వెలుగు సక్సెస్: తెలంగాణ జనాభా

వెలుగు సక్సెస్: తెలంగాణ జనాభా

తెలంగాణ జాగ్రఫీలో జనాభా ముఖ్య లక్షణాలు అనే అంశం చాలా కీలకమైంది. ఈ అంశం నుంచి ప్రతి పోటీ పరీక్షలోనూ తప్పనిసరిగా ప్రశ్నలు వస్తుంటాయి. అందుకే జనాభాకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా చదవాలి. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల ప్రకారం జనాభా, వృద్ధిరేటు, స్త్రీ పురుష నిష్పత్తి, శిశు మరణాలరేటు, అక్షరాస్యత తదితర అంశాలను తెలుసుకుందాం. 

తెలంగాణ రాష్ట్రం 1.2 లక్షల చ.కి.మీ.ల విస్తీర్ణం కలిగి 3.51కోట్ల జనాభాతో 12వ, విస్తీర్ణం దృష్ట్యా 11వ పెద్ద రాష్ట్రంగా అవతరించింది. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ 3.5శాతం విస్తీర్ణాన్ని కలిగి ఉంది. 1961 నుంచి 2011 వరకు జనాభా పరిమాణం, జనాభా సంబంధిత లక్షణాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 

సం.    జనాభా    వృద్ధిరేటు

1961    1,26,94,581    16.5శాతం
1971    1,58,17,895    24.6శాతం
1981    2,01,82,438    27.6శాతం
1991    2,60,89,074    29.3శాతం
2001    3,09,87,271    18.8శాతం
2011    3,50,03,674    13.6శాతం

జనాభా వృద్ధిరేటు 

ఒక ప్రదేశంలో రెండు వేర్వేరు సమయాల్లో జనాభాలో సంభవించే మార్పు లేదా పెరుగుదలను జనాభా వృద్ధిరేటు అంటారు. ఈ మార్పును శాతంలో తెలియజేస్తే జనాభా వృద్ధిరేటు అని, ఒక సంవత్సరానికి గణిస్తే దానిని వార్షిక జనాభా వృద్ధి రేటు అంటారు. తెలంగాణ జనాభాలో 1951–61లో వార్షిక వృద్ధిరేటు 1.7శాతంగా నమోదైంది. ఈ వృద్ధిరేటు 1961–71 నాటికి 2.2శాతం, 1971–81 నాటికి 2.5శాతం, 1981–91 నాటికి 2.6శాతం, 1991–2001లో వార్షిక వృద్ధిరేటు 1.7శాతం నుంచి 2001–11 నాటికి 1.4శాతం మేరకు పెరిగింది. గత 60 సంవత్సరాల్లో అత్యధిక వార్షిక వృద్ధిరేటు (2.6శాతం) 1981–91 మధ్య నమోదు కాగా, అతి తక్కువ వృద్ధిరేటు 1.4శాతం 2001–11లో నమోదైంది. 

గ్రామీణ, పట్టణ జనాభా 

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.50కోట్లు. జిల్లాల వారీగా గమనిస్తే అత్యధికంగా 39,43,323 జనాభాతో హైదరాబాద్​ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత మేడ్చల్–​ మల్కాజిగిరి 24,60,095, రంగారెడ్డి 24,26243 వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ములుగు జిల్లా 2,94,671 జనాభాతో అతి తక్కువ జనాభా గల జిల్లాగా చివరి స్థానంలో ఉంది. తెలంగాణలో గ్రామీణ జనాభా 2.15 కోట్ల (61.3శాతం) ఉంది. గ్రామీణ జనాభా అత్యధికంగా గల జిల్లా ములుగు (96.1శాతం). రెండో స్థానంలో  నారాయణపేట(92.6శాతం), మూడో స్థానంలో మెదక్​ (92.3శాతం) జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్​ జిల్లా మహానగరం కావడంతో గ్రామీణ జనాభా లేదు. ఆ తర్వాత తక్కువ గ్రామీణ జనాభా మేడ్చల్​– మల్కాజిగిరి (8.5శాతం) జిల్లాలో ఉంది. తెలంగాణలో పట్టణ జనాభా 1.36 కోట్లు (38.7శాతం) ఉంది. హైదరాబాద్​ జిల్లా 39.43 లక్షల జనాభాతో 100 శాతం మేరకు పట్టణ జనాభాను కలిగి ఉంది. మేడ్చల్–​ మల్కాజిగిరి 22.50 లక్షల జనాభా(91.5శాతం)తో  రెండో స్థానంలో ఉంది. అతి తక్కువ పట్టణ జనాభాను ములుగు 11,493 (3.9శాతం) కలిగి ఉంది. 

స్త్రీ పురుష నిష్పత్తి

స్త్రీ పురుష నిష్పత్తిని లింగ నిష్పత్తి అని కూడా అంటారు. ఈ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్యను తెలుపుతుంది. స్త్రీల, పురుషుల నిష్పత్తి సరిగ్గా లేకపోతే అది అనేక సాంఘిక, ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. జాతీయ స్థాయి సగటు లింగ నిష్పత్తి 2011లో 940 కాగా, తెలంగాణ రాష్ట్రంలో 988గా ఉంది.


