అసఫ్‌జాహీల కాలంలో హైదరాబాద్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. రైల్వే వ్యవస్థ, రోడ్డు రవాణా, వైమానిక రంగంలో ఎంతో పురోభి వృద్ధి సాధించింది. ఆనాడు దేశం మొత్తంలో సొంత విమానయాన వ్యవస్థను కలిగి ఉన్న తొలి స్వదేశీ సంస్థానం హైదరాబాద్ మాత్రమే. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో మొదలైన రవాణా వ్యవస్థ ఆధునికీకరణ ఏడో నిజాం కాలంలో పరాకాష్టకు చేరింది.
బొంబాయి నుంచి మద్రాస్‌కు వెళ్లే రైలు మార్గం హైదరాబాద్ రాజ్యంలోని గుల్బర్గా, వాడి, రాయిచూర్, గుత్తి గుండా మద్రాస్‌కు వెళ్లే మార్గాలను.. గుల్బార్గా నుంచి హైదరాబాద్‌కు కలపాలని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం, దివాన్ లేదా ప్రధాన మంత్రి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వాడి, సికింద్రాబాద్ ల మధ్య గల 110 మైళ్ల దూరాన్ని కలుపుతూ 1874, అక్టోబర్ 8న రైలు మార్గం ప్రజల కోసం తెరిచారు. మొదట్లో రైల్వేలపై పెట్టిన పెట్టుబడికి నష్టం రావడం వల్ల ఏ ఇంగ్లీష్ కంపెనీ తమ పెట్టుబడులు హైదరాబాద్ రాజ్యంలో రైల్వే రవాణా వ్యవస్థపై పెట్టడానికి ముందు రాలేదు.
ఈ సమస్యను అధిగమించడానికి నిజాం ప్రభుత్వం పెట్టిన పెట్టుబడికి 5శాతం గ్యారంటీ వడ్డీని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ కారణంగా దీన్ని నిజాం రాజ్య గ్యారంటీడ్ రైల్వే వ్యవస్థగా(ఎన్జీఎస్ఆర్) పిలిచారు. దీని పర్యవసానంగా ఒక ప్రైవేట్ బ్రిటిష్ సంస్థ, నిజాం ప్రభుత్వం మధ్యలో 1883లో ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వాడి– సికింద్రాబాద్‌ల రైల్వే లైనును 1899లో సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు పెంచారు.
అక్కడి నుంచి అంటే వరంగల్ నుంచి ఒక లైనును బెజవాడకు మరొకటి చాందాకు వేశారు. 215 మైళ్ల దూరం ఉన్న సికింద్రాబాద్, బెజవాడలను కలుపుతూ వేసిన రైల్వే లైను వల్ల బ్రిటిష్ ఇండియా పశ్చిమ, తూర్పు సముద్ర మార్గాలు అనుసంధానమయ్యాయి. వరంగల్, చాందాలను కలుపుతూ వేసిన 160 మైళ్ల రైల్వే లైను ఆ తర్వాత కాలంలో సింగరేణి బొగ్గు గనులను కలుపుతూ రైల్వే మార్గం వేయడానికి దారితీసింది.
ఈ రెండు రైల్వేలైనుల వల్ల రైలు రవాణా వ్యవస్థ, ఇతర రంగాల్లో పెను మార్పులు హైదరాబాద్ రాజ్యంలో చోటుచేసుకున్నాయి. 1899లో గోదావరి వ్యాలీ నుంచి మన్మాడ్కు కలుపుతూ నిర్మించిన 386 మైళ్ల రైలు మార్గం మన్మాడ్, ఔరంగాబాద్, పర్బని, నాందేడ్, సికింద్రాబాద్‌ల గుండా వెళ్తూ నిజాం రాజ్య ఆర్థికాభివృద్ధికి చాలా తోడ్పడింది.
నాంపల్లి రైల్వే స్టేషన్
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మించారు. దీన్నే హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. ఈ రైల్వే స్టేషన్ బురద ప్రాంతంలో కట్టడం వల్ల దీనికి నాంపల్లి అని పేరు వచ్చింది. ఉర్దూలో నామ్ అంటే తడితడిగా ఉన్న భూభాగం. పల్లి అంటే ప్రాంతం. ఈ స్టేషన్‌ను బాగే ఇ ఆమ్ లేదా నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌ను నిర్మించే సమయంలో కట్టారు. ఈ రైల్వే లైనును ముఖ్యంగా వస్తువుల రవాణాకు మాత్రమే ఉపయోగించారు. ఈ స్టేషన్ నుంచి 1912లో మొదటి ప్యాసింజర్ రైలు ప్రారంభమైంది.
