ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం.. అభివృద్ధి పథంలో భారత్​

గడిచిన మూడు సంవత్సరాల నుండి ఊహాన్ (కోవిడ్-19) వైరస్,  రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్​ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, క్రూడ్ ఆయిల్, ఇతర నిత్యావసర ధరల ద్రవ్యోల్బణం. ఇలా ఎన్నో అడ్డంకులు, మరెన్నో ఆటంకాలతో  ప్రపంచ అగ్ర దేశాలతో పాటు దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ప్రపంచంలోనే అగ్ర దేశం అమెరికా 50 ఏళ్ల చరిత్రలో అత్యధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్య భయాలు, సిలికాన్ వ్యాలీ లాంటి బ్యాంకుల దివాళా,  ప్రతి మూడు నెలలకు ఒకసారి పెరుగుతున్న ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు ఇంకా అప్పుల యొక్క పరిధి దాటిపోయి అమెరికా ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేని స్థాయికి వెళ్ళింది.  ఇంక మరో ధనిక దేశమైన జర్మనీ రోజు రోజుకు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతున్నది. రోజురోజుకు జర్మనీలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం 7.4% కారణంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు. జర్మనీ ఈ రోజు రుణాత్మక ప్రగతితో ఆర్థిక మాంద్యంలోకి జారింది. ఇంకా బ్రిటిష్ దేశం ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది.
పా కిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లో ఆకలి మంటలు, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాలు దొరకక అల్లాడుతున్న జనాలు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోవడానికి ప్రపంచ దేశాలతో సహా భారతదేశంపై ఆధారపడ్డ శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు. శ్రీలంకకి భారత్ చేసిన ఆర్థిక సహాయం వల్ల ఈ రోజు ఆ దేశం కుప్ప కూలిపోకుండా ఉండగలుగుతున్నది. పైన పేర్కొన్న అన్ని సమస్యలను  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల వాటిని పరిష్కరించి, అధిగమించి, అభివృద్ధి పథంలో సాగుతున్న  దేశంగా  భారతదేశం అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నది. నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్​ఓ) 31 మే 2023 రోజు విడుదల చేసిన లెక్కల ప్రకారం నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశం 2021-– 22 ఆర్థిక సంవత్సరానికి 9.1%  జీడీపీ వృద్ధిరేటుతో  మరియు 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి 7.2% జీడీపీ వృద్ధిరేటుతో   ప్రపంచంలోనే మొదటి వరుసలో నిలబడింది. ప్రస్తుతం భారతదేశం ఐదవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్, రాహుల్ గాంధీతో చర్చిస్తూ భారతదేశానికి 2022 –- 23 ఆర్థిక సంవత్సరం అతి కష్టమైన ఆర్థిక సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు శాతం గ్రోత్ రేటు ఉంటే అదృష్టం లాగా భావించాలని వ్యాఖ్యానించడం, మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అందరి అంచనాలకు మించి ప్రపంచంలోనే  అత్యంత అభివృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిర్భవించింది. 

చారిత్రాత్మక నిర్ణయాలే జీడీపీని పెంచుతున్నాయి

ప్రపంచవ్యాప్తంగా గుదిబండ లాగ తయారైన ఆర్థికపరమైన అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత భారతదేశంలో అధికారంలో ఉన్న  ఎన్​డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ  నాయకత్వంలో తీసుకున్న చారిత్రాత్మక విధానపరమైన నిర్ణయాలైన దేశంలోని మొబైల్, ఆటోమొబైల్, ఫార్మా, సోలార్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, వస్త్ర పరిశ్రమ, ఏవియేషన్, కెమికల్స్, టెలికాం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఇతరత్రా 14 ఉత్పత్తి రంగాల అభివృద్ధి కోసం దాదాపుగా 3 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకం సాధించిన విజయం ఇది. కరోనా కట్టడికి దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్, స్టార్టప్ ఇండియా స్కీం ద్వారా వందకు పైగా యూనికార్న్ కంపెనీలతో ప్రపంచంలో మూడవ స్థానం, పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు, 100 లక్షల కోట్లతో గతి శక్తి ప్రణాళికతో దేశంలో మౌలిక సదుపాయాలైన రోడ్డు రవాణ, రైల్వే, వాయు మరియు ఇతర రంగాల సత్వర అభివృద్ది. మూలధన పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఒక్క 2023 బడ్జెట్లో 10 లక్షల కోట్ల పైచిలుకు నిధుల కేటాయింపు. రక్షణ రంగంతో పాటుగా అన్ని రంగాలలో పెరుగుతున్న ఎగుమతులు, ఆత్మనిర్భర్ భారత్ అద్భుతమైన విజయాలతో  భారతదేశ 2026-– 27 నాటికి 5 లక్షల కోట్ల  జీడీపీతో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి విశ్వగురువుగా అవతరించబోతుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. 100 సంవత్సరాల స్వతంత్ర భారతావని వచ్చేనాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాలలో రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు.

ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టిన ఎన్​డీఏ సర్కారు

ప్రస్తుత ధరల ప్రకారం భారతదేశం యొక్క సాధారణ జీడీపీ 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 16.1% వృద్ధిరేటుతో 272.41 లక్షల కోట్లు (3.5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ) . ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యంలో ఉన్నా, భారతదేశం యొక్క జీడీపీ వృద్ధిరేటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 6.5% నుంచి 7% గా ఉండబోతుందని  అంతర్జాతీయ సర్వేలు వెల్లడించడం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా భారతదేశం ప్రపంచంలో జీడీపీ వృద్ధిరేటులో మొదటి స్థానంలో ఉండబోతుంది అన్నది వాస్తవం. ప్రపంచ దేశాలన్నీ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతుంటే భారతదేశం 4.8 శాతానికి ద్రవ్యోల్బణాన్ని  అదుపు చేయడం గొప్ప శుభ సూచకంగా భావించాలి. అమెరికా దేశంలో  ప్రస్తుతం ఆరు శాతం పైనే ద్రవ్యోల్బణం ఉంది. ఎన్నో ఆర్థికపరమైన  నిర్ణయాలు,  అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గడిచిన 14 నెలల్లో పదిసార్లు వడ్డీ రేట్లు పెంచి  దాదాపుగా జీరో వడ్డీరేట్ల నుంచి ప్రస్తుతం 5.25 శాతం ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్  రేటుకు తీసుకెళ్లినప్పటికీ నిత్యావసర వస్తువుల సేవల ధరలను  అదుపులో పెట్టలేక పోతోంది.

- బీరప్ప బేజాడి,
బీజేపీ నాయకుడు, జనగామ