- ఇండియాకు తప్పని ఓటమి
- తొలి టీ20లో 38 రన్స్ తేడాతో ఇంగ్లండ్ గెలుపు
- చెలరేగిన సివర్, బ్రంట్
ముంబై: బ్యాటింగ్‌లో ఫెయిలైన ఇండియా విమెన్స్ టీమ్.. టీ20 సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది. టార్గెట్ ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ (42 బాల్స్‌లో 9 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీతో పోరాడినా మిగతా వారి నుంచి సహకారం లేకపోవడంతో.. బుధవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 38 రన్స్ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0–1తో వెనకబడింది.
టాస్ ఓడిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 197/6 స్కోరు చేసింది. సివర్ బ్రంట్ (53 బాల్స్‌లో 13 ఫోర్లతో 77), డాని వ్యాట్(47 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75) దంచికొట్టారు. తర్వాత ఇండియా 20 ఓవర్లలో 159/6 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (26), రిచా ఘోష్ (21) ఓ మాదిరిగా ఆడారు. బ్రంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం జరుగుతుంది.
కీలక భాగస్వామ్యం..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను ఆరంభంలోనే రేణుకా సింగ్ (3/27) దెబ్బకొట్టింది. తొలి ఓవర్ నాలుగు, ఐదు బాల్స్‌కు సోఫియా డంక్లె (1), అలీస్ క్యాప్సీ (0)ను ఔట్ చేసింది. దీంతో 2/2తో కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను సివర్, వ్యాట్ గట్టెక్కించారు. పవర్‌ప్లేలో 44/2తో ఉన్న ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. 6వ ఓవర్‌లో సివర్ రెండు ఫోర్లతో, తర్వాతి ఓవర్‌లో వ్యాట్ రెండు ఫోర్లతో బ్యాట్లు ఝుళిపించారు.
దీప్తి శర్మ వేసిన 9వ ఓవర్‌లో తొలి సిక్స్ కొట్టిన వ్యాట్ తర్వాతి ఓవర్‌లో మరో ఫోర్ బాదడంతో ఇంగ్లండ్ 89/2 స్కోరుతో ఫస్ట్ టెన్ ఓవర్స్‌ను ముగించింది. 11వ ఓవర్‌లో సివర్ వరుస ఫోర్లతో రెచ్చిపోయింది. కానీ 12వ ఓవర్‌లో రెండో సిక్స్ కొట్టిన వ్యాట్.. ఐదో బాల్‌కు ఇచ్చిన క్యాచ్‌ను పూజా డ్రాప్ చేసింది. 34 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన వ్యాట్ మరో మూడు ఫోర్లతో ఒత్తిడి పెంచింది. మధ్యలో రెండు బౌండ్రీలు బాదిన సివర్ 36 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసింది. ఈ ఇద్దరి జోరుతో 15 ఓవర్లలో 140/2తో పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లండ్‌ను ఇషాక్ (1/38) దెబ్బకొట్టింది.
16వ ఓవర్ ఫస్ట్ బాల్‌కు వ్యాట్‌ను ఔట్ చేసి మూడో వికెట్‌కు 138 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేసింది. కెప్టెన్ హీథర్ నైట్ (6) ఫోర్‌తో ఖాతా తెరవగా, 17వ ఓవర్‌లో సివర్ మూడు ఫోర్లతో 19 రన్స్ రాబట్టింది. 18వ ఓవర్‌లో నైట్‌ను శ్రేయాంక (2/44) ఔట్ చేయగా, అమీ జోన్స్ (23) ఫోర్‌తో స్వాగతం పలికింది. 19వ ఓవర్లో సివర్‌ను రేణుక ఔట్ చేసినా.. లాస్ట్ ఓవర్‌లో జోన్స్ 6, 4, 4, ఫెర్రీ కెంప్ (5 నాటౌట్) ఫోర్ కొట్టడంతో ఇంగ్లండ్ భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.
షెఫాలీకి దక్కని సపోర్ట్..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ ఫోర్‌తో ఇన్నింగ్స్ ఓపెన్ చేసినా మరో ఓపెనర్ స్మృతి మంధానా (6) నుంచి ఆమెకు సహకారం అందలేదు. మూడో ఓవర్‌లోనే స్మృతి ఔట్ కావడంతో ఇండియా 20 రన్స్‌కు తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో షెఫాలీ నాలుగు ఫోర్లతో రెచ్చిపోయినా.. జెమీమా (4) కూడా నిలవలేకపోయింది. 41/2 వద్ద వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నిలకడగా ఆడటంతో పవర్‌ప్లేలో ఇండియా 53/2 స్కోరు చేసింది. తర్వాత షెఫాలీ, హర్మన్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ముందుకుసాగారు.
9వ ఓవర్‌లో హర్మన్ 4, 6, 4తో 18 రన్స్ దంచింది. ఫస్ట్ టెన్‌లో 82/2తో ఉన్న ఇండియాకు 11వ ఓవర్‌లో గట్టి దెబ్బ తగిలింది. జోరుమీదున్న హర్మన్‌ను ఎకిల్‌స్టోన్ (3/15) ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు 41 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. రిచా ఘోష్ ఉన్నంతసేపు వేగంగా ఆడింది. ఓ ఫోర్, సిక్స్‌తో నాలుగో వికెట్‌కు 40 రన్స్ జోడించి ఔటైంది. 37 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన షెఫాలీ 17వ ఓవర్‌లో ఔట్ కావడంతో ఇండియా 134/5తో ఎదురీత మొదలుపెట్టింది. చివర్లో కనికా అహూజ (15), పూజా వస్త్రాకర్ (11 నాటౌట్), దీప్తి శర్మ (3 నాటౌట్) పోరాడే ప్రయత్నం చేసినా ఓవర్లు పూర్తి కావడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 197/6 (సివర్ 77, వ్యాట్ 75, రేణుకా సింగ్ 3/27). ఇండియా: 20 ఓవర్లలో 159/6 (షెఫాలీ 52, హర్మన్‌ప్రీత్ 26, ఎకిల్‌స్టోన్ 3/15).