సంవత్సరం    తెలంగాణ    భారతదేశం

1951    980    946
1961    975    941
1971    969    930
1981    971    934
1991    967    927
2001    971    933
2011    988    940
 

జిల్లాల వారీగా లింగ నిష్పత్తి 

తెలంగాణలో స్త్రీ పురుష నిష్పత్తి 2011లో 988 ఉండగా, నిజామాబాద్​లో 1044, భద్రాద్రి కొత్తగూడెంలో 1008, ఖమ్మంలో 1005, జగిత్యాలలో 1036, జయశంకర్​ భూపాలపల్లిలో 1009, కామారెడ్డిలో 1033, మెదక్​లో 1027, నారాయణపేటలో 1009, నిర్మల్​లో 1046, రాజన్న సిరిసిల్లలో 1014, సిద్దిపేటలో 1008, వికారాబాద్​లో 1001గా ఉన్నాయి. స్త్రీ, పురుష నిష్పత్తి గ్రామాల్లో 999గాను, పట్టణాల్లో 970గాను ఉంది.

పిల్లల లింగ నిష్పత్తులు

తెలంగాణ స్టేట్​ స్టాటిస్టికల్​ ఆబ్​స్ట్రాక్​ – 2021 ప్రకారం రాష్ట్రంలో 38,99,166 మంది పిల్లలు (0–6 సంవత్సరాలు) ఉన్నారు. అందులో బాలికలు 18,81,231 ఉండగా, 20,17,935 మంది బాలురు ఉన్నారు. రాష్ట్రంలో పిల్లల లింగ నిష్పత్తి 932. రాష్ట్రంలో అతి తక్కువ పిల్లల లింగ నిష్పత్తి వనపర్తి, మహబూబ్​నగర్​ జిల్లాల్లో 903గా ఉంది. అత్యధిక పిల్లల నిష్పత్తి గల జిల్లా ములుగు 971. 

శిశు మరణాల రేటు 

శిశు మరణాల రేటులను గమనించినట్లయితే 2011లో 43 ఉండగా, 2012లో 41,  2012 నాటికి 39 మేరకు తగ్గింది. శిశుమరణాల రేట్లు తగ్గినప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 2011లో శిశు మరణాల రేటు గ్రామీణ ప్రాంతాల్లో 47 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 31గా ఉంది. 2012లో ఇవి వరుసగా 46, 30లుగా ఉన్నాయి. 2013లో వరుసగా 44, 29లుగా ఉన్నాయి. మగ, ఆడ శిశువుల మరణాల రేటుల్లో కూడా స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.

అక్షరాస్యత రేట్లు

1961లో తెలంగాణలో 17.3శాతం అక్షరాస్యత ఉండగా, 2011 నాటికి అక్షరాస్యత 66.5శాతం మేరకు పెరిగింది. తెలంగాణలోని అక్షరాస్యత వృద్ధిరేటు భారతదేశం కంటే ఎక్కువగా ఉన్నా 2011లో భారతదేశం, తెలంగాణల మధ్య తేడా 6.5 శాతంగా ఉంది.

సం.    తెలంగాణ    భారతదేశం

1961    17.3 %    28.3 %
1971    20 %    34.5 %
1981    26.5 %    36.2 %
1991    40.5 %    52.2 %
2001    58 %    64.8 %
2011    66.5 %    73 %

జిల్లాల వారీగా  

హైదరాబాద్​ జిల్లాలో అక్షరాస్యత అధికంగా (83.25శాతం) ఉంది. 49.93శాతంతో నారాయణపేట జిల్లా చివరి స్థానంలో ఉంది. గ్రామీణ అక్షరాస్యత రేటుల కంటే పట్టణ అక్షరాస్యత రేటులు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ అక్షరాస్యత విషయంలో 69.93శాతంతో మేడ్చల్–​ మల్కాజిగిరి జిల్లాలో అధికంగా ఉంది. 47.3శాతంతో జోగులాంబ గద్వాల్​ జిల్లా చివరి స్థానంలో ఉంది. పట్టణ అక్షరాస్యతలో 83.25శాతంతో హైదరాబాద్​ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, 71.57శాతంతో జోగులాంబ గద్వాల్​ చివరి స్థానంలో ఉంది. అక్షరాస్యత రేట్లలో గ్రామీణ – పట్టణ వ్యత్యాసం మహబూబ్​నగర్ జిల్లాలో ఎక్కువ(28.15)గా ఉంది. ఆ తదుపరి 27.09తో కుమ్రం భీమ్​, 25.68తో నాగర్​కర్నూల్​ జిల్లాలున్నాయి. 10.16తో ములుగు జిల్లా చివరి స్థానంలో ఉంది.