ప్రపంచ చరిత్రలో ఎంతో విశిష్టమైంది క్రీ.పూ. ఆరో శతాబ్దం. ఈ కాలంలో నాటి ప్రపంచ ప్రముఖ నాగరికతా కేంద్రాలన్నింటిలో సాంఘిక, రాజకీయ, మత, సాంస్కృతిక రంగాల్లో తీవ్రమైన సంచలనం కలిగింది. ఆనాటికి అమలులో ఉన్న మత వ్యవస్థలపై తిరుగుబాటు ధోరణి ప్రబలడం వల్ల సంభవించిన పరిణామం. ఆ కాలంలో ఏర్పడిన జైన, బౌద్ధ మతాలు రెండింటిలో అత్యంత ప్రాచీనమైంది జైన మతం. జిన అనే పదం నుంచి జైనం ఆవిర్భవించింది. జైనులను నిగ్రంధులు, శ్రమణులు అని పిలుస్తారు. వేదాలు శ్రమణుల గురించి ప్రస్తావించింది. జైన మతాన్ని అధికారికంగా గుర్తించిన రాజ్యం లిచ్ఛవి.
జైన సాహిత్యాన్ని అధికంగా అర్థమాగధి, ప్రాకృతంలో రాశారు. అయితే, జైనమత ప్రచార భాషగా ప్రాకృతం ఉండేది. ప్రాకృతం భాష నుంచి అనేక ప్రాంతీయ భాషలు ఉద్భవించాయి. ఉదాహరణకు శౌరసేని. ఇది ప్రస్తుతం మరాఠీ భాషగా మారింది. ఆ తర్వాతి కాలంలో జైన సన్యాసులు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. జైన మత గ్రంథాలను అంగాలు అంటారు. అకరంగసూత్ర, సూత్రక్రితంగ, బృహత్కల్ప సూత్రాలు తొలి జైన సాహిత్యంగా పరిగణించబడుతాయి.
అంగాలు: వీటి సంఖ్య 12 (ద్వాదశాంగములు). ఇవి అర్థమాగధి భాషలో రచించబడ్డాయి. వీటికే మరోపేరు ఉపాంగములు. వీటిపై రాసిన వ్యాఖ్యానాలను నిరూక్తులు అంటారు. ఇవి మొదట 14 ఉన్నాయి. వీటినే పూర్వములు అన్నారు. వీటినే 12 గ్రంథాలుగా మొదటి జైన పరిషత్తులో సంకలనం చేశారు.
భద్రబాహు: ఇతను కల్పసూత్ర(ప్రాకృతం) అనే గ్రంథాన్ని రచించాడు. కల్పసూత్రాలో మూడు భాగాలున్నాయి. అందులో ఒకటి జీన చరిత్ర. జైనతీర్థంకరుల చరిత్ర ముఖ్యంగా పార్శ్వనాథ, మహావీరుల చరిత్రను తెలియజేస్తుంది. రెండోది ధెరావళి చరిత్ర 11 మంది గణాధారుల గురించి తెలియజేస్తుంది. మూడోదైన సమాచారి నియమాలు, నిబంధనల గురించి తెలియజేస్తుంది.
కుండ కుందనాచార్య: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్రాంతానికి చెందినవాడు. ఇతను దిగంబర సన్యాసి. ఈయన అసలు పేరు పద్మనందిన్. కుండ కుందనాచార్య రాసిన మూడు పుస్తకాలను కలిపి సారత్రయం లేదా ప్రభాత్ త్రయం అంటారు. అవి.. సమయంసారం, ప్రవచనసారం, పంచాస్తికాయ సారం.
సోమదేవసూరి: వేములవాడ రాజ్యాస్థానంలో ఉండేవాడు. ఇతని బిరుదు శాద్వాద చలసింహ. ఇతను యశస్తిలక(సంస్కృతం), నీతి వాక్యామృత (సంస్కృతం) అనే గ్రంథాలను రచించాడు.
హేమచంద్రసూరి: ఈయనకు కలికాల సర్వజ్ఞ అనే బిరుదు ఉంది. హేమచంద్రసూరి కనౌజ్ను పాలించే ప్రతిహార వంశ రాజైన కుమారపాలుని ఆస్థానంలో ఉన్నాడు. ఇతను సల్లేఖన వ్రతం ఆచరించి ప్రాణం వదిలాడు. ఇతను రాసిన గ్రంథాల్లో ముఖ్యమైనవి. అవి.. పరిశిష్టపర్వన్ లేదా స్థవిరవలి చరిత్ర, అభిదాస చింతామణి, కుమారపాల చరిత, త్రిషష్టి సలక పురుష చరిత్ర(ఇందులో 63 మంది గొప్ప జైన సన్యాసుల గురించి ఉంది).
విశ్వవలయాలపై నమ్మకం: జైనమతం ప్రకారం సృష్టి కాలగమనానికి 12 ఆకులు గల చక్రంతో పోల్చుతారు. 12 ఆకులతో కూడిన చక్రము ప్రతి భ్రమణాన్ని కల్ప అంటారు. ప్రతి కల్ప ఆరు యుగాలుగా విభజించబడింది. ఈ ఆకులు రెండు రకాలుగా ఉంటాయి. అవి.. 1. ఉత్సర్పిణి (ఎగువకు వెళ్లే ఆరు ఆకులు): ఈ కాలపు మానవులు నాగరికులుగా ఉంటారు. 2. అవసర్పిణి (దిగువకు వచ్చే ఆరు ఆకులు): దీనిలో మానవులు మరుగుజ్జులుగా ఉంటారు.
