లోక్‌సభ స్పీకర్
లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహించేది స్పీకర్. లోక్‌సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్ పదవిని బ్రిటన్నుంచి స్వీకరించాం. సమావేశాల నిర్వహణలో స్పీకర్ నిర్వహించే పాత్ర చాలా ప్రాముఖ్యం కలిగి ఉంది. సభ నియమ నిబంధనలను అనుసరించి సమావేశాలు నిర్వహణ చేసే సందర్భంలో ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు క్రమశిక్షణను కాపాడటం కోసం అవసరమైతే సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం కూడా సభాపతి కలిగి ఉంటారు.
ప్రొటెం స్పీకర్
లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికయిన లోక్‌సభ జరిపే మొదటి సమావేశానికి తాత్కాలికంగా అధ్యక్షత వహించడానికి రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. సాధారణంగా లోక్‌సభలో సీనియర్ సభ్యుడిని రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ఈ సంప్రదాయాన్ని మన దేశం ఫ్రాన్స్ నుంచి గ్రహించింది. ప్రొటెం స్పీకర్రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ ప్రధానంగా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
లోక్‌సభకు నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించడంతోపాటు నూతన స్పీకర్‌ను ఎన్నుకునే ప్రక్రియకు అధికారిగా పనిచేస్తారు. నూతన స్పీకర్‌ను ఎన్నుకునేంతవరకు ప్రొటెం స్పీకర్లోక్సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా పనిచేసే వ్యక్తి స్పీకర్ పదవికి పోటీ చేయాలంటే తన ప్రొటెం స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి. లోక్‌సభకు అత్యధికంగా నాలుగు సార్లు చొప్పున ప్రొటెం స్పీకర్‌గా బి.డి.దాస్, ఇంద్రజీత్‌గుప్తా పని చేశారు.
మొదటి లోక్‌సభ ప్రొటెం స్పీకర్ – మౌలాంకర్
16వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్ – కమల్‌నాథ్
17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్ – వీరేంద్ర కుమార్
18వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్ – భర్తృహరి మెహతాబ్
డిప్యూటీ స్పీకర్
లోక్‌సభ స్పీకర్సమావేశాలకు హాజరుకానప్పుడు డిప్యూటీ స్పీకర్అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. లోక్‌సభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. ఈ పదవిని 1967 నుంచి ప్రతిపక్షాలకు కేటాయించడం ఆనవాయితీగా వస్తున్నది. డిప్యూటీ స్పీకర్ తన పదవీకాలం ముగియడానికంటే ముందు రాజీనామా చేస్తే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందించాలి. లోక్‌సభ ఒక సాధారణ తీర్మానం ద్వారా డిప్యూటీ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించవచ్చు.
డిప్యూటీ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించే తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో వారు సమావేశాలకు అధ్యక్షత వహించరాదు. కానీ సమావేశాలకు హాజరుకావచ్చు. చర్చల్లో పాల్గొనవచ్చు. అదే విధంగా సాధారణ సభ్యుడిగా తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 2019లో ఏర్పడిన 17వ లోక్‌సభ నుంచి ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నులోలేదు. మొదటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్.16వ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్తంబిదొరై (అన్నా డీఎంకే – తమిళనాడు). ఈయన లోక్‌సభకు రెండుసార్లు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు.
ప్యానెల్ స్పీకర్
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల సమావేశాలకు హాజరుకానప్పుడు అధ్యక్షత వహించడం కోసం లోక్‌సభ స్పీకర్ నియమించే తాత్కాలిక స్పీకర్లను ప్యానెల్ స్పీకర్లు అంటారు. వీరి జాబితాలను స్పీకర్ప్రకటిస్తారు. 6 నుంచి 10 మంది వరకు ప్యానల్ స్పీకర్లను నియమిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్యానెల్స్పీకర్లు సమావేశాలకు అధ్యక్షత వహించలేని సందర్భంలో రాష్ట్రపతి నియమించిన వ్యక్తి అధ్యక్షత వహిస్తారు. వారు కూడా హాజరు కాని సందర్భంలో సభ్యులు ఎన్నుకున్న వ్యక్తి అధ్యక్షత వహిస్తారు. ప్యానెల్ స్పీకర్ల గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. పార్లమెంటరీ నియమనిబంధనల చట్టం – 1950లో ప్యానెల్ స్పీకర్ల గురించి పేర్కొన్నారు.
స్పీకర్
లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, నిర్వహించే స్పీకర్ పదవి పార్లమెంటరీ వ్యవహారాల నిర్వహణలో అత్యంత కీలకమైంది. స్పీకర్మనదేశ అత్యున్నతమైన గౌరవప్రదమైన అధికార హోదారీత్యా ఆరో స్థానంలో ఉంటారు. లోక్‌సభ సభ్యుల హక్కుల సంరక్షకుడిగా వ్యవహరించే స్పీకర్భారత రాష్ట్రపతికి, లోక్‌సభకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. స్పీకర్‌ను లోక్‌సభ సభ్యులు తమలో ఒకరిని ఎన్నుకోవడాన్ని రాజ్యాంగంలో 93వ అధికరణ పేర్కొంటుంది.
సాధారణంగా లోక్‌సభ స్పీకర్ పదవీకాలం ఐదు సంవత్సరాలు. లోక్‌సభ రద్దయినా స్పీకర్ పదవి రద్దు కాదు. కొత్తగా ఎన్నికైన లోక్‌సభ మొదటి సమావేశం నిర్వహించే వరకు పదవిలో కొనసాగుతారు. లోక్‌సభ మొదటి సమావేశం జరపగానే స్పీకర్ పదవి రద్దు అవుతుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు లోక్‌సభ సాధారణ సభ్యులుగా ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా ప్రత్యేక ప్రమాణ స్వీకారం ఉండదు.
మొదటి లోక్‌సభ జి.వి.మౌలాంకర్ 1952-,56
ఎం. అనంతశయనం 1956,-57
రెండో లోక్‌సభ ఎం.అనంతశయనం 1957,-62
మూడో లోక్‌సభ సర్దార్ హుకుం సింగ్ 1962-,67
నాలుగో లోక్‌సభ నీలం సంజీవరెడ్డి 1967,-69
జి.ఎస్.థిల్లాన్ 1959,-71
ఐదో లోక్‌సభ జి.ఎస్.థిల్లాన్ 1971,-75
బలిరాం జగత్ 1976,-77
ఆరో లోక్ సభ నీలం సంజీవరెడ్డి 1977, మార్చి- 1977, జులై
కె.ఎస్.హెగ్డే 1977,-80
ఏడో లోక్ సభ బలరాం జక్కర్ 1980-85
ఎనిమిదో లోక్‌సభ బలరాం జక్కర్ 1985-89
తొమ్మిదో లోక్‌సభ రబీ రే 1989-91
పదో లోక్‌సభ శివరాజ్ పాటిల్ 1991-96
11వ లోక్‌సభ పి.ఎ.సంగ్మా 1996-98
12వ లోక్‌సభ జి.ఎం.సి.బాలయోగి 1998-99
13వ లోక్‌సభ జి.ఎం.సి.బాలయోగి 1999-2002
మనోహర్ జోషి 2002-2004
14వ లోక్‌సభ సోమనాథ్ ఛటర్జీ 2004-2009
15వ లోక్‌సభ మీరా కుమార్ 2009-2014
16వ లోక్‌సభ సుమిత్రా మహాజన్ 2014-19
17వ లోక్‌సభ ఓంబిర్లా 2019-2024
18వ లోక్‌సభ ఓంబిర్లా 2024 నుంచి