స్టూడెంట్ల భవిష్యత్తు..టీచర్ల బతుకులు  ఆగం చేయొద్దు 

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలోనే వస్తున్నాయి. ఈ కారణంతో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టళ్లు మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఏ స్థాయిలో అమలు చేయాలి? దాని ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాలు ఆలోచించకుండా ప్రకటన చేయడం బాధాకరం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విద్యా రంగం, ప్రైవేటు విద్యా సంస్థలు, వాటిలో పని చేసే టీచర్లు, లెక్చరర్లు బతుకులు మళ్లీ ఆగమవుతాయని అర్థం చేసుకోకపోవడం అన్యాయం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్కసారిగా బంద్‌‌ పెట్టే బదులుగా..  ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి, విద్యార్థుల భవిష్యత్తు, ప్రైవేటు టీచర్ల బతుకులు బుగ్గిపాలు కాకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలి.


కరోనా మహమ్మారి కారణంగా కోలుకోలేని దెబ్బతిన్న రంగం విద్యా రంగమే. గత ఏడాది కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఒక్కసారిగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఆ సమయంలో కేసులు ఉన్నట్టుండి పెరుగుతుండడం, వైరస్‌‌పై పెద్దగా ఏ రీసెర్చ్‌‌లు కూడా జరగకపోవడంతో దాని లక్షణాలు, తీవ్రత, దాని ఎదుర్కోవడం ఎలా అన్నవి పెద్దగా తెలియని స్థితిలో లాక్‌‌డౌన్‌‌ చేయడం సరైన నిర్ణయమే. కానీ ఈ ఎఫెక్ట్ 2020–21 విద్యా సంవత్సరంపై కూడా పడింది. గత ఏడాది జూన్‌‌లో తెరవాల్సిన స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ కాలేదు. ఆన్‌‌లైన్ క్లాసులు ఉన్నా అవి చాల చోట్ల అంతంత మాత్రంగానే జరిగాయి. 2021 ఫిబ్రవరిలో నేరుగా క్లాసులు స్టార్ట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ అంతలోనే మళ్లీ మూసివేత ఊహించని నిర్ణయమే. అక్కడక్కడ కేసులు పెరుగుతున్నాయని ఇప్పుడు మొత్తంగా రాష్ట్రమంతా స్కూళ్లు, కాలేజీలు పూర్తిగా బంద్‌‌ పెట్టాల్సిన అవసరం ఉందా అన్నది ఆలోచించాలి. ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ సాగుతోంది. మరోవైపు కరోనాను ఎదుర్కొంటూ బతకడం ఎలానో ఏడాదిగా అందరం తెలుసుకున్నాం. ఈ టైమ్‌‌లో మూసివేత బదులుగా మరో ప్రత్యామ్నాయాన్ని సర్కారు ఆలోచించకపోవడం కరెక్టేనా?
మళ్లీ బతుకులు రోడ్డున పడాల్నా?
తెలంగాణలో మొత్తం దాదాపు 11 వేల స్కూళ్లు, 1856 జూనియర్ కళాశాలలు, 856 డిగ్రీ, పీజీ కాలేజీలను ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. వీటన్నింటిలో సుమారు రెండు లక్షల మందికి పైగా బోధనా, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. కరోనా లాక్‌‌డౌన్‌‌తో గత ఏడాది విద్యా సంస్థలను బంద్ పెట్టడంతో వాళ్లందరి జీవితాలు రోడ్డునపడ్డాయి. చాలా మంది టీచర్లు, లెక్చరర్లు కూలీ పనులకు వెళ్లి, ఆటోలు నడిపి, కూరగాయలమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాలను పోషించుకున్నారు. భావి పౌరులను తీర్చి దిద్దే గురువులకు ఈ పరిస్థితి రావడం బాధాకరం.  ఆన్‌‌లైన్ క్లాసుల ద్వారా సగం మంది స్టాఫ్‌‌ జీవితాలు ఒక రకంగా సాగినా, ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లే ఎక్కువ ఉన్నారు. కొన్ని నెలల పాటు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు.  ఎలాగో జీవితాలను సాగదీస్తున్న సమయంలో మళ్లీ స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో పేరెంట్స్, టీచర్స్ అంతా సంతోషించారు. కానీ ఉన్నట్టుండి మళ్లీ మొత్తంగా అన్ని విద్యా సంస్థలను బంద్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, ప్రైవేట్ విద్యా సంస్థల స్టాఫ్‌‌ బతుకులు రోడ్డున పడేస్తోంది.

