
1948 ఆగస్టులో మౌంట్ బాటన్ భారత్ గవర్నర్ జనరల్ పదవి నుంచి తప్పుకొని బ్రిటన్ కు వెళ్లిపోయాడు. అప్పుడు రాజగోపాలాచారి భారతదేశ గవర్నర్ జనరల్‌గా నియామకమయ్యారు. తక్షణమే వల్లభాయ్ పటేల్ రాజాజీని కలసి హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావాలంటే సైనిక దాడి చేయాల్సిందేనని పరిస్థితులను వివరించారు. రాజాజీ జవహర్‌లాల్‌నెహ్రూను రాష్ట్రపతి భవన్‌కు పిలిపించి హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేయడానికి సైనిక చర్య తప్పదని వివరించాడు. ఇందుకు నెహ్రూ సుముఖత వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌పై దాడిని సైనిక చర్య అనకూడదని, ఇది అంతర్గత వ్యవహారం కాబట్టి పోలీస్ చర్యగా పరిగణించాలని రాజాజీ పేర్కొన్నారు. ‘పోలీస్ యాక్షన్’ అనే పేరుతోనే గతంలో ఇ.ఎన్.గొడార్డ్ రూపొందించిన సైనికదాడి వ్యూహం ప్రకారం దాడులు జరగాలని నిర్ణయించారు.
గొడార్డ్ ప్రణాళిక రచన
ఆపరేషన్ పోలోను సైనిక రహస్య పత్రాల్లో ఆపరేషన్ కాటర్ పిల్లర్‌గా పేర్కొంటారు. భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించి హైదరాబాద్ సంస్థానంలోని పోలో గ్రౌండ్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ఆపరేషన్ పోలో అని పేరు వచ్చింది. ఈ సమయంలో ప్రధాన సైన్యాధిపతిగా సర్ రాయ్ బౌచర్, రక్షణ మంత్రిగా బల్దేవ్సింగ్ వ్యవహరిస్తున్నారు. గొడార్డ్ ప్రణాళిక ప్రకారం హైదరాబాద్‌పై దాడి చేయడానికి నిర్ణయించిన భారత ప్రభుత్వం ఈ దాడి ప్రణాళికను అమలు చేసే బాధ్యత అప్పటి దక్షిణ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్రసింగ్జి జడేజాకు అప్పగించింది. తక్షణమే రాజేంద్రసింగ్‌జీ జడేజా సైన్యాన్ని మూడు యూనిట్లుగా విభజించి వాటిని షోలాపూర్, విజయవాడ, బీరార్/ హోస్పేటకు పంపాడు. యుద్ధ విమానాల ద్వారా దాడి చేయడం కోసం పుణె ఎయిర్‌బేస్‌ను ఉపయోగించారు. జెఎన్ చౌదరి నాయకత్వం వహిస్తున్న షోలాపూర్ దళంలో స్ట్రెకింగ్ ఫోర్స్, స్మాష్ ఫోర్స్, కిల్ ఫోర్స్, వీర్ ఫోర్స్ ఉన్నాయి. ఎ.ఎ.రుద్ర నాయకత్వం వహిస్తున్న విజయవాడ దళంలో 17వ పునా హార్స్, క్వీన్ విక్టోరియా దళాలు, శివదత్తుసింగ్ నాయకత్వం వహిస్తున్న బీరార్/ హోస్పేట దళంలో 1వ మైసూర్ ఆర్మీ, 5/5 గుర్ఖా రైఫిల్స్ సేనలు ఉన్నాయి.
నలుదిక్కుల నుంచి దాడులు
సెప్టెంబర్ 13న షోలాపూర్ నుంచి బయల్దేరిన జెఎన్ చౌదరి నాయకత్వంలోని సైనికదళం మొదటగా మహారాష్ట్రలోని నల్దుర్గ్ వద్ద నిజాం సైన్యాన్ని ఎదుర్కొంది. కెప్టెన్ రామ్‌సింగ్ నల్‌దుర్గ్‌ను ఆక్రమించాడు. అదే సమయంలో ఔరంగాబాద్ ఆక్రమణకు కెప్టెన్ డీఎస్ బ్రార్ పంపారు. ఇతను హైదరాబాద్ సైన్యం, రజాకార్లను ఓడించి ఔరంగాబాద్‌ను ఆక్రమించాడు. విజయవాడ నుంచి బయల్దేరిన ఎ.ఎ.రుద్ర దళం మునగాలను ఆక్రమించుకుంది. శివదత్తు దళం హోస్పేటను తమ ఆధీనంలోకి తీసుకుని ఉస్మానాబాద్ వైపు బయల్దేరాడు. సెప్టెంబర్ 14న కెప్టెన్ రామ్‌సింగ్ రాజసూర్ ప్రాంతాన్ని ఆక్రమించి ముందుకు కదిలాడు. అప్పుడే హైదరాబాద్ సైన్యం వెనక్కి కదులుతూ అనేక బ్రిడ్జిలను ధ్వంసం చేసింది. ఆ సమయంలో పుణె ఎయిర్‌బేస్ నుంచి ఎయిర్ మార్షల్ ముఖర్జీ నాయకత్వంలో హాకర్ ఎయిర్క్రాప్ట్లు హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించి నిజాం సైన్యం, రజాకార్ల స్థావరాలపై దాడి చేశాయి. దీని తర్వాత భారత సైన్యం సునాయసంగా హైదరాబాద్ వైపు వెళ్లింది.
