మానవ వ్యర్థాల తొలగింపు విధానం మారేదెన్నడు

మానవ వ్యర్థాల తొలగింపు విధానం మారేదెన్నడు

భారతదేశంలో ఆనాదిగా కులవ్యవస్థ  పాతుకుపోయింది. అస్పశ్యత, అంటరానితనం వలన దళితులు వివక్షకు గురయ్యారు.  వీరి విముక్తి కోసం భారతదేశంలో డా. బీ.ఆర్ అంబేద్కర్ పోరాటం చేశారు. ఆయన దళితులను కులం పేరుతో మంచినీటికి దూరం చేసిన ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో ‘మహాద్ చెరువు’ పోరాటం చేశాడు.  ఇది భారతదేశ చరిత్రలో మొదటి మానవ హక్కుల ఉద్యమం అని చెప్పవచ్చు. ఆలయాల ప్రవేశాలు, బడిలో చదువు, తాగునీరు బడుగు బలహీన వర్గాలకు అందాలని ఉద్యమం చేశాడు.  

ఇప్పుడు రాజ్యాంగం అమలులోకి వచ్చినా...కుల వివక్ష పోవడం లేదు.  చేతితో మలం ఎత్తే పనులు (Manual Scavenging)పై 10 ఏళ్ల క్రితమే నిషేధం విధించినప్పటికీ నేటికీ ఈ పనులను చాలామంది చేస్తూనే ఉన్నారు.  మురుగు కాలువలు, సెప్టిక్​ ట్యాంకులు క్లీన్ చేసే నేపథ్యంలో ప్రతి ఏటా చాలామంది కార్మికులు మృత్యువాత పడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ గణాంకాల ప్రకారం పారిశుద్ధ్య కార్మిక వృత్తిలో 68.9 శాతం దళితులు కొనసాగుతున్నారు. అంతేకాకుండా  2019 నుంచి 2023 మధ్య కాలంలో మురికి కాలువలు, సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే  సమయంలో కనీసం 377 మరణించడం ఆందోళన కలిగిస్తోంది.  

2013లో మాన్యువల్ స్కావెంజింగ్ అంటే చేతులతో మలాన్ని ఎత్తే పనులపై ఎంప్లాయ్​మెంట్ ప్రొహిబిషన్ అండ్ రిహాబిలిటేషన్ యాక్ట్​ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్ట ప్రకారం మాన్యువల్ స్కావెంజింగ్ పని చేయడం, మురికిని తీసి, శుభ్రం చేయడం, బహిరంగ కాలువలు లేదా గుంతలను శుభ్రం చేయడం, మానవ విసర్జనను సేకరించడం నిషేధం. మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని నిర్మూలించేందుకు భారతదేశంలో మొదటిసారిగా 1993లో చట్టాన్ని ఆమోదించారు. 

2013లో మరోసారి దీనికి సవరణ చేశారు. మొదటిసారిగా రూపొందించిన చట్టంలో డ్రై లెట్రిన్లలో పనిచేయడాన్ని నిషేధించారు. 2013లో తీసుకొచ్చిన చట్టంలో మాన్యువల్ స్కావెంజింగ్ నిర్వచనాన్ని తెలియజేశారు. సెప్టిక్ ట్యాంక్​లను  మాన్యువల్​గా  శుభ్రపరచడంతో పాటు రైల్వే ట్రాక్​లను శుభ్రపరచడం కూడా ఈ చట్టంలో చేర్చారు. 2014 మార్చి 27న మాన్యువల్ స్కావెంజింగ్ సమస్యపై సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువరించింది.  మురుగు కాలువలను శుభ్రం చేస్తూ మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిబంధన విధించింది. 

సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆరు మెట్రో నగరాల్లో (ఢిల్లీ, ముంబై, కోల్​కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్) మాన్యువల్  స్కావెంజింగ్, చేతితో మురుగు కాల్వలను శుభ్రం చేయడంపై నిషేధం విధిస్తూ గత నెల 29న జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అరవింద్ కుమార్  ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ  సందర్భంగా మాన్యువల్ స్కావెంజింగ్​ను ఎలా నిరోధిస్తారో  తెలుపుతూ ప్రమాణపత్రాలను దాఖలు చేయాలని ఆయా నగరాల ముఖ్య కార్యనిర్వాహక అధికారులను ఆదేశించింది. 

అయితే,  తమ నగరాల్లో మాన్యువల్ స్కావెంజింగ్​ను  నిలిపివేశామంటూ కోల్​కతా, ఢిల్లీ, హైదరాబాద్ యంత్రాంగాలు దాఖలు చేసిన ప్రమాణపత్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజంగా నిలిపివేస్తే.. ఆయా నగరాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ.. మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తూ కొందరు ప్రాణాలు ఎలా కోల్పోయారని ప్రశ్నించింది. 

జైల్లో కూడా కుల వివక్షత కొనసాగుతుంది. ఈ విషయాన్ని ఇటీవల సుప్రీం కోర్టు తప్పుపట్టింది. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే  పారిశుధ్య పనులైన మరుగుదొడ్లు కడిగించడం, ట్యాంకులు శుభ్రం చేయించడం వంటి పనులు చేయించడంపై  ఆగ్రహం వ్యక్తం చేసింది.  జైలో ఈ నిబంధనలు మార్చాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.  

- సంపతి రమేష్ మహారాజ్,
సోషల్ ఎనలిస్ట్