
రైతు సేద్యం చేసే భూమిని వ్యవసాయ కమతం అంటారు. ఇవి ఐదు రకాలు1. ఉపాంత కమతం 2. చిన్న కమతం 3. చిన్న మధ్యతరహా కమతం 4. మధ్యతరహా కమతం 5. పెద్ద కమతం. ఉపాంత కమతాన్ని సేద్యం చేసే రైతును ఉపాంత రైతు అంటారు. 1 హెక్టార్ ( 1 హెక్టార్ = 2.5 ఎకరాలు) లోపు భూమి ఉన్న రైతు ఉపాంత రైతు అంటారు. 1 నుంచి 2 హెక్టార్ల మధ్య భూమిగల రైతు చిన్న రైతుగా పిలువబడుతారు. 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతును పెద్ద రైతు అంటారు. మొత్తం కమతాల్లో ఉపాంత కమతాల వాటా 68.52 శాతం. భారత్‌లో ఉపాంత కమతాల సంఖ్య, ఉపాంత కమతాల శాతం, ఉపాంత కమతాల కింద నిర్వహించే భూమి పెరుగుతోంది. భారత్‌లో 1970–71లో 2.28 హెక్టార్లు సగటు కమత పరిమాణం కాగా, అది 2015–16 నాటికి 1.08 హెక్టార్లకు తగ్గింది. అంటే భారత్‌లో సగటు కమత పరిమాణం తగ్గుతున్నది.
వ్యవసాయ గణాంకాలు
భారత ప్రభుత్వం 1970– 71 లో వ్యవసాయ గణాంకాలను మొదటిసారిగా నిర్వహించింది. ఇప్పటివరకు 10 గణాంకాలు పూర్తయ్యాయి. 10వ పంచవర్షీయ గణాంకాలను 2015–16 సంవత్సరానికి నిర్వహించారు. 2016, ఫిబ్రవరి 3న 10వ వ్యవసాయ గణాంకాల సేకరణ ప్రారంభమై 2018, అక్టోబర్ నాటికి పూర్తయి ప్రకటించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కో ఆపరేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఐదు సంవత్సరాలకు దీనిని నిర్వహిస్తారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్‌కు చెందిన ప్రపంచ వ్యవసాయ గణాంకాలకు అనుగుణంగా ఈ వ్యవసాయ గణాంకాలు ఉంటాయి. భారతదేశంలో వ్యవసాయం సంవత్సరం జులై నుంచి జూన్ వరకు.
2010–11లో 138.35 మిలియన్లు ఉన్న భూ కమతాలు 2015–16 నాటికి 146.45 మిలియన్లకు పెరిగింది. అంటే 5.86 శాతం పెరిగింది. 2010–11లో వ్యవసాయ కమతాల విస్తీర్ణం 159.59 మిలియన్ హెక్టార్లు ఉండగా, 2015–16 నాటికి 157.82 మిలియన్ హెక్టార్లకు తగ్గింది. అంటే 1.11శాతం తగ్గింది. 2005–06లో సగటు కమత పరిమాణం 1.23 హెక్టార్లు కాగా, 2010–11 నాటికి సగటు కమత పరిమాణం 1.15 హెక్టార్లకు, 2015–16 నాటికి 1.08 హెక్టార్లకు తగ్గింది.
నిర్వహణ కమతం
పూర్తిగా గాని, పాక్షికంగా గాని ఒక వ్యక్తిగాని ఇతరులు గాని నిర్వహించే యూనిట్‌ను కమతం అంటారు. ఆ భూమి టైటిట్, చట్టబద్ధత, పరిమాణం ఒకరి పేరు మీద ఉండాలి. కమతాన్ని ఒకరే నిర్వహిస్తే దానిని వైయక్తిక కమతమని, ఇద్దరు లేదా ఎక్కువ మంది నిర్వహిస్తే ఉమ్మడి కమతం అని, ప్రభుత్వం గాని, పంచదార కర్మాగారాలు గాని, సహకార సంస్థలు గాని, ట్రస్టీలు గాని నిర్వహిస్తే వాటి సంస్థాగత కమతాలు అని అంటారు.