లొంగిపోయిన నిజాం
కెప్టెన్ రామ్‌సింగ్ జల్నా, లాతూర్, బీదర్, జహీరాబాద్లను, ఎ.ఎ.రుద్ర కోదాడ, సూర్యాపేట, నార్కట్‌పల్లి, చిట్యాలను, శివదత్తు దళం ఉస్మానాబాద్‌ను ఆక్రమించుకుని హైదరాబాద్ వైపు కదిలాయి. సెప్టెంబర్ 17 నాటికి భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. దీంతో మీర్ ఉస్మాన్ అలీఖాన్ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉన్న కె.ఎం.మున్షీని కలిసి యుద్ధ విరమణ గురించి చర్చించారు. 1948 సెప్టెంబర్ 17న సాయంత్రం 5గంటలకు ఉస్మాన్ అలీఖాన్ దక్కన్ రేడియోలో మాట్లాడుతూ హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగమైందని, హైదరాబాద్ ప్రజలు ఎవరూ భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయొద్దని ప్రకటించాడు. ఉస్మాన్ అలీఖాన్ రేడియో ప్రకటనతో భారతదేశ సైనిక దాడి పూర్తిగా నిలిచిపోయింది. ఉస్మాన్ అలీఖాన్ ప్రధాని పదవి నుంచి లాయక్ అలీని తొలగించి ఒక కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌కు చేరుకున్న జెఎన్ చౌదరి ఉస్మాన్ అలీఖాన్ కొత్త మంత్రివర్గం చెల్లదని, ఇక భారత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కొత్త మంత్రివర్గం ఏర్పడుతుందని ప్రకటించారు. ఆ విధంగా 1947 సెప్టెంబర్ 17న నిజాం పాలన అంతమై హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైంది. అప్పటి హైదరాబాద్ సైన్యాధిపతి సయ్యద్ అహ్మద్ ఎడ్రూస్ తన మొత్తం సైన్యంతో భారత సైన్యానికి లొంగిపోయాడు. రజాకార్ నాయకుడు ఖాసిం రజ్వీని అరెస్టు చేసి పుణెలోని ఎర్రవాడ జైలుకు తరలించారు. జెఎన్ చౌదరి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్‌గా నియామకమయ్యారు. 1948 సెప్టెంబర్ 22న ఉస్మాన్ అలీఖాన్ ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు. 1948 సెప్టెంబర్ 17ను మహారాష్ట్రలో మరఠ్వాడ సంగ్రామ్ ముక్తి దివస్ అని, కర్ణాటకలో హైదరాబాద్–కర్ణాటక విభజన దినోత్సవంగా నిర్వహిస్తారు. తెలంగాణలో కొంత మంది విద్రోహ దినం/ బ్లాక్ డే మరికొందరు విమోచన దినోత్సవంగా జరుపుకుంటారు.
ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు
భారత సైనిక దాడుల కదలికను తెలుసుకున్న ఉస్మాన్ అలీఖాన్ తక్షణమే మెహదీ నవాజ్‌జంగ్ ద్వారా 1948 సెప్టెంబర్ 10న భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై 1948 సెప్టెంబర్ 13న భద్రతా మండలిలో చర్చకు వస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీన్ని గమనించిన భారత ప్రభుత్వం అదేరోజు సెప్టెంబర్ 10న ఉస్మాన్ అలీఖాన్‌కు మూడు రోజులు గడువు ఇస్తూ కె.ఎం.మున్షీతో చివరి హెచ్చరిక జారీ చేసింది. కాని ఉస్మాన్ అలీఖాన్ ఈ దాడిని ఐక్యరాజ్య సమితి అడ్డుకుంటుందని మున్షీ చేసిన హెచ్చరికను పట్టించుకోలేదు. 1948 సెప్టెంబర్ 12న అర్ధరాత్రి 12గంటల లోపు నిజాం నుంచి స్పందన లేకపోతే సైనిక దాడి చేయాల్సిందిగా భారత సైన్యానికి భారత ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. నిజాం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో 1948 సెప్టెంబర్ 13 తెల్లవారుజామున 4 గంటలకు అన్ని వైపుల నుంచి (విజయవాడ, షోలాపూర్, బీరార్/ హోస్పేట) ఏక కాలంలో భారత సైనిక దాడులు ప్రారంభమయ్యాయి.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 562 సంస్థానాలు ఉండేవి. వీటిలో కశ్మీర్, జునాగఢ్, ట్రావెన్కోర్, హైదరాబాద్ మినహాయించి మిగతావన్నీ భారత్ లేదా పాకిస్తాన్లో విలీనమయ్యాయి. 1947 జూన్ 12న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను సర్వస్వతంత్రుడునని ప్రకటించుకొన్నాడు. దీంతో అప్పటి ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని ఒక రాచపుండుగా భావించి దాన్ని తక్షణమే తొలగించాలని పేర్కొన్నాడు. హైదరాబాద్‌పై సైనిక దాడి చేయడానికి ఒక వ్యూహాన్ని రచించమని అప్పటి దక్షిణ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇ.ఎన్.గోర్డన్ను పటేల్ ఆదేశించాడు. కానీ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ హైదరాబాద్‌పై సైనిక దాడి జరగకుండా అడ్డుకున్నారు.