
హైదరాబాద్: హైదరాబాద్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. మటన్, చేపల అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుందనే కారణంతో చికెన్ కొనేందుకు హైదరాబాద్ నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. గత 15 రోజులుగా ఎక్కువ మొత్తంలో సేల్స్ పడిపోయాయని చికెన్ దుకాణ యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు బర్డ్ ఫ్లూ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ చికెన్ రేట్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. హైదరాబాదులో చికెన్ ధర 140 రూపాయల నుంచి 160 రూపాయల వరకు అమ్ముతున్నారు.
చికెన్ అమ్మకాలు తగ్గిపోవడంతో కనీసం మెయింటనెన్స్లు కూడా కష్టమవుతున్నాయని చికెన్ సెంటర్ల నిర్వాహకులు వాపోతున్నారు. చికెన్ కు డిమాండ్ తగ్గిపోవడంతో హైదరాబాద్ వ్యాప్తంగా మటన్, చేపల ధరలకు రెక్కలొచ్చాయి. ముక్క లేనిదే ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులు చికెన్ బదులు మటన్, చేపలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. మటన్ ధరపై 100 రూపాయలు, చేపల ధరపై 30 రూపాయలు అదనంగా పెరిగింది. తెలంగాణాలోని యాదాద్రి జిల్లా నేలపట్లలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసు నమోదైంది. హైదరాబాద్లో రోజుకు 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుండగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఇందులో సగం కూడా అమ్ముడుపోవడం లేదు.
చికెన్ ను 70 డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెప్తున్నారు. ఉడికీ ఉడకని చికెన్, గుడ్లు తింటేనే బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందంటున్నారు. బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకదని, పక్షులు, జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుందంటున్నారు. బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు, కోళ్లు చనిపోయే అవకాశం ఉంది కానీ, మనుషులపై మాత్రం ప్రభావం తక్కువే ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు. హెచ్5ఎన్1 వైరస్ సోకిన కోళ్లకు సన్నిహితంగా ఉండేవాళ్లకే బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందని.. కోళ్లఫారాలు, చికెన్ షాపుల్లో పనిచేసే వ్యక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు సూచించారు.