- కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో1.55 కోట్ల టన్నుల వరి దిగుబడి
- పంపుహౌస్‌ల కరెంట్ బిల్లే ఏటా రూ.4 వేల కోట్లు
- ఈ ఏడాది మోటార్లు నడవకపోవడంతో ప్రభుత్వానికి ఆ మేరకు ఆదా
- 2019 నుంచి 2021 వరకు పంపులు నడిపినా కోటి టన్నులే దిగుబడి
- ఈ ఏడాది వర్షాలు మంచిగా పడడంతో నిండిన ప్రాజెక్టులు
- వాటితోనే రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి
హైదరాబాద్, వెలుగు:రూపాయి కరెంట్ ఖర్చు లేకున్నా రాష్ట్రంలో కరువుదీరా పంటలు పండాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అని చెప్పుకునే మేడిగడ్డ నుంచి నీటిచుక్క రాకున్నా.. ప్రాజెక్టులోని 3 ప్రధాన పంప్‌హౌస్‌ల నుంచి నీళ్లు ఎత్తిపోయకున్నా సిరుల పంటలు పండాయి. కాళేశ్వరం నీళ్లు లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం దిగుబడి ఆల్‌టైం రికార్డు నమోదైంది. గత ఐదేండ్లలో ఖరీఫ్‌లో కోటి టన్నులకుపైగా ధాన్యం వస్తే.. ఈ ఏడాది ఒక్క ఖరీఫ్ సీజన్లోనే కోటిన్నర టన్నుల వడ్ల దిగుబడి రావడం విశేషం.
పైగా నీటి ఎత్తిపోతలకు రూపాయి ఖర్చు కూడా పెట్టకుండానే ఇది సాధ్యం కావడం మరో విశేషం. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణి చేస్తామన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ మాటలు నీటి మూటలే అయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుది వట్టి కథే అని తేలిపోయింది. అసలు ఆ ప్రాజెక్టే లేకున్నా.. వేల కోట్ల ఖర్చు పెట్టనవసరం లేకుండా రాష్ట్ర రైతాంగం రికార్డు పంట పండించింది.
కాళేశ్వరం పంపుల కరెంట్ ఖర్చే రూ.4 వేల కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టుతోనే పంటలు పచ్చగా ఉన్నాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఊదరగొట్టింది. కానీ, 2022లో పంప్‌హౌస్‌లు మునిగినప్పటి నుంచి అవి పనిచేసిన దాఖలాలు లేవు. ఒక్క టీఎంసీ నీటినీ ఎత్తిపోసింది లేదు. ప్రాజెక్టును ప్రారంభించిన 2019 నుంచి 2022 వరకు 165 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే.. కేవలం లక్షన్నర ఎకరాలకే నీళ్లివ్వడం గమనార్హం. అయితే, పంపులు పనిచేసినన్నేండ్లు ఏటా వాటి విద్యుత్ బిల్లులే రూ.4 వేల కోట్లకుపైగా వచ్చాయి.
ఇప్పటికీ డిస్కంలకు వాటికి సంబంధించిన బిల్లులను క్లియర్ చెయ్యలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తొలి ఏడాది వచ్చిన పంట కేవలం 89.76 లక్షల టన్నులే. ఆ తర్వాత 2020లోనూ నీటిని ఎత్తిపోసినా వరి దిగుబడులు 96.31 లక్షల టన్నులే వచ్చాయి. 2021లో 1.24 కోట్ల టన్నుల వరి దిగుబడి రాగా.. 2022లో 1.38 కోట్ల దిగుబడులు వచ్చాయి. 2023లో కాళేశ్వరం ప్రధాన పంప్‌హౌస్‌లు పనిచేయకున్నా 1.45 కోట్ల టన్నుల వరి దిగుబడి రావడం విశేషం.
ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా కూడా అత్యధికంగా 1.55 కోట్ల టన్నుల పంట పండింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఎంత మేరకుందన్నది తేలిపోయింది. ఈ ఏడాది సర్కారుకు కాళేశ్వరం పంప్‌హౌస్‌ల కరెంట్ బిల్లుల రూపంలో దాదాపు రూ.4 వేల కోట్లు మిగిలాయి.
వర్షాలతోనే మంచి పంటలు
మేడిగడ్డ లేకపోయినా ఈ ఏడాది ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీటిని ఎత్తిపోసింది. 27 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోయగా.. వాటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వాడుకున్నారు. అది కూడా కేవలం ఒక్క నెలపాటే ఎత్తిపోయాల్సి వచ్చింది. మిగతా అంతా వర్షాలతో పండిన పంటలే. ఈ ఏడాది రుతుపవనాలు త్వరగా రావడం.. వర్షాలు దండిగా పడడంతో నీటి వనరులు పూర్తిగా నిండిపోయాయి. వర్షాలు సాధారణం కన్నా 50 శాతం అధికంగా పడ్డాయి.
ఒకేసారి పడిపోవడం కాకుండా.. టైంకు తగ్గట్టు వర్షాలు పడ్డాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షాకాలంలో దాదాపు 70 రోజులపాటు వర్షాలు కురిశాయి. గోదావరి బేసిన్లో వరద కొంత ఆలస్యమైనా ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు వచ్చి చేరాయి. దీంతో ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేసి, అధికారులు చెరువులను నింపారు. దీంతో భూగర్భజలాలు కూడా పుష్కలంగా పెరిగాయి.
చెరువుల కింద పొలాలు పచ్చగా కళకళలాడాయి. ఇటు రైతులు బోర్ల ద్వారా పంటలకు నీళ్లు పెట్టుకున్నారు. వాటితోపాటు ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు, కడెం వంటి ప్రాజెక్టులతో పాటు.. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా కూడా నీటిని ఆయకట్టుకు సరఫరా చేశారు. దీంతో కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు, చెరువులతోనే ఆయకట్టుకు సమృద్ధిగా నీరందిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.