రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి ఆస్తి హక్కు విషయంలో అనేక వివాదాలు, సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా భూ సంస్కురణల చట్టాలు, బ్యాంకుల జాతీయీకరణ తదితర అంశాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకొని ఆస్తి హక్కు విషయంలో అనేక సవరణ చేస్తూ 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగపరమైన హక్కుగా చట్టాలకు అనుగుణంగా పౌరులకు లభించే హక్కుగా మార్చారు. 44వ రాజ్యంగ సవరణ ప్రకారం 31వ అధికరణ నుంచి ప్రాథమిక హక్కును తొలగించి 300ఏ అధికరణంలో పొందుపర్చారు. చట్టంచే నిర్ధారించిన పద్ధతిలో మరేవిధంగానూ వ్యక్తి ఆస్తి హక్కుకు భంగం కలిగించరాదు అనే అంశాన్ని చేర్చారు.
మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశాలు
ఆర్టికల్ 31ఎ: ప్రజా ప్రయోజనం, సమాజ సమష్టి ప్రయోజనం, సరైన నిర్వహణ కోసం వ్యక్తి ఆధీనంలోని ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వాలు చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవచ్చు. ఈ విధంగా రూపొందించిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ న్యాయస్థానాలు ప్రకటించకుండా ఈ చట్టాలకు న్యాయ సంరక్షణ కల్పించారు.
ఆర్టికల్ 31బి: ఆస్తిని స్వాధీనపరుకునే విషయంలో రూపొందించిన చట్టాలకు నియమ నిబంధనలకు సంరక్షణ కల్పించడం. ఆస్తిని జాతీయం చేసే విషయంలో రూపొందించిన చట్టాలు లేక నియమనిబంధనలు లేక రాజ్యాంగ సవరణలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా భావించకుండా వాటిని 9వ షెడ్యూల్లో పేర్కొన్న విషయాలకు న్యాయస్థానాల న్యాయసమీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు.
25వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశం
ఆర్టికల్ 31సి: కొన్ని ఆదేశిక సూత్రాలను అమలుపర్చడం కోసం శాసనశాఖ రూపొందించే చట్టాలకు న్యాయ సంరక్షణ ఉంటుంది. అందువల్లనే ఈ చట్టాలను సంరక్షణ చట్టాలుగా పేర్కొంటారు. ఈ చట్టాలు ఏమైనా ప్రాథమిక హక్కుల్లోని 13, 14, 19 అధికరణలకు విరుద్ధంగా న్యాయస్థానాలు ప్రకటించకూడదు.
నిరసన తెలిపే హక్కు పౌరుడి ప్రాథమిక హక్కు
మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర సచివాలయానికి పౌర సమాజం తలపెట్టిన నిరసన యాత్రకు అనుమతిస్తూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడి అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పుల ద్వారా కలకత్తా హైకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా తీర్పునిచ్చింది.
ఆగస్టు 27న పౌర సమాజం జరపతలపెట్టిన రాష్ట్ర సచివాలయ దిగ్బంధనాన్ని నిషేధించాలంటూ శిబ్పూర్ వాసి, న్యాయవాది వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. శాంతియుత నిరసనలు పౌరుడి ప్రాథమిక హక్కు. ఈ హక్కును అడ్డుకోమని న్యాయమూర్తి హరీష్ లాండన్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ పేర్కొన్నది.
ఆగస్టు 9న జరిగిన అమానవీయ ఘటనపై రాష్ట్రంలోనూ, దేశంలోనూ శాంతియుతంగా నిరసన ర్యాలీలు జరుగుతున్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ కేసును సుమోటోగా విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు పౌర సమాజం చేపట్టే శాంతియుత నిరసనలపై బెంగాల్ ప్రభుత్వం సంయమనం పాటించాలని హితవు పలికింది.
నిరసన హక్కు రాజ్యాంగ నిబంధనలు
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు భారత రాజ్యాంగంలో పొందుపర్చారు.
ఆర్టికల్ 19 (1)ఎ: వాక్, భావప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తుంది.
ఆర్టికల్ 19 (1) బి: పౌరులకు శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే హక్కుకు హామీ ఇస్తుంది.