ఆన్‌‌లైన్ ఎడ్యుకేషన్ సూట్‌‌ కాదు

విద్యా సంస్థలు మూతపడినా ఆన్‌‌లైన్‌‌లో క్లాసులు జరగడం లేదా అన్న ప్రశ్న రావచ్చు. కానీ మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇంటర్నెట్, ఆన్‌‌లైన్ క్లాసులకు సపోర్ట్ చేసే మొబైల్స్, ల్యాప్‌‌ట్యాప్‌‌ల సౌకర్యం ఎంత మేరకు ఉన్నదన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఉన్న వారికి విద్య అంది, లేని వారి పరిస్థితి గాలిలో దీపంలా ఉంటే అసమానతలు ఏర్పడవా? ఆన్‌‌లైన్ క్లాసులు అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులపైనా ఒత్తిడిపడుతోందన్నది వాస్తవం. మరోవైపు ఇటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కూడా డిజిటల్ ఎడ్యుకేషన్‌‌పై ఇంత వరకు సర్కారు ఒక క్లియర్ పాలసీ తీసుకురాలేదు. 
గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసమేనా? 
2020–21 విద్యా సంవత్సరం జూన్‌‌లో మొదలవ్వాలి. కానీ కరోనా తీవ్రత కారణంగా అది సాధ్యం కాలేదు. అయితే కేసులు కొంత మేర తగ్గిన తర్వాత ఏపీలో గత ఏడాది చివరి‌‌ నుంచే దశల వారీగా స్కూళ్లు ఓపెన్ చేయడంపై దృష్టి పెట్టారు. కానీ తెలంగాణ సర్కారు గ్రాడ్యుయేట్ ఎన్నికల ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యా సంస్థల రీఓపెన్‌‌కు అనుమతి ఇచ్చింది. అయితే మార్చి 14న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల సిబ్బంది ఓట్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానం ఇప్పుడు వస్తోంది. ఎలక్షన్లు ముగిసిన కొద్ది రోజులకే కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రంలో విద్యా సంస్థలను క్లోజ్ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. మరి కేసులు ఒక్క తెలంగాణలోనే పెరుగుతున్నాయా? దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. పక్కనే ఉన్న ఏపీ కానీ, కర్ణాటక గానీ మరే రాష్ట్రంగానీ స్కూళ్లు మొత్తంగా మూసేస్తూ నిర్ణయం తీసుకోలేదు. జాగ్రత్తలను పాటిస్తూ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఆయా రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుసహా విశాల ప్రయోజనాలను ఆలోచిస్తే మన రాష్ట్రంలోనూ అలానే ఉండేదేమోననిపిస్తోంది. కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రైవేట్ టీచర్లు, ఇతర స్టాఫ్ ఓట్ల కోసమే స్కూళ్లు తెరిచింది తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదని భావించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
యాజమాన్యాలనూ ఆదుకోలే
రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల యాజమాన్యాల ఆర్థిక పరిస్థితి గొప్పగా లేదనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అద్దె బిల్డింగ్‌‌లలో తమకు తెలిసిన విద్యను సామాన్యుల పిల్లలకు చెప్పి, వాళ్లు తీర్చిదిద్దాలన్న లక్ష్యం తప్ప ఈ విద్యా సంస్థల యాజమాన్యాలకు లాభార్జన ఆశ పెద్దగా లేదు. ఆర్థికంగా బలంగా లేని ఈ యాజమాన్యాలకు స్టూడెంట్స్ నుంచి ఫీజులు కూడా ఇన్‌‌స్టాల్‌‌మెంట్లలోనే వస్తాయి. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు మూతపడితే బిల్డింగ్‌‌ల అద్దెలు, కరెంట్ బిల్లులు వంటివి కట్టాలన్నా భారంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఆన్‌‌లైన్ క్లాసులు పెట్టి స్టాఫ్‌‌కు జీతాలు ఇస్తూ పోవడానికి అప్పులు తేవడం తప్ప మరో దారి లేదు. ఈ దుస్థితిని చూసైనా ప్రభుత్వం యాజమాన్యాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ సర్కారు ఆ రకమైన ఆలోచన చేయడం లేదు. బడ్జెట్ స్కూళ్లు, కాలేజీలు దెబ్బతింటే దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజల పిల్లలకు చదువులు దూరమవుతాయన్న విషయాన్ని సర్కారు గ్రహించాలి. ఇటు యాజమాన్యాలకు కరెంటు బిల్లుల రీయింబర్స్‌‌మెంట్ లాంటివి, ప్రైవేట్ టీచర్లకు కొంత మేర ప్రభుత్వ సాయం చేస్తే విద్యార్థుల భవిష్యత్తు కూడా నాశనం కాకుండా కాపాడినట్లవుతుంది.
ఈ రకమైన ఆల్టర్నేటివ్స్ లేవా?
    కరోనా కేసుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా తెలంగాణ అంతటా విద్యా సంస్థలు మూసేయకుండా పిల్లల చదువులు ముందుకు సాగేలా ఆల్టర్నేటివ్స్ ఆలోచించాల్సింది. కరోనా కేసులు పెరుగుతున్నది నిజమే. అసలు ఆ కేసులు ఎక్కడెక్కడ ఎక్కువగా వస్తున్నాయి? వాటి కారణాలేంటి? అన్నవాటిపై ముందు ప్రభుత్వానికి క్లారిటీ ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టొచ్చు. ఎన్నికలు జరిగిన కొద్ది రోజుల తర్వాతే కేసులు పెరుగుతున్నాయంటే ఆ డ్యూటీలకు వెళ్లిన వారికి ఏమైనా కరోనా సోకి, ఆ విద్యా సంస్థల్లో వైరస్ వ్యాపిస్తోందా అన్నది కూడా పరిశీలించాలి. ఇప్పటి వరకు కరోనా కేసులు ఎక్కువగా నమోదైంది ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లోనే. మరి అలాంటప్పుడు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలను కూడా మూసేయాల్సిన అవసరం ఏమిటి? ప్రైవేట్ విద్యా సంస్థల్లో చాలా వరకు కరోనా జాగ్రత్తలను పక్కాగా పాటిస్తున్నారు. ఎక్కడైనా పాటించకుంటే అక్కడ చర్యలు తీసుకోవచ్చు. కరోనా కేసులు ప్రభుత్వ స్కూళ్లలో, హాస్టళ్లలో ఎక్కువగా వస్తున్నాయి. ఈ కారణంతో రాష్ట్రమంతా ఉన్న అన్ని సర్కారు స్కూళ్లు, హాస్టళ్లు మూసేయాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడైనా ఒక స్కూల్‌‌లో ఒక్క కరోనా కేసు వచ్చినా వెంటనే ఆ స్కూల్ మాత్రం రెండు వారాల పాటు మూసేసి కాంటాక్ట్ ట్రాసింగ్ చేసి ఓకే అనుకున్నాకే మళ్లీ క్లాసులు స్టార్ట్ చేయొచ్చు. రాష్ట్రంలో మిగిలిన స్కూళ్లు, హాస్టళ్లను అలానే కొనసాగించవచ్చు. అన్ని చోట్లా కరోనా జాగ్రత్తల విషయంలో సీరియస్‌‌గా వ్యవహరించి ముందుకు సాగొచ్చు.

