భారతదేశంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు, 21 ప్రైవేట్‌రంగ బ్యాంకులు, 45 విదేశీ బ్యాంకులు ఉన్నాయి. బ్యాంక్ ఆస్తుల్లో 70శాతం ప్రభుత్వరంగ బ్యాంకులవే. 2022, మార్చి 31 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు 84,256 బ్రాంచీలను కలిగి ఉన్నాయి. వీటిలో ఒక్క ఎస్బీఐ 22,271 బ్రాంచీలను కలిగి ఉంది. రెండోది పంజాబ్ నేషనల్ బ్యాంక్ (10,099), ప్రభుత్వరంగ బ్యాంకులు 1,38,056 ఏటీఎంలు కలిగి ఉన్నాయి. అధిక ఏటీఎంలు ఎస్బీఐ (65,452) కలిగి ఉంది.
బలహీనవర్గాల వారికి, చిన్న ఉపాంత రైతులకు, భూమిలేని కూలీలకు, చేతివృత్తిదారులకు, చిన్న వ్యాపారస్తులకు రుణాలు ఇచ్చేందుకు ఆర్ఆర్బీలనే ఏర్పాటు చేశారు. ఇవి దేశ వ్యాప్తంగా 2022, మార్చి నాటికి 21,892 బ్రాంచీలు కలిగి ఉన్నాయి. విదేశీ బ్యాంకులు పెద్ద నగరాల్లో (861 బ్రాంచీలు) ఉన్నాయి. ఇతర ప్రైవేట్ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు 2022 మార్చి నాటికి 37,782 బ్రాంచీలను కలిగి ఉన్నాయి. వీనిలో ఎక్కువ బ్రాంచీలను హెచ్డీఎఫ్ సీ (6,338) కలిగి ఉంది. ప్రైవేట్ రంగ బ్యాంకులు 75,452 ఏటీఎంలు కలిగి ఉన్నాయి. వాణిజ్య బ్యాంకుల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్థానిక ప్రాంత బ్యాంకులు, ప్రైవేట్‌రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్ శాఖలు భాగాలు.
ఇతర జాతీయ బ్యాంకులు: 1770లో అలెగ్జాండర్ కంపెనీ వారు బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్‌ను కలకత్తాలో స్థాపించారు. స్వల్ప కాలంలోనే 1782లో ఇది మూతపడింది. 1865లో యూరోపియన్ల సహకారంతో కలకత్తాలో అలహాబాద్ బ్యాంకు ఏర్పడింది. భారతీయ యాజమాన్యంలో ఏర్పాటు చేసిన మొదటి వాణిజ్య బ్యాంకు ఔద్ కమర్షియల్ బ్యాంకు(1881). అయితే, ఇది 1958లో మూతపడింది. పూర్తిస్థాయి భారతీయ వాణిజ్య బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది 1894లో లాహోర్‌లో ఏర్పడింది. తర్వాత చండీగఢ్‌కు మార్చారు. దీని ఏర్పాటులో లాలాలజపతిరాయ్ ముఖ్య పాత్ర పోషించారు. 1967లో పారిశ్రామిక లైసెన్సింగ్‌పై నియమించబడ్డ హజారీ కమిటీ పరిశ్రమలకు, బ్యాంకులకు మధ్య అనుసంధానం ఉండాలని సూచించింది. ప్రాథమిక రంగాలకు రుణాలు ఇచ్చేందుకు వీలుగా బ్యాంకులపై సామాజిక నియంత్రణను 1967లో విధించారు.
సామాజిక నియంత్రణ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో 1969, జులై 19న 50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అవి.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్; కెనరా బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు, ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు 1980, ఏప్రిల్ 15న రూ.200కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన ఆరు వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు.
అవి.. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, విజయ బ్యాంక్. న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలతో నడవడం వల్ల 1993లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేశారు. కాబట్టి జాతీయం చేసిన బ్యాంకులు 19.
బ్యాంకుల విలీనం: 2017లో ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు ఐదు ఎస్బీఐలో విలీనమయ్యాయి. భారతీయ మహిళా బ్యాంక్ కూడా విలీనమైంది. 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయ బ్యాంకులు విలీనమయ్యాయి. ఇది మూడో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్. 2019, ఆగస్టులో 10 జాతీయ బ్యాంకులను నాలుగుకి తగ్గించారు. అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుంది. రాని బాకీలు తగ్గించడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి, సమర్థవంతమైన మానిటరింగ్‌కు, అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనేందుకు వీటిని విలీనం చేశారు.
ప్రభుత్వరంగ బ్యాంకులు: 1969 తర్వాత బ్యాంకులను ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రైవేట్‌రంగ బ్యాంకులుగా విడదీశారు. జాతీయం చేసిన బ్యాంకులు (19), ఎస్బీఐతో కలిపి ప్రభుత్వరంగ బ్యాంకులు 12. వ్యాపార పరిమాణం ప్రకారం వరుసగా.. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్, సింధ్ బ్యాంక్.
