుల్, షమీ, సిరాజ్‌తో పాటు బుమ్రా, శ్రేయస్ అయ్యర్‌లను షార్ట్ ఫార్మాట్‌కు పక్కనపెట్టి వన్డేలపై దృష్టి సారించారు. అయితే టీమ్‌లో కీలకం అనుకున్న రిషబ్ కారు యాక్సిడెంట్‌కు గురవగా.. బుమ్రా, రాహుల్, అయ్యర్ గాయాలతో కొన్ని నెలలు ఆటకు దూరం కావడం జట్టును కలవరపెట్టింది.
కానీ వరల్డ్ కప్ ముంగిట ఈ ముగ్గురూ కోలుకోవడంతో పాటు తిరిగొచ్చి తమ ఫామ్ చూపెట్టారు. రీఎంట్రీలో చైనామన్ కుల్దీప్ యాదవ్ ప్రమాదకర బౌలర్‌గా మారడం కలిసొచ్చే అంశం. పైగా, ఆసియా కప్ నెగ్గి, ఆస్ట్రేలియాతో సిరీస్‌ను గెలిచిన ఊపులో రోహిత్‌సేన టోర్నీలో ఫేవరెట్‌గా అడుగు పెడుతున్నది. అయినా ఇండియాలో కొన్ని లోపాలు, సమస్యలు ఉన్నాయి. టీమ్ రైట్ హ్యాండర్లపై ఎక్కువగా ఆధారపడటం, మిడిలార్డర్ ఇంకా కుదురుకోకపోవడం వాటిలో ప్రధానమైనవి.
గిల్, సిరాజ్ కీలకం..
గత పదేళ్ల నుంచి ఆడిన మెగా టోర్నీల్లో ఇండియా బ్యాటింగ్‌ను రోహిత్, కోహ్లీ నడిపిస్తుండగా.. ఇప్పుడు వారి వారసుడిగా నయా సూపర్‌స్టార్ శుభ్‌మన్ గిల్ కూడా తోడై మన టాపార్డర్ బలంగా మారింది. అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్న గిల్ వన్డేల్లో మరింత చెలరేగిపోతున్నాడు. ఈ ఏడాదే ఐదు సెంచరీలు కొట్టి భీకర ఫామ్‌లో ఉన్నాడు. వన్డే బ్యాటర్లలో రెండో ప్లేస్‌లోకి వచ్చాడు.
ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయడంతో పాటు మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్‌ను నిర్మించే సత్తా ఉన్న గిల్‌పై అందరి దృష్టి ఉంది. ఇక, ఏడాది సూపర్ స్వింగ్, స్పీడ్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్న నంబర్ వన్ బౌలర్, హైదరాబాదీ సిరాజ్ కూడా టీమ్‌కు కీలకం కానున్నాడు. సీనియర్లు బుమ్రా, షమీ ఉన్నా ఫామ్ దృష్ట్యా తనే బౌలింగ్ ఎటాక్‌ను నడిపించినా ఆశ్చర్యం లేదు. ఆసియా కప్ ఫైనల్లో చేసిన పెర్ఫామెన్స్‌ను రిపీట్ చేస్తే సిరాజ్ స్పీడ్‌ను తట్టుకోవడం ఏ బ్యాటర్‌కైనా సవాలే.
వీళ్లకు ఫేర్‌వెల్ ..
తనకిదే చివరి వరల్డ్ కప్ అని స్పిన్నర్ అశ్విన్ ప్రకటించగా.. ఏజ్ దృష్ట్యా కెప్టెన్ రోహిత్ శర్మ (36), విరాట్ కోహ్లీ (34)కి ఇదే చివరి వరల్డ్ కప్ అవ్వొచ్చు. వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ స్టార్స్ అయిన ఈ ఇద్దరూ తమ కెరీర్ చివర్లో టీమిండియాకు వరల్డ్‌కప్‌ను అందిస్తే అంతకుమించిన ఆనందం మరోటి ఉండదు. ప్లేయర్‌గా కోహ్లీ 2011 వరల్డ్ కప్‌లో భాగం అవ్వగా.. రోహిత్ కెరీర్‌లో వన్డే ట్రోఫీ లోటుగా ఉంది.
వీళ్లకు తోడు ప్రస్తుత టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మరింత ఫ్యూచర్ ఉన్న జడేజా, కేఎల్ రాహుల్, శ్రేయస్, సూర్యకుమార్ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. టీమ్, ఫామ్, హోం గ్రౌండ్ అడ్వాంటేజ్, సింపుల్ ఫార్మాట్ దృష్ట్యా రోహిత్‌సేన సెమీఫైనల్ చేరడం కష్టమేం కాబోదు. అయితే, అక్కడి నుంచి మరో రెండు మెట్లు ఎలా ఎక్కుతుందనేదే కీలకం. ఇదివరకు నాలుగుసార్లు సెమీస్‌లో, ఓసారి ఫైనల్లో బోల్తా కొట్టిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ఆఖరి రెండు అడ్డంకులను దాటి మన జట్టు మూడోసారి విశ్వవిజేత అవ్వాలని ఆశిద్దాం.
వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ టీమ్ మనదే. ఈ ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్, వరల్డ్ నం.2 బ్యాటర్లు మనోళ్లే. ఈ తరం వరల్డ్ క్రికెట్‌లో సూపర్ స్టార్స్ మన టీమ్‌లోనే ఉన్నారు. ఇటీవలే ఆసియా కప్ నెగ్గాం. మొన్ననే ఆస్ట్రేలియాను ఓడించి వన్డే సిరీస్ గెలిచాం.
అన్నిటికి మించి టోర్నీ జరుగుతోంది మన దేశంలోనే. టీమిండియా మళ్లీ వన్డే వరల్డ్ కప్ గెలిచేం దుకు.. పుష్కరకాలంగా ఊరిస్తున్న మూడో ట్రోఫీ ముచ్చట తీర్చుకునేందుకు ఇంతకుమించిన సమయం దొరుకుతుందా? రేపటి నుంచి మొదలయ్యే మెగా టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న ఇండియా మూడో కప్పుతో ‘తీన్’మార్ కొట్టాలని ప్రతీ అభిమాని ఆశిస్తున్నాడు.