ప్రతి వ్యవసాయ గణాంకాల్లోను ఈ అంశాలను లెక్కిస్తారు. 1. పరిమాణం (ఉపాంత, చిన్న, సెమీ మీడియం, మీడియం, పెద్ద కమతాలు), సోషల్ గ్రూప్ (ఎస్సీ, ఎస్టీ, ఇతరులు), టైప్ ఆఫ్ హోల్డింగ్ (వ్యక్తిగతం, ఉమ్మడి, సంస్థాగతం) జెండర్ (స్త్రీలు, పురుషులు), స్టేట్స్ (రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు). 2010–11లో మహిళలు కింద ఉన్న కమతాల శాతం 12.79 శాతం కాగా, 2015–16 నాటికి 13.96 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో వీరి ఆధీనంలో ఉన్న భూ విస్తీర్ణం 10.36 శాతం నుంచి 11.72 శాతానికి పెరిగింది. అంటే ఎక్కువ మంది స్త్రీలు వ్యవసాయ కమతాల నిర్వహణలో పాల్గొంటున్నారు.
కమతాల సంఖ్య, విస్తీర్ణం, సగటు పరిమాణం
- తొలి భూకమతాల గణాంకాలు 1970–71లో నిర్వహించగా పదో భూ కమతాల గణాంకాలు 2015–16లో నిర్వహించారు. దీన్నే 10వ పంచవర్షీయ గణంకాలు అంటారు.
- 2015–16లో కమతాల సంఖ్య పెరుగుదల శాతం 5.86%. ఎక్కువ పెరుగుదల మధ్యప్రదేశ్ (12.74 %) ఆంధ్రప్రదేశ్ (11.85%)ల్లో ఉంది.
- 2015–16లో 10వ సెన్సస్‌లో ఉపాంత కమతాలు 68.45 %, చిన్న కమతాలు 17.62% కలిపి 86.08%.
- - రెండు హెక్టార్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న చిన్న, ఉపాంత కమతాల సంఖ్య 86.08% కాగా, వాటి నిర్వహణలో భూమి 46.94 % ఉంది. అంటే వీటి కింద గల భూవిస్తీర్ణం పెరిగింది.
- - సెమీ మీడియం, మీడియం కమతాల సంఖ్య 13.35శాతం. కాగా వాటి నిర్వహణలో 43.99 శాతం భూ విస్తీర్ణం ఉంది.
- - పెద్ద కమతాల సంఖ్య 0.57%. కాగా వాటి కింద గల భూవిస్తీర్ణం 9.07శాతం ఉంది.
- - చిన్న కమతాల సంఖ్య 24.78 మిలియన్ల నుంచి 25.80 మిలియన్లకు పెరిగింది. కానీ, మొత్తం కమతాల్లో వాటి శాతం 17.91శాతం నుంచి 17.62 శాతానికి తగ్గింది.
- 10వ సెన్సెస్ లో కమతాల సంఖ్యలో ఉపాంత కమతాలు, చిన్న కమతాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, కమతాల కింద ఉన్న భూ విస్తీర్ణంలో ఉపాంత కమతాలు, సెమీ మీడియం హోల్డింగ్స్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
- దేశం ఉపాంత, చిన్న కమతాలు 86.08శాతం ఉన్నాయి. మరోవైపు మధ్య, భారీ తరహా కమతాలు కలిపి 13.92శాతంగా ఉన్నాయి.
- 9వ సెన్సెస్ 10వ సెన్సెస్కు వచ్చేసరికి ఉపాంత, చిన్న కమతాల కింద సేద్యమయ్యే భూ విస్తీర్ణం, వాటి శాతం కూడా పెరిగింది. మీడియం, లార్డ్కమతాల కింద ఉన్న భూ విస్తీర్ణం, వాటి శాతం రెండూ తగ్గాయి.
- 10వ సెన్సెస్‌లో 86.08 శాతం ఉన్న ఉపాంత, చిన్న రైతుల ఆధీనంలో 46.94 శాతం భూమి ఉండగా, మిగిలిన 13.92శాతం మధ్యతరహా, భారీతరహా కమతాల ఆధీనంలో 53.06శాతం భూ విస్తీర్ణం ఉంది. అంటే భూ పంపిణీలో అసమానతలు కనిపిస్తున్నాయి.