కోట్లు ఖర్చు చేస్తున్నా వదలని దోమల బెడద

కోట్లు ఖర్చు చేస్తున్నా వదలని దోమల బెడద
  • పెరిగిపోతున్న రోగాలు
  • ఆఫీసర్ల ఇండ్లలోనే ఫాగింగ్
  • మిగిలిన చోట్ల అస్తవ్యస్తం
  • ఏటా రూ.2కోట్లు బుగ్గిపాలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో ఎటు చూసినా దోమలే కనిపిస్తున్నాయి. సాయంత్రం అయిందంటే చుట్టుముడుతున్నాయి. మురుగుకాల్వలు, నాలాల్లో పూడికతీత తీయకపోవడంతో విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. రోగాలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దోమల నివారణకు ఆయిల్ బాల్స్, ఫాగింగ్ వంటి చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. వీటికోసం ఏటా రూ.2కోట్లు ఖర్చు చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం చర్యలు కనిపించడం లేదు.

శానిటేషన్​ అస్తవ్యస్తం..

సిటీలో 66 డివిజన్లు 1,450కి పైగా కాలనీలు ఉన్నాయి. చాలాచోట్ల డ్రైనేజీలు లేవు. ఉన్నచోట్ల పూడికతీత, మరమ్మతులు జరగడం లేదు. దీంతో మురుగు నీరు రోడ్లపైనే ఏరులై పారుతోంది.  ఫలితంగా దోమలు వృద్ధి చెంది, కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. విలీన గ్రామాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఫీల్డ్ విజిట్ చేసి, యాక్షన్ తీసుకోవాల్సిన ఆఫీసర్లు ఇండ్లకే పరిమితం కావడంతో, ఫాగింగ్ చర్యలు ఆగిపోయాయి. కౌన్సిల్ మీటింగ్ లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఒకట్రెండ్రోజులు కొట్టి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదు.

ఆఫీసర్లు, సిబ్బంది ఇండ్లకే..

మున్సిపల్ పబ్లిక్​ హెల్త్ ​విభాగంలో ఇదివరకు 36 ఫాగింగ్​ మెషీన్లు ఉండగా.. కొత్తగా మరో 18 మెషీన్లు తెప్పించారు. మలేరియా సిబ్బందికి కొత్త హ్యాండ్​ పంపులు కూడా వచ్చాయి. వీటిని ప్రతి డివిజన్  కు ఒకటి చొప్పున పంపిణీ చేయాల్సి ఉండగా.. కొన్ని పంపిణీ చేసి, మిగతా వాటిని అర్బన్​ మలేరియా ఆఫీసులోనే భద్రపరిచారు. కొంతమంది సిబ్బంది ఆఫీసర్లు, తాము నివాసం ఉండే ఇండ్లలోనే ఫాగింగ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విలీన గ్రామాల్లో నెలకు ఒక్కసారి కూడా ఫాగింగ్ చేయడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.

ఏటా రూ.2 కోట్లకుపైగా ఖర్చు...

సిటీలో దోమల నియంత్రణ కోసం కెమికల్స్​, యాంటీ మలేరియా ఆయిల్స్​, ఫాగింగ్​ మెషీన్లు, వాహనాలకు డీజిల్​, పెట్రోల్​ తదితర ఖర్చులు, సిబ్బంది వేతనాల పేరున జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు  ఏటా రూ.2 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. అయినా క్షేత్రస్థాయిలో దోమల నియంత్రణ చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఫాగింగ్​ చేయకుండానే చేసినట్లు, ఆయిల్ బాల్స్​ వేయకుండానే వేసినట్లు రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.  రోజూ ఫాగింగ్ చేస్తున్నామని ఆఫీసర్లు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో  మాత్రం అసలు ఫాగింగ్​చేసిన దాఖలాలే కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఇకనైనా గ్రేటర్​ ఉన్నతాధికారులు నగరంలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నారు.

ఇంతవరకు ఫాగింగ్ చేయలే

సిటీతో పాటు విలీన గ్రామాల్లో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఫాగింగ్​ చేస్తున్నామని చెప్తున్నారు కానీ రెండు నెలల నుంచి ఫాగింగ్​ చేయడం లేదు. దోమల వల్ల చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ఇకనైనా నగర పరిధిలోని అన్ని డివిజన్లలో ఫాగింగ్​ చేసేలా చర్యలు తీసుకోవాలి. నిధులు సక్రమంగా వినియోగించేలా పెద్దాఫీసర్లు యాక్షన్ తీసుకోవాలి.

- పోలపల్లి చంద్రశేఖర్​, 65వ డివిజన్​

ప్రతి ఏరియాను కవర్​ చేస్తున్నం

వరంగల్ నగరంలో ప్రతిరోజు ఫాగింగ్​ చేస్తున్నాం. ఆదివారం కూడా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నాం. కంప్లైంట్స్​ వచ్చిన ఏరియాలతో పాటు మిగతా ప్రాంతాల్లోనే ఫాగింగ్​ చేస్తూ.. ప్రతి 4 రోజులకో డివిజన్​ పూర్తి చేస్తున్నాం. విలీన గ్రామాల్లో కూడా దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.

- డా.జ్ఞానేశ్వర్​, 
సీఎంహెచ్​వో, జీడబ్ల్యూఎంసీ