ఖమ్మం, వెలుగు : ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టంపై అధికారులు తుది నివేదికను సిద్ధం చేశారు. మంగళవారం వరకు చేసిన అంచనాల ప్రకారం జిల్లాలో రూ.729.68 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదించారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడిన కారణంగా అత్యధికంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు రూ. 434 కోట్ల నష్టం జరిగిందని లెక్క తేల్చారు. ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్కు రూ.151.69 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు రూ.34.77 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తేల్చారు.
ఆ తర్వాత అత్యధికంగా రూ.68.34 కోట్ల మేర పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ (హౌజింగ్ డిపార్ట్మెంట్) కు రూ.25.33 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.1.48 కోట్లు, ప్రభుత్వ పాఠశాలలకు రూ.1.20 కోట్లు, ఆరోగ్య శాఖకు రూ.30 లక్షలు, విద్యుత్ శాఖకు రూ. 7.73 కోట్లు, ఫిషరీస్ డిపార్ట్ మెంట్ లో రూ.4.40 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదికలు రూపొందించారు. జిల్లాలో ఆరుగురు చనిపోగా వారికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాను కుటుంబ సభ్యులకు అందించారు.
కూసుమంచి, కారేపల్లి మండలాల్లో ఇద్దరు చొప్పున చనిపోగా, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఒకరు వరదల కారణంగా మృతి చెందారు. ఇక జిల్లాలో మొత్తం 15,096 పక్కా ఇండ్లు, పశువుల కొట్టాలు డ్యామేజీ అయ్యాయని గుర్తించారు. మరో 150 గుడిసెలు డ్యామేజీ అయ్యాయని తేల్చారు.
వరద సాయం జమ!
ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వ సహాయం అకౌంట్లో జమవుతోంది. మొత్తం 15,200 మందికిపైగా బాధితులు ఉండగా, మంగళవారం రాత్రి వరకు 50 శాతం మంది వరకు బాధితులు అకౌంట్లో డబ్బులు జమయ్యాయని, మిగిలిన అందరికీ బుధవారం సాయంత్రం లోపు రూ.16,500 చొప్పున అకౌంట్లో జమ అవుతాయని ఆఫీసర్లు చెపుతున్నారు.