
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ బడులపై తనకున్న సానుభూతి బహిరంగంగానే చెపుతూ వస్తున్నారు. గత పాలకులు ప్రభుత్వ బడులపై సానుభూతి వ్యక్తం చేయడం వరకే పరిమితం అయ్యారు. అయితే, రేవంత్ రెడ్డి ఓఅడుగు ముందుకు వేసి తెలంగాణ విద్యా కమిషన్ నియమించారు. కమిషన్ కూడా ప్రభుత్వ పాఠశాలల సంస్కరణ కోసం కొన్ని సిఫార్సులు చేసింది. ఒక మండలాన్ని యూనిట్‌గా తీసుకుని.. ప్రతి మండలానికి మూడు ‘తెలంగాణ పబ్లిక్ పాఠశాలలు’ (రెండవ తరగతి నుంచి ఇంటర్ వరకు), అదేవిధంగా మండలానికి నాలుగు ‘తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్’ (ప్లేస్కూల్ నుంచి 2వ తరగతి) ఏర్పాటు చేయాలని, వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మినీ గురుకులాలుగా మార్చాలని, పాఠశాల అందుబాటులేని క్యాచ్మెంట్ ఏరియా నుంచి మినీ బస్సులు ఏర్పాటు చేసి ఉచిత ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. విద్యా కమిషన్ చేసిన సిఫార్సులు, సూచనలు నూటికి నూరుపాళ్లు ఆమోద యోగ్యం అయినవే.
మండలం యూనిట్‌గా ఉన్న అన్నిరకాల పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సి ఉంటుంది. మండలాన్ని ఒక స్కూల్ కాంప్లెక్స్‌గా భావించి ఆ మండలంలోని ఉపాధ్యాయులు, అధ్యాపకుల సేవలను అవసరం అయితే వారి సామర్థ్యం, సబ్జెక్టు ఎక్స్పీరియన్స్ ను బట్టి కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాల్లో వినియోగించుకోవచ్చును. పటిష్టమైన మానిటరింగ్ వ్యవస్థను మండల, జిల్లా స్థాయిలో రెగ్యులర్ బేస్‌గా ఏర్పాటు చేయాలి. ఇక వసతులు ఉన్న ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను మినీ గురుకులంగా మార్చడం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాల అవసరం ఉండదు.
రెసిడెన్షియల్ పాఠశాలనే పబ్లిక్ స్కూల్‌గా మారిస్తే సమీప పాఠశాలలను మెర్జ్ చేయడం లేదా రవాణా సౌకర్యం కల్పించవచ్చును. ఇక్కడ వార్డెన్లనే మినీ గురుకులం ఇన్చార్జ్గా చేయడం వలన ప్రభుత్వానికి ఖర్చు తగ్గడం, ఉద్యోగుల సేవల్లో సామర్థ్యం, సౌలభ్యత లభించే అవకాశం ఉంది. ఇక అంగన్వాడీ కేంద్రాలు ఫౌండేషన్ పాఠశాలల నందు మెర్జ్ చేయడం వలన అవసరం అయిన పోషకాహారం, ప్లే మెటీరియల్ సమకూర్చడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. విద్యాహక్కుచట్టం- 2009 ద్వారా నూటికి నూరుశాతం వయస్సు ఆధారిత సామర్థ్యాలు అందించడంతోపాటు, ఒత్తిడిలేని నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రక్రియ చట్టం ప్రకారం అమలుచేసే సౌలభ్యం
కలుగుతుంది.
అపసవ్యతను సరిదిద్దాలి
ప్రైవేటు పాఠశాల విద్యార్థులపై ఏడాదికి రూ. 96 వేలు ఖర్చవుతుంటే, ప్రభుత్వ పాఠశాల విద్యార్థిపై 1లక్షా 8వేలు ఖర్చు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఖర్చయితే నిజం కావచ్చు. కానీ, వ్యత్యాసాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ప్రభుత్వ టీచర్ల వేతనాలుగా ఒక్కో ఉపాధ్యాయుడిపై ఏడాదికి సగటున రూ.12లక్షల వరకు ఖర్చవుతుంటే, అదే ఖర్చుతో ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అరడజను మంది ఉపాధ్యాయులను నియమిస్తారు.
ప్రైవేటు విద్యావ్యవస్థ వసూలు చేసే క్యాపిటేషన్ ఫీజు లెక్కలు ఉండవు. ప్రైవేటు విద్యావ్యవస్థలో ఒకరకమైన జవాబుదారీతనంతోపాటు దోపిడీ కూడా ఉంటుంది. ఇక్కడ మానిటరింగ్ వ్యవస్థ అంతరించి కొన్ని దశాబ్దాలు అవుతుంది. ఈ రకమైన అతి స్వేచ్ఛ, నిర్లక్ష్యం పేరుకుపోయింది. యాజమాన్య పద్ధతిలోనే తేడా. ఈ తేడా పాపం గత పాలకులదే.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యతివ్వాలి
ప్రభుత్వ పాఠశాలల ఫీజులు, పని విధానం, ఉపాధ్యాయుల నియామకంపై ప్రభుత్వ మానిటరింగ్, నియంత్రణ తప్పనిసరిగా ఉండాలి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే తప్పనిసరిగా చదివించాలనే నిబంధనలు విధించడం సమంజసం కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించాలి. నిర్బంధం, నిబంధనలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచలేవు.
ఇక ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ప్రస్తుతం ఐఐటి అడ్మిషన్లలో 5శాతం బోనస్ మార్కులు కలుపుతున్నారు. అదేవిధంగా అన్ని ఉన్నతవిద్య అడ్మిషన్లలో ప్రభుత్వ పాఠశాలలో వరసగా ఆరేళ్లు చదివినవారికి అన్ని ప్రవేశ పరీక్షలలో బోనస్ మార్కులు ఇవ్వాలి.
విద్యా సంస్కరణలకు నిధులు
తరాల మధ్య అంతరాలు ఉన్నందున ప్రభుత్వ పాఠశాలలు గాడిలో పెట్టడం అంత తేలికైన పనికాదు. అయినా, సంకల్పం ఉంటే, సాధ్యంకానిది ఉండదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకోసం 23.01వేల కోట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీనిలో18.40 వేల కోట్లు ఒకలక్షా నలబై ఎనిమిది వేల బోధనా సిబ్బంది వేతనాలకు ఖర్చు అవుతాయి.
ప్రభుత్వం 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు కేటాయించిన 2 వేల కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కోసం కేటాయించిన 200 కోట్లు మినహాయిస్తే సుమారు రూ. 3వేల కోట్లు మిగులుతాయి. తెలంగాణ విద్యా కమిషన్ 30వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల సంస్కరణలకు సుమారు రూ. 30వేల కోట్లు అవసరం అవుతాయని ఓ అంచనా ప్రకటించింది.ఎంతో చారిత్రాత్మక పాత్ర ఉన్న మన ప్రభుత్వ పాఠశాల విద్యావ్యవస్థ మళ్లీ ప్రభావం చూపాలని ఆశిద్దాం.
- ఎన్ తిర్మల్,
సీనియర్ జర్నలిస్ట్