పంట రుణాలు.. రైతులను ఆదుకోవట్లే

పంట రుణాలు.. రైతులను ఆదుకోవట్లే

రైతులు ఏ పంటలు వేయాలన్నా వారికి ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. ఈ పెట్టుబడి కోసం రైతులు ప్రధానంగా ఆధారపడేది పంట రుణాలపైనే. 
సాధారణంగా బ్యాంకులు తక్కువ వడ్డీకి రైతులకు రుణాలు ఇస్తుంటాయి. వీటిని తీసుకుని పంటలు పండించడం రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో బ్యాంకులు పంట రుణాలను ఇవ్వడం బాగా తగ్గించేశాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పంట రుణాలు ఇచ్చేలా బ్యాంకులను ఒప్పించలేక పోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలు మాఫీ చేయకపోవడమే ప్రధాన కారణం. దీంతో తప్పనిసరై రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నారు. ప్రకృతి విపత్తులు, ఇతర కారణాలతో పంటలు దెబ్బతిన్నా, తెచ్చిన ప్రైవేట్ రుణాలు మాత్రం చెల్లించాల్సిందే. ఈ పరిస్థితుల్లో రైతు బంధు, రైతు బీమా పథకాలు ఉన్నప్పటికీ ధనిక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు.

రెండ్రోజుల క్రితం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో పంటల వ్యవసాయ రుణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశం నాటికే రైతులు పంటలు వేసి నెల రోజులు గడిచింది. పంటలు వేయడానికి ముందు రైతులకు తప్పనిసరిగా పైసలు అవసరం. కానీ, రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి రూ.20 వేల కోట్ల వరకూ అధిక వడ్డీకి రుణాలు తెచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నారు. ప్రైవేట్ రుణాలు వాయిదా వేయడానికి లేదు. ఎప్పటికప్పుడు వడ్డీని చెల్లించాల్సిందే. 3, 4 లక్షలు అప్పు పైబడితే వాటిని తీర్చలేక చిన్న, సన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్ట్​ నుంచి జులై 30 వరకు 18 నుంచి 59 ఏండ్ల వయస్సు వారికి రైతు బీమా ప్రీమియం చెల్లిస్తుండగా, ప్రతి సంవత్సరం 16,100 మంది రైతులు మరణిస్తున్నారు. ప్రీమియం వయస్సు గడువును 75 ఏండ్లకు పెంచితే రైతుల మరణాలు మరో 8 వేలు పెరుగుతాయి. అంటే ఏటా 25 వేల మంది రైతులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారన్న మాట. ఇది మన వ్యవసాయ రంగం పరిస్థితి. 

రైతు ఆత్మహత్యలకు అప్పులే కారణం

రైతుల మరణాలకు కారణం రుణాలే. సంస్థాగత రుణాలు తీసుకున్న రైతులు చాలావరకు ఆత్మహత్యలకు పాల్పడరు. బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం వలన అటు బ్యాంకులు, ఇటు రైతులు ఇంతవరకు నష్టపోయిందిలేదు. కానీ ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆదేశాల మేరకు రైతులకు రుణాలు తగ్గించేసిన బ్యాంకులు పెట్టుబడిదారులకు రుణంగా ఇస్తున్నాయి. వారు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేయడం చూస్తున్నాం. రైతులకు రుణాలు ఎలా ఇవ్వాలి. గతంలో అనుసరించిన విధానం ఏమిటి? అనేది ఒకసారి చూద్దాం. జిల్లా స్థాయి టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయం మేరకు ‘స్కేల్​ ఆఫ్​ ఫైనాన్స్ ప్రకారం’ ఎకరానికి నిర్ణయించిన విధంగా రైతుకు ఉన్న భూమిని బట్టి పంట రుణాలు ఇవ్వాలి. పంట రుణం కోరిన ప్రతి రైతుకు నిరాకరించకుండా బ్యాంకులు రుణ సౌకర్యం కల్పించాలి.  

40 శాతం ఇవ్వాలి.. 12 శాతం కూడా ఇవ్వట్లే

రిజర్వ్​ బ్యాంకు ఆదేశాల ప్రకారం బ్యాంకులు తమ వ్యాపార ధనంలో 40% వ్యవసాయ రుణాలివ్వాలి. ఇందులో 18% పంట రుణాలు, 22% దీర్ఘకాలిక రుణాలుగా ఇవ్వాలి. ఈ వ్యవసాయ రుణ మొత్తంలో 15% దళితులు, గిరిజనులకు విధిగా ఇవ్వాలి.పాలక వర్గాలు వ్యవసాయ రుణాలకు అంకెలు ప్రకటించి రైతులకు ఎగనామం వేస్తున్నాయి. 2020 మార్చి 31 నాటికి తెలంగాణ బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.4,84,440 కోట్లు. 40% వ్యవసాయ రుణాల లెక్క చూసినా రూ.1,93,776 కోట్లు ఇవ్వాలి. ఇందులో 18% పంట రుణాల కింద(వానాకాలం, యాసంగి, దీర్ఘకాలిక రుణాల కింద రూ.87,199.20 కోట్లు ఇవ్వాలి.) గత అనుభవాలను బట్టి చూస్తే 11–-12 శాతానికి మించి ఏనాడు బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన తరువాత ఆ కొద్ది రుణాలు కూడా ఇవ్వడం తగ్గించేశాయి.

