కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటే ఆ ప్రభుత్వాన్ని సమాఖ్యగానూ అధికార విభజన లేకుండా అన్ని అధికారాలు కేంద్రానికే ఉంటే దానిని ఏక కేంద్ర ప్రభుత్వంగాను పరిగణిస్తారు. భారత రాజ్యాంగంలో ఎక్కడా సమాఖ్య ప్రభుత్వంగా పేర్కొనబడనప్పటికీ కేంద్ర, రాష్ట్రాల మధ్య స్పష్టమైన అధికార విభజన కారణంగా మన దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉన్నట్టుగా భావించవచ్చు. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు, ఆర్థిక అధికారాలు స్పష్టంగా విభజించబడ్డాయి.
భారతదేశంతో ఏకీకృత న్యాయవ్యవస్థ ఉండటం వల్ల న్యాయ అధికారాలు విభజించబడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సామరస్యం, సమన్వయం ఉంటే సమాఖ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలను వివిధ కోణాల్లో నియంత్రించడానికి రాజ్యాంగంలో విస్తృతమైన నిబంధనలు పొందుపర్చారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య గల సంబంధాలను శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలుగా పేర్కొనవచ్చు.
శాసన సంబంధాలు: రాజ్యాంగంలో 11వ భాగంలో ఆర్టికల్ 245 నుంచి 255 వరకు కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాలు పేర్కొన్నారు. 2016లో చేర్చిన 246ఏతో కలిపి మొత్తం 12 ఆర్టికల్స్ ఉన్నాయి.
ఆర్టికల్ 245(1): ఒక రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ఆ రాష్ట్ర భూభాగానికే వర్తిస్తుంది.
ఆర్టికల్ 245(2): పార్లమెంట్ రూపొందించే చట్టాలు దేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. ప్రపంచంలోని ప్రతీ భారత పౌరుడికి, వారి ఆస్తికి వర్తిస్తాయి. ఈ లక్షణాన్ని ఎక్స్‌ట్రాటెరిటోరియల్ లెజిస్లేషన్ అంటారు.
246(4): దేశం మొత్తానికి గానీ లేక ఏదైనా ఒక ప్రాంతానికి మాత్రమే వర్తించేటట్లు పార్లమెంట్ చట్టాలు రూపొందించవచ్చు.
పార్లమెంట్ రూపొందించే కొన్ని చట్టాలు కింది ప్రాంతాలకు వర్తించవు.
1. కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, లడఖ్ విషయంలో రాష్ట్రపతి నియమాలు రూపొందిస్తారు.
2. అసోంలోని స్వయం ప్రతిపత్తిగల జిల్లాలోని గిరిజన ప్రాంతంలో గవర్నర్ నియమాలు రూపొందిస్తారు.
3. మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని స్వయ ప్రతిపత్తి జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు రాష్ట్రపతి నియమాలు రూపొందిస్తారు.
పరిపాలనా సంబంధాలు: రాజ్యాంగంలోని 11వ భాగంలోని 256 నుంచి 263 వరకు గల నిబంధనలు సాధారణ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్యగల పరిపాలనా సంబంధాలను తెలియజేస్తాయి.వీటిలో మొత్తం 10 ఆర్టికల్స్ ఉండగా రెండింటిని (ఆర్టికల్ 257ఏ, 259) తొలగించారు.కార్యనిర్వాహక అధికారాలు: ఆర్టికల్ 256 ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన కార్యనిర్వహణాధికారాలను పార్లమెంట్ చేసిన చట్టాలకు లోబడి వినియోగించుకోవాలి.
ఆర్టికల్ 257 ప్రకారం రాష్ట్రాలు తమ అధికారాలను వినియోగించుకునే సందర్భంలో అవి కేంద్ర ప్రభుత్వ అధికారాలను ప్రశ్నించే విధంగా ఉండకూడదు. పైన పేర్కొన్న రెండు విషయాల్లో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన సూచనలు చేయవచ్చు. ఈ సూచనలు రాష్ట్రాలు తప్పకుండా పాటించాలి. లేకపోతే ఆర్టికల్ 365 ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వం విఫలమైందని రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంట్ చట్టం చేసినా ఆ అంశంపై, కార్యనిర్వాహక అధికారం మాత్రం రాష్ట్రాలకే ఉంటుంది.
పరస్పర విధుల బదిలీ: ఆర్టికల్ 258 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకున్నా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పాలనా విధులను పార్లమెంట్ శాసనం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం అనుమతితో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ విధులను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ బదలాయించవచ్చు. ఈ అంశాన్ని 1956లో ఏడో రాజ్యాగ సవరణ ద్వారా ఆర్టికల్ 258 (ఏ)ను చేర్చారు.
ఆర్టికల్ 260 ప్రకారం భారత ప్రభుత్వం ఒక ఒప్పందం ద్వారా భారతదేశం బయట ఉన్న భూభాగాల కార్యనిర్వాహక, శాసన, పరిపాలనా విధులను చేపట్టవచ్చు. ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కేంద్రం కార్యనిర్వాహకపరమైన ఆదేశాలను రాష్ట్రాలకు జారీ చేయవచ్చు. ఈ సందర్భంలో రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో పనిచేస్తుంది. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రపతి, రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్, కార్యనిర్వాహక అధికారుల అధికారాలను పూర్తిగా నియంత్రిస్తారు. ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రం పాటించాల్సిన ఆర్థిక నియమావళిని కేంద్రం నిర్దేశించవచ్చు.
