మలి వేదకాలంలో ఆర్యులు గంగా మైదానానికి వలస వెళ్లారు. గంగానది మైదానంలో ఆర్యుల తొలి స్థావరాలు భగవాన్ పుర(హర్యానా), దదేరి (లూథియాన దగ్గర), నగర్ (జలంధర్ దగ్గర), కట్ఫలమ్ (జలంధర్), మాండ (జమ్మూ దగ్గర) బయల్పడ్డాయి. రుగ్వేదానంతర వాజ్మయం అప్పటి దేశాన్ని మూడు భాగాలుగా విభజించింది. అవి ఆర్యవర్తనం(ఉత్తర భారతదేశం), మధ్యదేవము(మధ్య భారతదేశ), దక్షిణాపథం(దక్షిణ భారతదేశం). ఐతరేయ బ్రాహ్మణం దేశాన్ని ఐదు భాగాలుగా విభజించింది.
అవి తూర్పు, పశ్చిమ, ఉత్తర, మధ్య, దక్షిణ దేశాలుగా నాటి భరతవర్షాన్ని విభజించింది. మలివేద కాలంలో వర్ణింపబడిన నదులు నర్మద, గండక్, చంబల్ కాగా, తూర్పు, పశ్చిమాలుగా గల సముద్రాలను శతపథ బ్రాహ్మణం వర్ణించింది. మలివేద వాజ్మయంలో వర్ణింపబడిన పర్వతాలు వింధ్య. అయితే, ఈ వాజ్మయమంలో కంపిల, పాంచక, కోసల పురం లేదా పట్టణాలుగా వర్ణింపబడ్డాయి.
మలి వేదకాల సామాజిక వ్యవస్థ లక్షణాలు:
- వర్ణవ్యవస్థలో కఠినత్వం
- స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం
- వర్ణ వివక్షత ఏర్పడటం
- వృత్తులు నిర్ణయింపబడటం
- పశుపోషణ స్థానంలో వ్యవసాయం ప్రధాన వృత్తయింది
- సహపంక్తి భోజనాలు నిషేధించబడ్డాయి
- ప్రతిలోమ వివాహాలు నిషేధించబడ్డాయి
- పంచమహా యజ్ఞాలు వ్యాప్తిలోకి వచ్చాయి.
స్త్రీ స్థానం
సింధు నాగరికత కాలంలో స్త్రీ ఆధిక్యత, రుగ్వేద కాలానికి వచ్చేసరికి స్త్రీ సమానత్వం అయింది. అదే మలివేద కాలంలో స్త్రీ విచక్షణకు గురైంది. చట్టబద్ధమైన వారసులను అందించడానికి, మగవారికి సంతోషం ఇవ్వడం కోసం మాత్రమే స్త్రీలను ఉపయోగించారు. బాల్య వివాహాలు వచ్చాయి. మత్స్య పురాణం ప్రకారం పెళ్లి కుమారుడి వయస్సులో పెళ్లి కూతురు వయస్సు 1/3 వంతు ఉండాలి. మలి వేదకాలంలో సతీసహగమనం, పరదా పద్ధతి తప్పనిసరి అయింది. స్త్రీ ఆస్తి హక్కును కోల్పోయింది. ఉన్నత వర్గాల్లో బహు భార్యత్వ ఆచారం పెరిగింది. వరకట్న దురాచారం కూడా ప్రబలింది.
ఆశ్రమ వ్యవస్థ
ఈ వ్యవస్థలో నాలుగు దశలు ఉన్నాయి. అవి:
- బ్రహ్మచర్యం,
- గృహస్థం,
- వానప్రస్థం,
- సన్యాసం.
బ్రహ్మచర్యం: ఉపనయనంతో ఈ దశ మొదలవుతుంది. ఈ దశలో గురుకులంలో విద్యార్థి జీవితం గడుపుతూ జ్ఞానం పొందాలి. లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలి.
గృహస్థం: ఈ దశలో వివాహం చేసుకొని సంతానం పొందాలి. గృహస్థంలో పురుషార్థాలు సాధించాలి. పురుషార్థాలు..
ధర్మం: ధర్మం లేదా న్యాయాన్ని పాటించడం
అర్థ: సంపదను ఆర్జించడం
కామం: కోరికలను తీర్చుకోవడం
మోక్షం: అది అంతిమ లక్ష్యం
వానప్రస్థం: ఈ విధానంలో సమాజంతో పాక్షిక విముక్తి లభిస్తుంది. ఈ దశలో అరణ్యవాసం చేస్తారు.
సన్యాస ఆశ్రమం: ప్రపంచంలో సంబంధాలు వదులుకొని మోక్షం కోసం వెళ్లడం. సమాజంతో శాశ్వతమైన విముక్తి పొందడం. మొదటి మూడు ఆశ్రమాల గురించి ఐతరేయ బ్రాహ్మణం, చాందోగ్య ఉపనిషత్తులు పేర్కొన్నాయి. అయితే, మొదటిసారి నాలుగు ఆశ్రమాల గురించి జబలోపనిషత్తు పేర్కొంది.