రివ్యూ చేసి సరైన నిర్ణయం తీసుకోవాలె
ఇప్పటికే చదువులపై సూడెంట్స్ ఆసక్తి కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం చదువు సాగించాలి. మరోవైపు ఇప్పుడు వాయిదా పడిన డిగ్రీ ఎగ్జామ్స్ మీద క్లారిటీ లేదు. ప్రభుత్వ హాస్టళ్లు మూసేయడంతో దూరప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ 7 నుంచి మొదలు కావాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ గురించి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఇండ్లకు వెళ్లి వాళ్లు మళ్లీ రావాలంటే ఎలా? మరోవైపు జాతీయ స్థాయి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. లక్షలాది మంది ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు రోడ్డునపడుతున్నారు.  సినిమా థియేటర్లు, బార్లు, హోటళ్లపై ఉన్న నమ్మకం, ప్రేమను విద్యా సంస్థలపైనా చూపితే మేలు. ఇటు విద్యార్థుల భవిష్యత్తు, ప్రైవేట్ టీచర్ల బతుకులు ఆగం కావొద్దన్న ఆలోచన చేస్తే సర్కారు ఇప్పటికైనా విద్యా సంస్థల మూసివేత నిర్ణయంపై రివ్యూ చేసుకుని ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలి.

                                                                                                                          - గౌరీ సతీశ్ తెలంగాణ ప్రైవేట్ జూనియర్  కళాశాలల రాష్ట్ర అధ్యక్షుడు