ఆర్థిక సంబంధాలు
రాజ్యాంగంలోని 12వ భాగంలో గల 268 నుంచి 293 వరకు గల ఆర్టికల్స్ కేంద్ర, రాష్ట్రాల మధ్యగల ఆర్థిక సంబంధాలను వివరిస్తాయి. వీటిలో మొత్తం 30 ఆర్టికల్స్ ఉండగా నాలుగింటిని తొలగించారు. రాజ్యాంగంలో ఏడో షెడ్యూల్లో పన్నులను విధించే అంశాల గురించి పేర్కొన్నారు.
కేంద్రం విధించే పన్నులు: కేంద్ర జాబితాలోని అంశాలపై పన్ను విధించే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కేంద్ర జాబితాలోని 13 అంశాల మీద పార్లమెంట్ పన్ను విధిస్తుంది. కార్పొరేషన్ పన్ను, వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, పొగాకుపై ఎక్సైజ్ సుంకం, ఎగుమతి, దిగుమతి సుంకాలు, స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ పన్ను, వ్యవసాయేతర భూముల వారసత్వ బదలాయింపు పన్ను, వ్యవసాయేతర ఎస్టేట్లపై పన్ను, వారసత్వ పన్ను, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇన్యూరెన్స్ పాలసీల బదిలీలపై పన్ను, సర్వీసులపై పన్ను, వార్తా పత్రికలపై అమ్మకపు పన్ను, అంతర్రాష్ట్ర వ్యాపారంలో విధించే అమ్మకపు పన్ను, అంతర్రాష్ట్ర వాణిజ్యంలో సరుకులపై విధించే పన్ను, అంతర్రాష్ట్ర రవాణా పన్ను, మూలధన విలువపై పన్ను.
రాష్ట్రం విధించే పన్నులు: రాష్ట్ర జాబితాలోని అంశాలపై పన్ను విధించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర జాబితాలోని 18 అంశాల మీద రాష్ట్ర శాసనసభ పన్ను విధిస్తుంది.
రాష్ట్రం పరిధిలోకి వచ్చే పన్నులు: అమ్మకంపై పన్ను, భూమిశిస్తు పన్ను, వారసత్వ పన్ను, విలాసాలపై పన్ను, స్థిరాస్తులపై పన్ను, అడవులపై పన్ను, ఆబ్కారీ పన్ను, వృత్తి పన్ను, వినోదంపై పన్ను, వాహనాలపై పన్ను, వ్యవసాయంపై పన్ను, నీటిపారుదలపై పన్ను, వాణిజ్యపరమైన సంస్థలపై పన్ను.
ఉమ్మడి జాబితాలోని అంశాలపై పన్ను: ఉమ్మడి జాబితాలో పన్ను విధించే అంశాలు లేవు. కానీ 101వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2016లో జీఎస్టీని ఉమ్మడి జాబితాలో పన్ను విధించే అంశంగా చేర్చారు. ఇందుకోసం ఆర్టికల్ 246ఏను రాజ్యాంగంలో చేర్చారు. ఈ జీఎస్టీని పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు విధించవచ్చు. కానీ అంతర రాష్ట్ర వాణిజ్యానికి సంబంధించి మాత్రం జీఎస్టీని కేవలం పార్లమెంట్ మాత్రమే విధిచాలి.
శాసన జాబితాల పంపిణీ
కేంద్ర, రాష్ట్రాల మధ్య మూడు జాబితాల రూపంలో అధికార పంపిణీ చేయబడింది. కేంద్ర జాబితా 246(1), ఉమ్మడి జాబితా 246(2), రాష్ట్ర జాబితా 246(3). వీటి వివరాలు ఏడో షెడ్యూల్లో పొందుపరచబడ్డాయి. వీటిలో పేర్కొన్న అంశాలను ఎంట్రీలు అంటారు.
కేంద్ర జాబితా: ఈ జాబితా ప్రారంభంలో 97 అంశాలు ఉండేవి. ప్రస్తుతం కూడా అంశాల చివరి సంఖ్య ఎంట్రీ 97 అయినా అంశాలు 98 అంశాలు ఉన్నాయి. వీనిపై చట్టం రూపొందించే, సవరించే, రద్దు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.
రాష్ట్ర జాబితా: ఈ జాబితాలో 66 అంశాలు ఉండేవి. ప్రస్తుతం 59 అంశాలు ఉన్నాయి. అంటే ఈ జాబితా నుంచి ఏడు అంశాలు తొలగించగా, ఇప్పటివరకు నూతన అంశాలను చేర్చలేదు. రాష్ట్ర జాబితాపై చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. కింద సందర్భాల్లో పార్లమెంట్ కూడా రాష్ట్ర జాబితాపై చట్టం చేయవచ్చు.
ఉమ్మడి జాబితా
ప్రారంభంలో ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉండగా, ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి. వీటిపై కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయవచ్చు. కాబట్టి ఈ జాబితాను ప్రముఖ విద్యావేత్త ఎంవీ పైలీ సంధ్యా సమయ మండలమని పిలిచారు.
అవశిష్ట అధికారాలు
కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో ప్రస్తావించని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. ఆర్టికల్ 248 ప్రకారం రాజ్యాంగం అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇచ్చింది. కాబట్టి ఈ అవశిష్ట అధికారాల జాబితాకు సంబంధించి పన్ను విధించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో అవశిష్ట అధికారాలను ఇవ్వగా కెనడాలో మాత్రం కేంద్రానికి ఇచ్చారు.