మాఫీ చేసినా వడ్డీ భారం తప్పలేదు

2014లో రాష్ట్ర ప్రభుత్వం రూ.16,124.38 కోట్లతో 35 లక్షల మంది రైతుల పంట రుణాలను రద్దు చేసింది. ప్రభుత్వం నాలుగు విడతలుగా మాఫీ మొత్తం చెల్లించడంతో రైతులపై రూ.9,812 కోట్ల వడ్డీ భారం పడింది. బ్యాంకులకు బాకీలు ఉండటంతో అటు రైతులు, ఇటు ప్రభుత్వం చెల్లించక నాలుగేండ్లు రైతులు బ్యాంకు రుణాలకు నోచుకోలేదు. రుణమాఫీ జరిగిన తర్వాత బ్యాంకు రుణాలు పొందడానికి అవకాశం వచ్చినా తిరిగి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్ష రూపాయలలోపు బాకీ పడినవారికి తిరిగి మాఫీ ప్రకటించారు. రూ.25,936 కోట్లు మాఫీ చేస్తే 40.66 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. కానీ రైతులు, ప్రభుత్వం రుణాలు చెల్లించకపోవడంతో మళ్లీ బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం రూ.25 వేల లోపు రుణం పొందిన రైతులకు ఒకే విడతగా రూ.1,197 కోట్లతో 5.83 లక్షల మందికి మాఫీ డబ్బులు చెల్లించింది. వీరు మాత్రమే మళ్లీ రుణం పొందడానికి అర్హులు. మిగిలిన 35 లక్షల మంది అనర్హులుగా ఉన్నారు. 

కొత్త వారికి రుణాలు ఇవ్వాలన్న ఆర్​బీఐ

వాస్తవానికి రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉండగా నేటికీ బ్యాంకులు 41 లక్షల మందికే రుణాలిస్తున్నాయి. మిగతా 19  లక్షల మంది ఈనాటికీ బ్యాంకు గడప తొక్కలేదు. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. ప్రతి బ్యాంకు బ్రాంచి ఏటా 100 మంది కొత్తవారికి రుణాలివ్వాలని ఆర్​బీఐ ఆదేశించింది. రాష్ట్రంలో 2020 డిసెంబర్​ 31 నాటికి 5,749 బ్యాంకు బ్రాంచిలుండగా అందులో 1,963 మెట్రో, 727 పట్టణ బ్రాంచిలు ఉన్నాయి. వీటిని మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3,059 బ్యాంకు బ్యాంచిలు ఉన్నాయి. ఇవి 100 మంది కొత్త రైతులకు రుణాలిస్తే ఏటా 3,05,900 మందికి రుణాలివ్వవచ్చు. అలా మూడేండ్లలో 10 లక్షల మందికి కొత్తగా రుణాలందేవి. కానీ దీనిని పాటించట్లేదు. 2021–-22లో రూ.87,200 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం రూ.71,401 కోట్లను మాత్రమే రుణ ప్రణాళికలో ప్రకటించింది. ఈ మొత్తం కూడా పంపిణీ చేస్తారన్న గ్యారంటీ లేదు. కారణం రైతులు బాకీ ఉండటమే. రైతుబంధుకు ఇచ్చిన డబ్బులు కూడా పాత బాకీల కింద జమ చేసుకుంటున్నారు. 

ఆర్​బీఐ గైడ్​లైన్స్​ పాటించాలె

రాష్ట్ర ప్రభుత్వం ఆర్​బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకుల నుంచి రైతులకు రుణాలిప్పించాలి. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే బ్యాంకర్ల సమావేశాల్లో రైతు ప్రతినిధులకు అవకాశం ఇవ్వాలి. గతంలో ఉన్న ఈ అవకాశాన్ని ప్రభుత్వం తొలగించింది. బ్యాంకర్లు గ్రామీణ ప్రాంతాల్లో డిపాజిట్లు సేకరించి అధిక వడ్డీకి పట్టణాల్లో రుణాలిస్తున్నాయి. దేశీయ ఉత్పత్తికి తోడ్పడుతున్న వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానాన్ని తేవాలి. దెబ్బతిన్న సహకార సంఘాలను కొలిక్కి తీసుకురావాలి. సహకార సంఘాల ద్వారా పేద రైతులకు రుణ లభ్యత తేలిక. అందువల్ల గ్రామీణ బ్యాంకుల ద్వారా పంట రుణాలను ఇప్పించాలి. రైతులు ప్రైవేట్ అప్పులకు వెళ్లకుండా సంస్థాగత రుణాలు అందేలా చూడాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటే సాగును లాభసాటిగా మార్చడమే కాదు.. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడవచ్చు.

చట్టాన్ని పట్టించుకోవట్లేదు

కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం జూన్, జులైలో రైతుల వద్ద నుంచి అప్పులు వసూలు చేయడం కానీ, జప్తు చేయడం కానీ నేరం. జప్తు చేసిన బ్యాంకుపై ప్రభుత్వం లేదా రైతు కోర్టులో చర్యలు తీసుకునే హక్కు ఉంది. రైతును జూన్ నుంచి డిసెంబర్ వరకు రుణం కోసం ఇబ్బంది పెట్టరాదు. డిసెంబర్ లో పంట పండిన తర్వాత రుణం వసూలు చేసుకోవచ్చు. అయితే చట్టాలను పట్టించుకోని బ్యాంకులు జూన్ లో కూడా వసూళ్లు చేస్తున్నాయి. రైతులు పంట రుణాలకేకాక దీర్ఘకాలిక రుణాలకూ ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు వేయడం, పైపులైన్ వేయడం, పంపులు కొనడం, పంట పొలాల్లో కాలువల నిర్మాణం చేయడంతోపాటు పశువులు, యంత్రాలు కొనడానికి లోన్లు అవసరం. వీటి కోసం కూడా బ్యాంకుల దగ్గర కాక ప్రైవేట్ రుణాలు తీసుకుంటున్నారు. భూములు తాకట్టు పెడుతున్నారు. వాటిని తీర్చలేక తక్కువ ధరలకు విలువైన భూములను కోల్పోతున్నారు. 

- మూడ్ శోభన్, 
తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి