దేశవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో సుమారు పది కోట్ల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, కార్మిక సంఘాల దశాబ్దాల పోరాటం ఫలితంగా1996లో అప్పటి ప్రభుత్వం నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకొచ్చింది. నేటి పాలకులు ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ.. బడా కంపెనీలకు, కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వాల పట్టిలేని తనంతో పేదలైన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం లేదు.
1998 సెస్ యాక్ట్ ప్రకారం పది లక్షల పైగా వ్యయంతో నిర్మించే అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాల నుంచి100కి ఒక రూపాయి చొప్పున సెస్ వసూలు చేయాలి. కార్మిక నాయకులు, అధికారులు, బిల్డర్లతో అడ్వైజరీ బోర్డును నియమించి దాని సలహా మేరకే ఆ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా బోర్డు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.75 వేల కోట్ల వరకు సెస్ ద్వారా జమయ్యాయి.
ఇప్పటి వరకు అన్ని రకాల పరిహారాల కోసం కార్మికులకు ఖర్చు పెట్టినవి రూ.30 వేల కోట్లు మాత్రమే. మిగిలిన రూ. 45 వేల కోట్లు వివిధ రాష్ట్రాల వెల్ఫేర్ బోర్డుల్లోనే మూలుగుతున్నాయి. ఆ నిధులు కార్మికుల సంక్షేమం కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఉన్న నిధులతో కార్మికులకు కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి, వాటిని సక్రమంగా అమలు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు.
రాష్ట్రంలో బోర్డు నిధులు ఆగమాగం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి నేటి వరకు బోర్డులో సెస్ ద్వారా జమైన నిధులు రూ. 3,286 కోట్లు మాత్రమే. చిత్తశుద్ధితో సెస్వసూలు చేసి ఉంటే మరో రూ.2 వేల కోట్లకు పైగా జమై ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన తెలంగాణ వాటా రూ. 450 కోట్లు బ్యాంకులోనే మూలుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2022 జులై 1 వరకు ట్రైనింగ్, ఆఫీసు నిర్వహణ పేరుతో కార్మికుల కోసం ఖర్చు చేసింది రూ. 668 కోట్లు మాత్రమే.
వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులను కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా, కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టకుండా, నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా దారి మళ్లిస్తూ కేసీఆర్ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేస్తోంది. కరోనా సమయంలో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెల్ఫేర్ బోర్డుల నుంచి నిధులు ఇచ్చి ఆదుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కార్మికులకు ఎలాంటి సాయం అందించలేదు. పైగా రూ.1005 కోట్లు అక్రమంగా సివిల్ సప్లయ్స్ శాఖకు మళ్లించింది. అడ్వైజరీ బోర్డు కమిటీ తీర్మానం లేకుండా కార్మిక సంఘాలను సంప్రదించకుండా, దొడ్డిదారిన మళ్లించడం అన్యాయం.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సంక్షేమ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించలేదు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న కీలక పోస్టులను నింపకుండా కాలయాపన చేస్తోంది. వెల్ఫేర్ బోర్డు స్కీములను నీరుగారుస్తూ కంచె చేను మేసినట్లుగా ఉన్న నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేస్తోంది. కార్మిక శాఖ కార్యాలయాలు పెరవీకారులకు, బ్రోకర్లకు అడ్డాలుగా మారాయి. అవినీతిని అరికట్టడానికి అడ్వైజరీ కమిటీ లేదు. కార్మిక శాఖకు పర్మినెంట్ లేబర్ కమిషనర్ లేరు. ఆ శాఖను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన కార్మిక శాఖ మంత్రి పట్టించుకోవడం లేదు.
లక్ష మోటార్ సైకిళ్లు ఏమాయె?
రాష్ట్రంలో ఉన్న 25 లక్షల భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులను బోర్డు సభ్యులుగా నమోదు చేయాల్సి ఉన్నా, ఇప్పటి వరకు13 లక్షల13 వేల మందిని మాత్రమే నమోదు చేసి గుర్తింపు కార్డులు ఇచ్చారు. మిగతా12 లక్షల మంది కార్మికులను బోర్డులో నమోదు చేయడం లేదు. గతంలో నమోదు చేసుకున్న వారిని రెన్యువల్ చేయడం లేదు. ఇలా లక్షలాది మంది కార్మికులకు సంక్షేమ పథకాలు అందకుండా ప్రభుత్వం కుట్ర చేస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నష్ట పరిహారాలు పెండింగ్ లో ఉన్నా, నిధులు విడుదల చేయడం లేదు. మొన్నటి మార్చి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మేడే రోజున కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్వయంగా ప్రకటించటంతో నిర్మాణ కార్మికులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కనీస వేతనాల సలహా మండలి ప్రతిపాదన మేరకు కార్మికులకు వేతనం రూ.18 వేలు ఉండాలని నిర్ణయించగా, కంపెనీల ఓనర్లు, కాంట్రాక్టర్ల ఒత్తిడితో ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలి. - ఆర్.కోటంరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీడబ్ల్యూఎఫ్ఐ