కలెక్టర్ ఆదేశించినా.. ఆగని అక్రమ నిర్మాణాలు

  • జిల్లా కేంద్రంలో ఆఫీసర్ల కనుసన్నల్లోనే జోరుగా అక్రమ నిర్మాణాలు
  • నోటీస్​లిచ్చి మమ అనిపిస్తున్న ఆఫీసర్లు...
  • ఆగని కమర్షియల్​ బిల్డింగ్​ నిర్మాణాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంతో పాటు చుంచుపల్లి మండలంలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌‌ ఆదేశాలు ఇస్తున్నా ఆఫీసర్లు మాత్రం పట్టించుకోకపోవడం లేదు. కలెక్టర్ మాటల్ని సైతం పెడచెవిన పెట్టి అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కలెక్టర్​ ప్రియాంక అలా విద్యానగర్​ కాలనీలో చేపడ్తున్న ఓ అక్రమ నిర్మాణాన్ని ఆపించారు. కలెక్టర్​ ఆపిన తర్వాత కూడా ఆఫీసర్ల కళ్లేదుటే నిర్మాణాలు కొనసాగుతుండడంతో అందరూ నోరెళ్ల బెడుతున్నారు. 

నోటీసులతో సరి..

మేం అడిగినంత ఇస్తే చాలు, పర్మిషన్స్​తో పని లేదన్నట్లు ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణం చేపట్టిన వారికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కలెక్టర్, ఉన్నతాధికారులు ఆదేశాలిస్తే పనులు ఆపేస్తున్నా ఆఫీసర్లు హడావుడి తగ్గగానే అక్రమ నిర్మాణాలను పట్టించుకోవడం లేదు.  

ఆగని అక్రమ నిర్మాణాలు.. 

కొత్తగూడెం పట్టణంలోని మున్సిపాలిటీ, తహసీల్దార్​ ఆఫీస్‌కు అతి సమీపంలో మూడంతస్తుల బిల్డింగ్​ నిర్మాణానికి అనుమతి లేదంటూ గతంలో ఆఫీసర్లు పనులను ఆపేశారు.  అక్రమ నిర్మాణమంటూ ఆఫీసర్లు ఫ్లెక్సీలు పెట్టారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి పనులు ప్రారంభించినా అటు వైపు చూడడం లేదు.  పల్​ కమిషనర్‌‌తో పాటు టౌన్​ ప్లానింగ్​ఆఫీసర్లు ఆ బిల్డింగ్​ పక్క నుంచే ప్రతి రోజు రాకపోకలు సాగిస్తుంటారు.  కమిషనర్​ రఘు దృష్టికి తీసుకెళ్తే అక్రమ నిర్మాణమా చూస్తామంటూ తేలికగా తీసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి అధికారులకు రిపోర్టు చేస్తున్నామని వారే నిర్ణయం తీసుకుంటారన్నది తమకు తెలియదని, మున్సిపల్​ టౌన్​ ప్లానింగ్​ అధికారి ప్రభాకర్​ పేర్కొంటున్నారు. 

కొత్తగూడెం మున్సిపాలిటీలో గతంలో 30కి పైగా అక్రమ నిర్మాణాలు గుర్తించి ఫ్లెక్సీలు పెట్టగా తిరిగి అన్ని చోట్ల నిర్మాణాలు జరిగాయి  పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటుంటే ఆఫీసర్లు మందీ మార్బాలంతో వచ్చి నానా హంగామా చేసి ఈ ల్యాండ్​కు సంబంధించి కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్లు లేవంటూ వారిని ఇబ్బందులు పెడ్తారు.  బడాబాబులు పెద్ద ఎత్తున కమర్షియల్​ బిల్డింగ్స్​కడ్తుంటే మాత్రం మా దృష్టికి రాలేదంటూ చెప్పి తప్పించుకోవడం కామన్​గా మారింది. 

జిల్లా కేంద్రంలో భాగంగా ఉన్న చుంచుపల్లి మండలంలో అడ్డూ అదుపు లేకుండా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా కమర్షియల్​ అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ మండలంలోని విద్యానగర్​ పంచాయతీలో పెద్ద ఎత్తున కమర్షియల్​ బిల్డింగ్​ల అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.  అధికార బీఆర్​ఎస్​ పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులు, మరో వైపు బడాబాబులు ఆఫీసర్లను మచ్చిక చేసుకొని ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడ్తుండడంపై కలెక్టర్​ ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.