భారతీయ మహిళా బ్యాంక్: మన్మోహన్ సింగ్ ప్రధానిగా, చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2013 నవంబర్ 19న మొదటి మహిళా బ్యాంక్ అయిన భారతీయ మహిళా బ్యాంకును ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ప్రారంభించారు. దీని తొలి సీఎండీ ఉషా అనంత సుబ్రహ్మణ్యం. ప్రపంచంలో మహిళలకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేసిన మూడో దేశం ఇండియా(1. పాకిస్తాన్, 2. టాంజానియా). దీని లక్ష్యం మహిళలకు సహాయం అందించి విత్త సమ్మిళితానికి దోహదపడుతుంది. డిపాజిట్లు అందరి నుంచి స్వీకరిస్తుంది. రుణాలు మహిళలకే అందిస్తుంది. 2017లో ఇది ఎస్బీఐలో విలీనమైంది.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
బ్యాంకులు జాతీయీకరణ జరిగినా గ్రామాల్లో రుణగ్రస్తత తగ్గలేదు. వడ్డీ వ్యాపారస్తుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఎం.నరసింహం అధ్యక్షతన ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ మల్టీ ఏజెన్సీ అప్రోచ్ ద్వారా గ్రామీణ పరపతిని అందించాలని సూచించారు. ఫలితంగా 20 సూత్రాల పథకంలో అంతర్భాగంగా 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించబడ్డాయి. నరసింహం కమిటీకి పూర్వం సరయూ కమిటీ కూడా ఆర్ఆర్బీ స్థాపనకు సిఫారసు చేసింది. దీనికనుగుణంగా 1976లో ఆర్ఆర్బీ చట్టం తీసుకువచ్చారు. చిన్నకారు, సన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలకు, వృత్తిపనివారికి, చిన్నతరహా పెట్టుబడిదారులకు ఇవి రుణ సహాయం అందించాయి. ఆర్ఆర్బీలకు వాణిజ్య బ్యాంకులు షేర్ క్యాపిటల్ ఇవ్వడంతోపాటు నిర్వహణలో కూడా సహాయాన్ని అందిస్తుంది.
1975లో ఐదు ఆర్ఆర్బీలు ఏర్పడ్డాయి. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్, గోరక్‌పూర్, హర్యానాలోని బివానీ, రాజస్థాన్‌లోని జైపూర్, పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా తర్వాత ఇవి పెరుగుతూ వచ్చి 2006 నాటికి 196కు చేరాయి. కేల్కర్ కమిటీ సిఫారసుల మేరకు 1987 తర్వాత నూతన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించబడలేదు. 2001లో ఆర్బీఐ వ్యాస్ అధ్యక్షతన ఆర్‌ఆర్‌బీలపై కమిటీని నియమించింది. దీని సిఫారసులపై ఆర్ఆర్బీలను దానిని స్పాన్సర్ చేసిన బ్యాంకులతో విలీనం చేస్తూ వచ్చారు. 196గా ఉన్న ఆర్ఆర్బీలు 2022 నాటికి 43కు తగ్గించారు. వీటిని 12 ఎస్సీబీలు స్పాన్సర్ చేస్తున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
1806లో కలకత్తా, 1840లో బొంబాయి, 1843లో మద్రాసులోను ప్రెసిడెన్సీ బ్యాంకులు ఏర్పడ్డాయి. ఈ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి 1921లో ఇంపీరియల్ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. ఆర్బీఐ ఏర్పడకముందు ఇంపీరియల్ బ్యాంకు కేంద్ర బ్యాంకు విధుల్లో కొన్నింటిని నిర్వహించేది. 1953లో ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేయాల్సిందిగా గోర్వాలా అధ్యక్షతన గల గ్రామీణ పరపతి పరిశీలనా సంఘం సిఫారసు చేసింది. 1955 జులై 1న ఇంపీరియల్ బ్యాంకు స్టేట్ బ్యాంకుగా మారింది. దీని స్థాపనతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకులను ఏర్పాటు చేశారు. 1993లో ఎస్బీఐ చట్టాన్ని సవరించి ఎస్బీఐకి మూలధన మార్కెట్లోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు. భారతీయ స్టేట్ బ్యాంకు చట్టం (అనుబంధ బ్యాంకుల చట్టం) 1959 ప్రకారం ఎస్బీఐ కింది బ్యాంకులను తన అనుబంధ బ్యాంకులుగా తీసుకుంది.
బ్యాంక్ ఆఫ్ బికనీర్, బ్యాంక్ ఆఫ్ జైపూర్, బ్యాంక్ ఆఫ్ ఇండోర్, బ్యాంక్ ఆఫ్ మైసూర్, బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్. దీంతో ఎస్బీఐ గ్రూపు ఏర్పడింది. 1963లో బ్యాంక్ ఆఫ్ బికనీర్, బ్యాంక్ ఆఫ్ జైపూర్ విలీనమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్‌గా రూపొందింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను హోల్డిండ్ కంపెనీగా వర్ణించవచ్చు. భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు, ఎక్కువ బ్రాంచీలను కలిగిన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ప్రధాన కేంద్రం ముంబయిలో ఉంది.
దీని స్లోగన్: విత్ యూ ఆల్ ది వే, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఈజ్. దీని ప్రస్తుత చైర్ పర్సన్ దినేష్ కుమార్ ఖారా. 2008లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్లు ఎస్బీఐలో విలీనమయ్యాయి. దీంతో ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సంఖ్య ఆరుకు చేరింది. 2017, ఏప్రిల్‌లో దాని అనుబంధ బ్యాంకులు ఐదు ఎస్బీఐలో విలీనమయ్యాయి. భారతీయ మహిళా బ్యాంక్ కూడా విలీనమైంది. ఈ విలీనంతో ప్రపంచంలో ఆస్తుల్లో 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటి. విలీనం వల్ల బ్యాంకుల వ్యయం తగ్గి సమర్థత పెరుగుతుందని అంచనా.