- షెడ్యూల్ వచ్చినా కొనసాగుతున్న విభేదాలు
- రాజీ కుదిర్చే పనిలో పార్టీ పెద్దలు
- అభ్యర్థిని మార్చాలని అసమ్మతి నేతల పట్టు
- రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమైన ఎన్నారై
సూర్యాపేట/కోదాడ వెలుగు : ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కోదాడ బీఆర్‌ఎస్ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి మొదలైన అసంతృప్తి జ్వాలలు ఎంతకూ చల్లారడం లేదు. అభ్యర్థిని మార్చాల్సిందేనని, లేదంటే వ్యతిరేకంగా పనిచేస్తామని అసమ్మతి నేతలు మొండిపట్టు పడుతున్నారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి బుజ్జగించినా వెనక్కి తగ్గడం లేదు. దీనికి తోడు టికెట్ ఆశించిన భంగపడ్డ ఎన్నారై నేత జలగం సుదీర్ రెబల్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించడం పార్టీకి తలనొప్పిగా మారింది.
రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు
అసమ్మతి నేతలు, ఎమ్మెల్యే మధ్య రాజీ కుదిర్చేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు రోజుల కింద తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లో అసమ్మతి నేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో కలిసి పనిచేయాలని, ప్రభుత్వం ఏర్పడగానే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు వాళ్లు అంగీకరించడం లేదు. గత ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి బొల్లం మల్లయ్య యాదవ్‌ను గెలిపించామని గుర్తుచేశారు.
కానీ, ఆయన తీరుతో నాలుగున్నరేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని వాపోయారు. తమను పార్టీ కార్యక్రమాలు కూడా పిలవకుండా ఏకపక్షంగా వ్యవహరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లోనూ అభ్యర్థిని గెలిపిస్తే పదవులు ఇస్తామని మాటిచ్చి తప్పారని మండిపడ్డారు. ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో అనేక ఆరోపణలు ఉన్నాయని, ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చకుంటే పార్టీ ఓడిపోయవడం ఖాయమని హెచ్చరించారు. చేసేది లేక వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బరిలోకి దిగుతానంటున్న జలగం సుదీర్
టికెట్ ఆశించిన భంగపడ్డ ఎన్నారై జలగం సుధీర్ రెబల్‌గా బరిలోకి దిగుతానని సోషల్ మీడియాతో వేదికగా ప్రకటించడం కోదాడలో హాట్ టాపిక్ గా మారింది. కోదాడ నియోజకవర్గానికి చెందిన ఈయన ఫేస్ బుక్, వాట్సాప్ వేదికగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. నవంబర్ 4 లేదా 5వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సాప్ట్ వేర్ ఉద్యోగి అయిన ఆయన 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు.
2014లోనే పార్టీ టికెట్ ఆశించిన ఆయన ఎన్నికలలో కేసీఆర్ హామీతో విరమించుకున్నారు. 2018 ఎన్నికలలో కేటీఆర్ హామీతో పోటీ నుంచి తప్పుకొని పార్టీ అభ్యర్థుల కోసం పని చేశారు. ఈ సారి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తనకు టికెట్ ఇవ్వాని హైకమాండ్‌ను కోరారు. కానీ, మొండిచెయ్యి చూపడంతో రెబెల్ గా పోటీలో ఉంటానని ప్రకటించారు. ఇప్పటికే అసమ్మతి నాయకులు అభ్యర్థిని మార్చాలని పట్టు బడుతుండగా, జలగం సుధీర్ వ్యవహారం పార్టీకి నష్టం చేస్తోందని క్యాడర్ వాపోతున్నారు.