వెలుగు సక్సెస్.. రాజ్యాంగ షెడ్యూళ్లు

వెలుగు సక్సెస్.. రాజ్యాంగ షెడ్యూళ్లు

ఏదైనా ఒక ఆర్టికల్​కు గానీ రాజ్యాంగ సవరణకు గానీ విస్తృతమైన వివరణ ఇచ్చే దానినే షెడ్యూల్​ అంటారు. మౌలిక రాజ్యాంగంలో ఎనిమిది షెడ్యూళ్లు మాత్రమే ఉండేవి. న్యాయసమీక్షకు అవసరమైన చట్టాలను పొందుపర్చడం కోసం 9వ షెడ్యూల్​, పార్టీ ఫిరాయింపులను నిరోధించడం కోసం 10వ షెడ్యూల్​, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఇచ్చిన అధికారాలకు సంబంధించి 11 షెడ్యూల్​, 12వ షెడ్యూళ్లను చేర్చారు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.  

షెడ్యూల్​-I: భారదేశ నిర్మాణం, రాష్ట్రాలు, వాటి సరిహద్దులు, ముఖ్య పట్టణాలు మొదలైన విషయాలు పేర్కొన్నారు. 

షెడ్యూల్​-II: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, న్యాయమూర్తులు, కంప్ట్రోలర్​, ఆడిటర్​ జనరల్​ మొదలైన వారి జీతభత్యాలు గురించి పేర్కొన్నారు. ఈ జీతభత్యాలు కన్సాలిడేటెడ్​ ఫండ్​ ఇండియా నుంచి చెల్లించాలి. 

షెడ్యూల్-III​: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, న్యాయమూర్తులు, కంప్ట్రోలర్,​ ఆడిటర్​ జనరల్​ మొదలైన వారి ప్రమాణ స్వీకారం గురించి పేర్కొన్నారు. 

షెడ్యూల్--IV​---: రాష్ట్రాల జనాభా ప్రతిపాదికన రాజ్యసభలో స్థానాలను కేటాయించారు. ఈ లెక్కన అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు ఉండవు. ఏయే రాష్ట్రాలకు ఎన్ని సీట్లు వస్తాయో ఈ షెడ్యూల్ ద్వారా తెలియజేస్తారు.

షెడ్యూల్-V​: వివిధ రాష్ట్రాల్లోని కొన్ని గిరిజన ప్రాంతాలను షెడ్యూల్డ్​ ప్రాంతాలుగా ప్రకటించారు. ఆ షెడ్యూల్డ్​ ప్రాంతాల్లో పరిపాలన ఎలా ఉండాలో వివరించారు. 

షెడ్యూల్​-VI: అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లో ఉన్న స్వయంప్రతిపత్తి జిల్లాల గురించి తెలియజేస్తుంది. 

షెడ్యూల్-VII: కేంద్ర, రాష్ట్రాల అధికారాలను తెలియజేస్తుంది. 

ఒకటో జాబితా: కేంద్ర జాబితా 98 అంశాలు  
రెండో జాబితా: రాష్ట్ర జాబితా 59 అంశాలు
మూడో జాబితా: ఉమ్మడి జాబితా 52 అంశాలు 

పై మూడు జాబితాల్లో లేని వాటిని అవశిష్ట అధికారాలు అంటారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది.
 
షెడ్యూల్​-VIII: అధికార భాషలకు సంబంధించింది. 
– రాజ్యాంగం ప్రకారం 18 అధికార భాషలు ఉండేవి. 2004లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, సంథాలీ, డోగ్రీ, మైథిలీ అనే నాలుగు భాషలను చేర్చడంతో 22కు చేరాయి. 

షెడ్యూల్-IX​: ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయ సమీక్షకు అతీతమైన అంశాలను పొందుపరిచేందుకు 9వ షెడ్యూల్​ను 1951లో చేర్చారు. 

షెడ్యూల్​-X: పార్టీ ఫిరాయింపుల కారణంగా పార్లమెంట్​, రాష్ట్ర శాసన సభల సభ్యుల అర్హతలకు సంబంధించిన నిబంధనలు చేర్చారు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ షెడ్యూల్ ను రాజ్యాంగంలో చేర్చారు. 

షెడ్యూల్-XI​: గ్రామ స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్, మండల పరిషత్​, గ్రామ పంచాయతీలకు ఇచ్చిన 29 అధికారాలకు సంబంధించింది. 

షెడ్యూల్-XII: పట్టణ స్థానిక సంస్థలైన నగర పంచాయతీ, మున్సిపల్​ కౌన్సిల్​, కార్పొరేషన్​లకు ఇచ్చిన 18 అధికారాలకు సంబంధించింది. 