కాచిగూడ స్టేషన్
కాచిగూడ రైల్వే స్టేషన్ నిజాం నవాబులు కట్టించిన వాటిలో ముఖ్యమైనది. ఈ స్టేషన్ 1916లో నిర్మించారు. 1950 వరకు నిజాం రాజ్య గ్యారంటీడ్ రైల్వేస్టేషన్(ఎన్జీఎస్ఆర్) హెడ్ క్వార్టర్ గా కొనసాగింది. కాచిగూడ రైల్వే స్టేషన్ కంటే ముందు 1916 వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ హెడ్ క్వార్టర్స్‌గా ఉండేది.
ఈ రైల్వేస్టేషన్ సెంట్రల్, సైడ్ డోములతోపాటు మినరేట్స్ను కలిగి ఉండి గోథిక్ ఆర్కిటెక్చర్‌తో అందంగా నిర్మితమైంది.
ఎన్ఎస్ఆర్ బోర్డు
నిజాం రాజ్యంలో రైల్వే లైన్ల నిర్మాణం 1930 వరకు ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీల ఆధ్వర్యంలో కొనసాగేది. దీని పరిపాలన, నిర్మాణ బాధ్యతలను 1930లో నిజాం రాజ్య రైల్వే (ఎన్ఎస్ఆర్) బోర్డు ఆధ్వర్యంలోకి తీసుకువచ్చి మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన అంతమయ్యే వరకు అంటే.. 1948 వరకు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగింది.
విమానయానం
దేశంలో సొంత విమానయాన వ్యవస్థను కలిగి ఉన్న తొలి స్వదేశీ సంస్థానం హైదరాబాద్. దీని హెడ్‌క్వార్టర్స్ బేగంపేట కేంద్రంగా ఉండేది. 1938లో నిజాం నవాబు జారీ చేసిన ఫర్మానా ప్రకారం దక్కన్ విమానయాన సంస్థ నిజాం ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థాపించబడి, ఎరోడ్రమ్ ఎయిర్‌పోర్టు బేగంపేటలో ఏర్పాటై నిజాం రైల్వే ఆధీనంలోకి వచ్చింది. 1930 నుంచి రైల్వే వ్యవస్థ నిజాం గ్యారంటీడ్ రాజ్య రైల్వే బోర్డు ఆధ్వర్యంలో పనిచేయడం ప్రారంభమైంది. 1932 నుంచి రోడ్డు రవాణా, 1938 నుంచి విమానయాన సర్వీసు రైల్వే బోర్డు ఆధీనంలోకి వచ్చి నిజాం రాజ్య పాలన ముగిసేవరకు కొనసాగాయి.
రోడ్డు రవాణా
1868కి పూర్వం హైదరాబాద్‌ను కలుపుతూ సోలాపూర్, గుల్బర్గ, కర్నూల్, మచిలీపట్నం, హనుమకొండ, నాగపూర్‌లను కలుపుతూ కొన్ని ముఖ్యమైన రోడ్డు రవాణా మార్గాలుండేవి. ఈ రోడ్లన్నీ 1867లో నిజాం ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం హైదరాబాద్‌ను జిల్లాలను కలుపుతూ రోడ్డు మార్గాలు, రాజధాని నుంచి బ్రిటీష్ ఇండియా ప్రాంతాలను కలపుతూ కొన్ని ముఖ్యమైన రోడ్లు నిర్మించారు. నిజాం రాజ్యంలో 1891లో 1,241 మైళ్లు ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థ 1940లో 5,911 మైళ్లకు పెరిగింది.
ప్రైవేట్ వ్యక్తులు, ఏజెన్సీల ఆధ్వర్యంలో నడిచే రోడ్డు రవాణా వ్యవస్థలోని సర్వీసులు రెగ్యులర్‌గా నడపకపోవడమే గాక, దాని చార్జీలను కూడా ఏకపక్షంగా విధించేవారు. ఈ కారణంగా 1932లో నిజాం ప్రభుత్వం రోడ్డు రవాణా వ్యవస్థను ప్రభుత్వ ఆధీనంలోని రైల్వే బోర్డు పరిపాలనలోకి తీసుకుంది. ఆ విధంగా 1932లో స్టేట్ రైల్వేలో భాగంగా మొదటి రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. దీన్నే నిజాం రాష్ట్ర రైలు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటారు. ఈ సంస్థ 1932లో 27 బస్సులతో 166 మంది కార్మికులతో ప్రారంభమైంది. 1936 వరకు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్ డిపోలను ప్రారంభించారు.