పంచ మహాయజ్ఞాలు: ఇవి వైదిక కాలంలో వ్యాప్తిలోకి వచ్చాయి.
బ్రహ్మ యజ్ఙం: వేదమంత్రోచ్ఛారణతో బ్రహ్మను ఆరాధించడం.
పితృ యజ్ఙం: పితృ దేవతలకు పిండ ప్రదానం చేయడం.
దేవ యజ్ఞం: హోమగుండం ద్వారా దేవతలను ఆరాధించడం.
భూత యజ్ఞం: ఆహార ధాన్యాలను పశుపక్ష్యాదులకు వెదజల్లడం.
పురుష యజ్ఞం: అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం.
సాంఘిక రుగ్మతలు
- వర్ణ వ్యవస్థ: మలివేద కాలంలో ద్విజులు, ఏకజులు అనే వర్ణ వ్యవస్థ ఏర్పడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ద్విజులుగా పిలువబడ్డారు. వీరికి ఉపనయనం ఉంటుంది. రెండు సార్లు జన్మిస్తారు కావున వీరికి మోక్షం లభిస్తుంది. శూద్రులు ఏకజ వర్గంలోకి వస్తారు. వీరికి ఉపనయనం ఉండదు. కాబట్టి వీరు ఒకసారి మాత్రమే జన్మిస్తారు. వీరికి మోక్షం ఉండదు. రుగ్వేద, మలివేద కాలాలు రెండింటిలో శూద్రుల సామాజిక పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
- కుల వ్యవస్థ: మలివేద కాలంలో కుల వ్యవస్థను వేళ్లూనుకొనడానికి కారణాలు.
- వృత్తులు వంశ పారంపర్యం కావడం.
- శ్రేణి వ్యవస్థ రూపొందడం.
- గోత్ర, ఆచారం అమలులోకి రావడం.
- ఆర్య, అనార్య వర్ణ భేదాలు.
వివాహం
మలి వేదకాలంలో అనులోమ, ప్రతిలోమ వివాహ పద్ధతులు కనిపించేవి. ప్రతిలోమ వివాహం ధర్మబద్ధం కాదని పరిగణించబడింది. ఈ విధానం కింద అంటరాని వారైన చండాలులు, నిషాదులు జన్మించారు. అయితే, మలి వేదకాలంలో అనులోమ వివాహపు సంతానం (సూత) సామాజిక గౌరవం పొందింది. ఆర్యులు అనులోమ, ప్రతిలోమ వివాహ వ్యవస్థలను ఏర్పరచుకోవడానికి గల కారణం అనివార్య సంపర్కం నుంచి తమ జాతిని సంరక్షించుకోవడం.
- అష్ట వివాహ వ్యవస్థ: ఈ వివాహ వ్యవస్థ మలివేదకాలంలో మొదలై ప్రాచీన కాలం మొత్తం కొనసాగింది.
- బ్రహ్మ వివాహం: పెద్దల నిర్ణయాలు, ఆచార వ్యవహారాలను అనుసరించి అందరూ ఒప్పుకొని చేసే పెళ్లిని బ్రహ్మ వివాహం అంటారు. ఇది
- ఆదర్శమైన వివాహం. తన వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకొనేవారు.
- దైవ వివాహం: క్రతువు చేసిన బ్రాహ్మణుడికి దక్షిణ బదులుగా ఆ కుటుంబంలోని కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తారు. ఈ వివాహం కేవలం
- బ్రహ్మణుల కోసం మాత్రమే నిర్ణయించారు.
- అర్స వివాహం: పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కూతురు వాళ్లకు ఎద్దులు, ఆవుల రూపంలో కన్యాశుల్కం అందిస్తాడు. పెళ్లి కూతురును తల్లిదండ్రులు కోల్పోతున్నారు, కాబట్టి ఆ ఇంటికి నష్టపరిహారంగా కన్యాశుల్కాన్ని కట్టిస్తారు. ఈ కాలంలో అర్స వివాహాలు ఎక్కువగా జరిగేవి.
- ప్రజాపత్య వివాహం: ఎలాంటి కన్యాశుల్కం, వరకట్నం లేకుండా పెళ్లి చేసుకోవడం.
- గాంధర్వ వివాహం: వధువు, వరుడు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, ఈ వివాహం కేవలం క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది ప్రస్తుత కాలంలోని ప్రేమ వివాహం.
- పైశాచ వివాహం: నిద్రపోతున్న అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం. ఈ వివాహం కూడా కేవలం క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది.
- అసుర వివాహం: వధువుని లేదా వరుణ్ని కొనుక్కొని పెళ్లి చేసుకోవడం, ఈ వివాహం కేవలం వైశ్యులకు మాత్రమే వర్తిస్తుంది.
- రాక్షస వివాహం: పెళ్లి కూతురు ఇష్టపడకపోయినా బలవంతంగా ఎత్తుకొనిపోయి పెళ్లి చేసుకోవడం.