నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలోని నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 43 మంది అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను జనవరి 2 లోగా అందించాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారని కలెక్టర్ ఉదయ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో పోటీ చేసిన అభ్యర్థులు, అభ్యర్థుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ఖర్చును బిల్లులు, ఓచర్లతో లెక్కచూపించాలన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత 30 రోజుల్లోగా అభ్యర్థి తన ఖర్చు వివరాలు అందించకుంటే, ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అభ్యర్థులు ఖర్చుల వివరాలు అందించే విషయంలో సందేహాలు ఉంటే ఈ నెల 21 నుంచి 28 వరకు రిటర్నింగ్ ఆఫీసర్ల ఆఫీసుల్లో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 29 నుంచి కలెక్టరేట్లో ఎన్నికల వ్యయ పరిశీలకులు భేరారామ్ చౌదరి అకౌంట్స్ ను పరిశీలిస్తారని చెప్పారు. అడిషనల్ కలెక్టర్లు కుమార్ దీపక్, కె.సీతారామారావు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, ఆడిట్ ఆఫీసర్లు శ్రీనివాస్ బాబు, శ్యాంబాబు, ఏఈవోలు రాజశేఖర్ రావు, శ్రీరాములు, రవికుమార్, మన్సూర్ ఖాన్ జహంగీర్ పాల్గొన్నారు.