9వ షెడ్యూల్​ ప్రాధాన్యత

భూ సంస్కరణలకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో 1951లో అప్పటి ప్రధాన మంత్రి జవహర్​ లాల్​ నెహ్రూ తొలి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్​ను రాజ్యాంగంలో పొందుపర్చారు. ఈ షెడ్యూల్​లో ఇప్పటివరకు ప్రభుత్వం 284 చట్టాలను చేర్చింది. తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు కల్పించే తమిళనాడు రిజర్వేషన్ల చట్టం కూడా ఇందులో ఒకటి. 

ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే నాటికే తమిళనాడు రాష్ట్రంలో 50 శాతానికిపైగా రిజర్వేషన్లు అమలులోఉన్నాయి. ఆ రిజర్వేషన్లు రద్దు చేయడం సాధ్యం కాని పరిస్థితి. అందువల్ల తమిళనాడు రాష్ట్ర రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. 

ఇందిరాసాహ్నీ కేసు 

మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని 1992లో ఇందిరా సాహ్నీ వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్నే మండల్​ తీర్పుగా పేర్కొంటారు. అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్రాల్లో రిజర్వేషన్లు 50శాతం గరిష్ట పరిమితిగా ఉండిపోయంది. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో కొన్ని కులాలు చేపట్టిన ఆందోళనలకు తలొగ్గి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు చేసినా సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం గరిష్ట పరిమితి అడ్డుగా నిలిచింది. 

రాజ్యాంగంలో 9వ షెడ్యూల్​లో చేర్చిన చట్టాలను న్యాయస్థానాలు సమీక్షించాలనే అభిప్రాయం ఉంది. ఏదైనా ఒక చట్టాన్ని 9వ షెడ్యూల్​లో చేర్చితే ఆర్టికల్​ 31బి ప్రకారం ఆ చట్టాన్ని న్యాయస్థానాలు సమీక్షించలేవు. కానీ 9వ షెడ్యూల్​లో చేర్చిన 30 చట్టాలపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని న్యాయస్థానాలు విచారిస్తున్నాయి.

Also read : గొప్పల డప్పులు.. అదొక ఆర్ట్​

న్యాయసమీక్షకు అర్హమే

9వ షెడ్యూల్​లో చేర్చిన చట్టాలు న్యాయసమీక్షకు అతీతమనే వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. తమిళనాడు రిజర్వేషన్ల చట్టంపై దాఖలైన ఐఆర్ కోయెల్​హో వర్సెస్​ స్టేట్​ ఆఫ్​ తమిళనాడు కేసులో 2007లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైకే సబర్వాల్​ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెబుతూ 9వ షెడ్యూల్​లో చేర్చిన చట్టాలన్నీ న్యాయసమీక్షకు అతీతం కాదని పేర్కొంది. ఆ చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగకరంగా ఉంటే వాటిని సమీక్షించవచ్చని పేర్కొంది. ఈ తీర్పు ఫలితంగా 1973 తర్వాత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్​లో చేర్చిన చట్టాలను సమీక్షించే అవకాశం న్యాయస్థానాలకు లభించింది. 

ఆర్టికల్​ 343: దేవనాగరి లిపికి చెందిన హిందీ భాషకు అధికార భాషగా గుర్తింపు ఇచ్చారు. ఇంగ్లీష్​ అధికార భాష కాదు. కేవలం అనుసంధాన భాష మాత్రమే. నాగాలాండ్​లో మాత్రం ప్రత్యేక మినహాయింపు ద్వారా ఇంగ్లీష్​ అధికార భాషగా కొనసాగిస్తున్నారు. 

ఆర్టికల్​ 344: 20 మంది లోక్​సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో భాషల విషయాన్ని అధ్యయనం చేసేందుకు ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పరచవచ్చని సూచించారు. 

ఆర్టికల్​ 345: రాష్ట్రాల్లోని అధికార భాషలకు సంబంధించింది.

ఆర్టికల్​ 348: న్యాయస్థానాలు మాత్రం ఇంగ్లీష్​ను తమ కోర్టు వ్యవహారాల్లో వినియోగించుకోవచ్చు. ఏదైనా న్యాయస్థానం స్థానిక భాష వినియోగించుకోదలిస్తే రాష్ట్రపతి ఆమోదం తెలపాలి. గవర్నర్​ అభిప్రాయం మేరకు రాష్ట్రపతి ఆమోదాన్ని ఇవ్వొచ్చు.