జైన శిల్పం, జైన పూజించే స్త్రీదేవత: విద్యాదేవి.
జైనశిల్ప సంపదకు తార్కాణాలు: మౌంట్ అబూలోని దిళ్వారా ఆలయాలు (రాజస్థాన్). ఈ ఆలయాన్ని తేజపాల, వస్తు పాల నిర్మించాడు. ఉదయగిరి పర్వతాల్లో ఖారవేలుడు జైనులకు గుహాలయాలను నిర్మించాడు. ఎల్లోరా గుహలు (మహారాష్ట్ర), పార్శ్వనాథ కొండలు (జార్ఖండ్). ఉజ్జయిని జైన మతానికి ప్రముఖ విద్యా కేంద్రంగా ఉంది. తెలంగాణలో కొలనుపాక జైనుల ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి.
జైనం సేవ: కానరెసి (కన్నడం), శౌరసేని(మరాఠీ) వంటి ప్రాంతీయ భాషల అభివృద్ధికి కారణమైంది. తొలుత విద్యాలయాలను స్థాపించడం, విద్యాభివృద్ధికి కృషిచేశారు. భారతీయ వాస్తు శిల్ప కళాభివృద్ధికి జైనమతం చేసిన ఇతోధిక సేవ గుహాలయాల నిర్మాణం.
శ్రావణ బెలగొళ: ఇది కర్ణాటకలోని హసన్ జిల్లాలోని శ్రావణ బెలగొళ వద్ద గల వింధ్యగిరి పర్వతంపై ఉంది. ఇక్కడ దిగంబర జైనమతం ఆవిర్భవించింది. ఇక్కడ రుషభనాథుని కుమారుడైన గోమటేశ్వర విగ్రహం లేదా బాహుబలి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని 10వ శతాబ్దంలో పశ్చిమ గంగరాజు నాలుగో రాచమల్లుని మంత్రి చాముండరాయ ప్రతిష్ఠించాడు. దీని ఎత్తు 57 అడుగులు లేదా 17 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఫ్రీ స్టాండింగ్ మోనోలిథిక్ గ్రానైట్ విగ్రహం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శ్రావణ బెలగొళలో మహామస్తాభిషేకం జరుగుతుంది. చంద్రగుప్తమౌర్యుడు సల్లేఖనవ్రతం ఆచరించిన కొండను ప్రస్తుతం చంద్రగిరి కొండగా పేర్కొంటున్నారు.
సంఖ్య తీర్థంకరులు చిహ్నం యక్ష యక్షిణి
1 రుషభనాథుడు/ ఆదినాథ వృషభం గోముఖ చక్రీశ్వర్
10 శీతలనాథుడు కల్పవృక్షం – –
21 నమినాథ నీలి కమలం బ్రికుతి గాంధారి
22 అరిష్టనేమి/ నేమినాథ సముద్ర గవ్వ గోమేథ అంబిక
23 పార్శ్వనాథ పాము ధర్మేంద్ర, పార్శ్వ పద్మావతి
24 మహావీర సింహం మాతంగ సిద్ధాయిక.
జైన తీర్థంకరులు
తీర్థంకర అనే పదానికి అర్థం వారధిని నిర్మించినవాడు లేదా మార్గం చూపువాడు. జైన సాహిత్యం ప్రకారం మొత్తం 24 మంది తీర్థంకరులూ క్షత్రియ కులానికి చెందినవారు. మొదటి 22 మంది తీర్థంకురుల గురించి చారిత్రక ఆధారాలు లేవు. 23వ, 24వ తీర్థంకరుల గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రుగ్వేద మంత్రాల్లో రుషభనాథుడు, అరిస్టనేమి (నేమినాథుడు)లను ప్రస్తావించారు. కాగా, విష్ణు, భాగవత పురాణాల్లో నారాయణుని అవతారంగా రుషభనాథుణ్ని ప్రస్తావించారు. అరిష్టనేమిని కృష్ణునికి బంధువుగా భావించారు. ఒక జైనుడు తీర్థంకరుడు కావాలంటే సాధు (పరిపూర్ణ సన్యాసి), ఉపాధ్యాయ (టీచర్ స్థాయి), ఆచార్య (ప్రొఫెసర్ స్థాయి), అరిహంత్ (నిర్యాణం పొందబోయేవాడు) అనే నాలుగు దశలు దాటాలి.
కవి జైనమత గ్రంథం
ధనపాల తిలకమంజరి (సంస్కృతం)
న్యాయచంద్రసూరి హమ్మిర మహాకావ్యం(సంస్కృతం)
అమోఘవర్ష ప్రశ్నోత్తర రత్నమాలిక,
కవిరాజమర్గం(కన్నడ)
మునిచంద్రుడు గాధాకోశ
సోమప్రభు శృంగార వైరాగ్య తరంగిణి
మహావీరుడు సూత్రాంగాలు (అర్థమాగధి)
జినసేనుడు, గుణభద్ర మహాపురాణం
అకర నాగ సూత్ర కృతాంగ
హేమచంద్రుడు పరిశిష్ట పర్వన్
జయంజొండర్ కలింగట్టు పరణి