మున్సిపల్ కుర్చీలు కాపాడుకునేందుకు..బీఆర్ఎస్ పాట్లు!

  • రంగంలోకి ఎమ్మెల్యే జగదీశ్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల
  •     సూర్యాపేట, భువనగిరి కౌన్సిలర్లతో వేర్వేరు మీటింగ్‌‌‌‌‌‌‌‌లు
  •     కలిసికట్టుగా ఉండాలని సూచన
  •     కుర్చీలు చేజారితే మళ్లీ దక్కవని హెచ్చరిక 

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : సొంత పార్టీ కౌన్సిలర్ల తిరుగుబాటును బీఆర్ఎస్​జీర్ణించుకోలేకపోతోంది. మున్సిపాలిటీల్లో మెజార్టీ ఉన్నా.. చైర్మన్ కుర్చీలు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నల్గొండ పీఠం చేజారగా.. సూర్యాపేట, భువనగిరి, ఆలేరు మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కుర్చీలు కూడా నేడోరేపో అన్నట్లు ఉన్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగుతున్నారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని, పార్టీ కౌన్సిలర్లలో చీలిక వస్తే తీవ్రంగా నష్టపోతామని హెచ్చరిస్తున్నారు.  పట్టు జారితే తిరిగి దక్కించుకోవడం చాలాకష్టమని నచ్చజెప్తున్నారు.
 
ఇప్పటికే చేజారిన నల్గొండ

గతేడాది వరకు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలూ దాదాపుగా బీఆర్​ఎస్​ ఖాతాలోనే ఉన్న సంగతి తెలిసిందే.  మూడేండ్ల కాలపరిమితి ముగియగానే  భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్​, యాదగిరిగుట్ట సహా పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు.  

కానీ, గత ప్రభుత్వం ఇవి చర్చకు రాకుండా అడ్డుకోలిగింది.  గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైకోర్టు తీర్పుతో  అవిశ్వాసాలు మళ్లీ తెరపైకి వచ్చినా.. అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్​ రావడంతో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పడ్డాయి. ఎన్నికల్లో  బీఆర్ఎస్​ పవర్​ పోగానే చౌటుప్పల్​, యాదగిరిగుట్ట చైర్మన్లు కాంగ్రెస్​లో చేరిపోయారు.  ఇటీవల నల్గొండలో అవిశ్వాసం పెట్టి చైర్మన్‌‌‌‌‌‌‌‌, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కుర్చీలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గుంజేసుకుంది.  సూర్యాపేట, భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీల్లో 23, 27 తేదీల్లో అవిశ్వాసం మీటింగ్​పెట్టనున్నట్లు కలెక్టర్లు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.  

కౌన్సిలర్లతో చర్చలు

నల్గొండ చేజారడం, మిగిలిన మున్సిపాలిటీల అవిశ్వాసం తేదీలు కన్ఫాం కాగానే.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్​రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల  శేఖర్​రెడ్డి రంగంలోకి దిగారు. సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు 30 మంది కౌన్సిలర్లలో చైర్మన్ అన్నపూర్ణకు అనుకూలంగా ఉన్న 14 మంది కౌన్సిలర్లను జగదీశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి హైదరాబాద్​కు పిలిపించుకున్నారు.

జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అందరూ కలిసి ఉండాలని సూచించారు. చైర్మన్​ సీటు చేజారితే తిరిగి నిలబెట్టుకోలేమని వివరించారు. పార్టీ గుర్తుపై గెలిచి అసమ్మతి వర్గంలో చేరిన పార్టీ కౌన్సిలర్లతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించాలని సూచించారు.  చేరిన వారి వివరాలను తెలుసుకొని, అవిశ్వాసం మీటింగ్​ రోజున విప్​ జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ఇటీవల భువనగిరికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి  చైర్మన్​ ఎనబోయిన ఆంజనేయులు శిబిరంలో ఉన్న నలుగురితో పాటు అవిశ్వాసంపై సంతకాలు చేసిన 16 మంది అసమ్మతి కౌన్సిలర్లతో చర్చలు జరిపారు. విబేధాలు ఉంటే పరిష్కరించుకోవాలని, 20 మంది ఉండి కూడా చైర్మన్​ పీఠం చేజార్చుకుంటే.. తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు. 

క్యాంప్‌‌‌‌‌‌‌‌ క్యాన్సిల్ చేసుకున్న ఆలేరు కౌన్సిలర్లు

ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్​ వస్పరి శంకరయ్య అవిశ్వాసం లేఖపై సంతకాలు చేసిన వారితో రహస్యంగా మాట్లాడినట్టుగా తెలిసింది. దీంతో క్యాంప్​నకు వెళ్లడానికి రెడీ అయిన పలువురు కౌన్సిలర్లు వెనక్కి తగ్గినట్టుసమాచారం.

అయితే తామందరం ఒకే పట్టుపై ఉన్నామని, పండుగ తర్వాత క్యాంప్​కు వెళ్తామని అసంతృప్తి కౌన్సిలర్​ చెప్పారు. ముందు అవిశ్వాసం నెగ్గేలా చూసుకొని చైర్మన్‌‌‌‌‌‌‌‌ను పదవి నుంచి దింపుతామని,  ఆ తర్వాత  ఎవరు చైర్మన్​ కావాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.  ఈ పరిణామాలతో బీఆర్ఎస్​కు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లు చైర్మన్​గా తామే ఉంటామని అంటుండగా.. అసమ్మతి వర్గంతో పాటు కాంగ్రెస్​, బీజేపీ కౌన్సిలర్లు  గద్దె దించుతామని స్పష్టం చేస్తున్నారు.