- హైదరాబాద్ సురక్షితంగా ఉండాలో లేదో కిషన్‌రెడ్డి చెప్పాలి
- తప్పుచేసిండు కనుకే కేటీఆర్ జైలుకు పోతా అంటుండు
- బీఆర్ఎస్కు నూకలు చెల్లినయ్.. వచ్చే ఎలక్షన్ నాటికి ఆ పార్టీ ఖతం
- 19న లక్షమంది మహిళలతో వరంగల్‌లో విజయోత్సవ సభ పెడ్తమని వెల్లడి
- మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, సురేఖతో కలిసి వరంగల్‌లో పర్యటన
వరంగల్, వెలుగు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక్కరోజు మూసీ నిద్రతో ఒరిగేదేమీ ఉండదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసమే కిషన్‌రెడ్డి మూసీ నిద్ర చేస్తున్నారని మండిపడ్డారు. వానలు, వరదల నుంచి హైదరాబాద్ నగరం సురక్షితంగా ఉండాలని, జనాలు ఇబ్బంది పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు సిద్ధమవుతుంటే.. మంత్రి కిషన్‌రెడ్డి ఒక్కరోజు నిద్రతో ఏం వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి మహేశ్ కుమార్ గౌడ్ గ్రేటర్ వరంగల్‌లో పర్యటించారు.
ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నేతలతో హనుమకొండలో జరిగిన సమావేశంలో మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. భారీ వర్షాలతో వరదలు వచ్చి కేరళలోని వయనాడ్ అతలాకుతలం అయిందని, గతంలో మూసీకి వరదలొచ్చి 18 వేల మంది కొట్టుకుపోయారని గుర్తుచేశారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తు సంభవిస్తే మన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా? వద్దా?, మూసీ ప్రక్షాళన అవసరమా? కాదా? అనేది కిషన్‌రెడ్డి సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.40 వేల కోట్లను తీసుకురాలేని పరిస్థితిలో కిషన్‌రెడ్డి ఉన్నారని, నిధులు తేవడంతో ఆయన విఫలమయ్యారని ఎద్దేవా చేశారు.
మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం
తప్పు చేశాడు కనుకే కేటీఆర్ జైలుకు పోతా అని అంటున్నాడని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్లాగా తమది నియంత్రృత్వ ప్రభుత్వం కాదని, తమది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పారు. ప్రజలు తమను నమ్మి అధికారం ఇచ్చారని, ఈ క్రమంలో గత పదేండ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణకు సిద్ధమైనట్టు తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై కమిషన్ వేశామని, కేటీఆర్ అరెస్ట్‌పై అనుమతి కోసం గవర్నర్‌ను కలిశామని చెప్పారు. వాస్తవాలు బయటకొచ్చాక ఎవరికి ఏ పనిష్మెంట్ దక్కాలో అది దక్కుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని, వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉండదని తాను నమ్ముతున్నట్టు మహేశ్‌కుమార్ తెలిపారు. గడిచిన పదేండ్లలో సాగునీటి ప్రాజెక్టులు, నిధులు, భూముల పేరుతో బీఆర్ఎస్ నేతలు దోపిడీ చేశారని ఆరోపించారు. అందుకే జనాలు తమకు అధికారం అప్పజెప్పి.. 39 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని అన్నారు. కానీ గడిచిన 11 నెలలుగా కేసీఆర్ ఫాంహౌజ్‌కు పరిమితం అయితే.. ఆయన కొడుకు కేటీఆర్ అసహనం మాటలు, అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించడంలోనూ ఫెయిల్ అయ్యాడని తెలిపారు.
19న విజయోత్సవ సభ
తమ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వరంగల్‌లో ఈ నెల 19న ఇందిరమ్మ జయంతి సందర్భంగా లక్షమంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేయని అభివృద్ధిని తమ సర్కారు 9 నెలల్లో చేసి చూపించిందని అన్నారు. పదేండ్లలో గత కేసీఆర్ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలిస్తే.. తాము 9 నెలల్లోనే 48 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, డిసెంబర్ 7 నాటికి మరో 8 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. గడిచిన 11 నెలల్లో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
గత పాలకుల అండతో చెరువులు, భూములు కబ్జా చేసినోళ్లే హైడ్రా పనితీరుకు భయపడ్తున్నారని అన్నారు. 19న నిర్వహించే సభలో తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వరంగల్ జిల్లా కీలకంగా పనిచేసిందని చెప్పారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అనంతరం విజయోత్సవ సభ నిర్వహించే సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.