ఇల్లు, బస్టాప్, కాలేజ్, ఆఫీస్, ఈ నాలుగింటిలో ఆడవాళ్లు ఎక్కడ సేఫ్ గా ఫీలవుతారు..? ఆన్సర్ చెప్పడం కష్టమే.. ఎందుకంటే... ఆడపిల్లలపై జరుగుతున్న నేరాల్లో దోషులుగా శిక్ష అనుభవిస్తున్నవారు ఎక్కువగా దగ్గరివారే. ఇక బస్టాప్ యాసిడ్ దాడులకు అడ్డాగా మారిపోయింది. కాలేజీలో ర్యాగింగ్, ఆఫీసులో వేధింపులు.. ఇలా ప్రతిచోటా ఏదోరకంగా ఆడవాళ్లు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి వారికి సేఫ్ ప్లేస్ ఏది లేదా? ఎందుకు లేదూ..? ఇదిగో మా హోటల్ కేవలం ఆడవాళ్ల కోసమే అంటున్నారు సామ్ డోనా హోటల్ నిర్వాహకులు.
సామ్ డోనా అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన నేమ్ ప్లేట్ మీదనే విమెన్ ఓన్లీ హోటల్ అని క్యాప్షన్ కూడా కనిపిస్తుంది. అదేంటి హోటల్ లో ఆడ, మగ అనే తేడా చూపిస్తారా? అందరికీ ఎంట్రీ ఉంటుంది కదా? అని అడగొద్దు... అన్ని హోటళ్లలాగే ఉంటే.. మనం ఈ హోటల్ గురించి చెప్పుకునేవాళ్లమే కాదు. అయినా విషయాన్ని స్పష్టంగా హోటల్ బోర్డు పైనే పెట్టారు కదా.. అడవాళ్లకు మాత్రమేనని. స్పెయిన్ లోని బాలెయారిక్ దీవిలో సోమ్ డోనా పేరుతో ఓ స్పెషల్ హోటల్ కనిపిస్తుంది. సోమ్ డోనా అంటే... "మేము మహిళలం" అని స్పెయిన్ భాషలో అర్థం. 14 సంవత్స రాలు దాటిన యువతులంతా ఈ హోటల్లో ఉండవచ్చు. ఈ హోటల్లోని ప్రతి అంగుళం స్పెషల్గా ఆడవాళ్ల కోసమే డిజైన్ చేసినట్లు ఉంటుంది.
ఇక్కడ పని చేసేవారిలో 90 శాతం మంది ఆడవాళ్లేనట. మిగతా 10 శాతం మంది కూడా మగవాళ్లేందుకు...? అని అడిగితే... అక్కడి ప్రభుత్వ నిబంధనలు అడ్డువచ్చాయట. ఉపాధిలో వివక్ష ఉండరాదనే కండిషన్ మీద కొంతమంది మగవాళ్లకు ఈ హోటల్లో ఉద్యోగం ఇచ్చారు ఆదీ.. ఆడవాళ్లకు దూరంగా ఉండే చోటే వారిని నియమించారు. మగ ఉద్యోగుల వల్ల మహిళలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మగ ఉద్యోగులకు కఠిన నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు.
Also Read :- గ్రీన్ టీలో.. కలబంద కలిపి తాగితే...
అంతాబాగానే ఉంది. ఇంతకీ ఈ కాన్సెప్ట్ ఎందుకు? అంటే... కొన్నాళ్లు మగవాళ్లకు దూరంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకునే మహిళల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోందట... ఇటువంటి వారికి సూటబుల్ డెస్టినేషన్ ఈ హోటలే అంటున్నారు కస్టమర్స్. ఈ హోటల్లో మగవాళ్లు ఉండేందుకు అవకాశం లేదు. అంతేకాదు.. పరిసరాల్లోకి కూడా వాళ్లు అడుగు పెట్టకూడదు. కుటుంబసభ్యులైనా, స్నేహితులైనా సరే... లోపలికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఈ హోటల్లో మహిళల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని యాజమాన్యం చెబుతోంది. ఈ హోటల్లో బార్, స్విమ్మింగ్ పూల్, బ్యాక్ సైడ్లో బీచ్, స్పా వంటి ఎన్నో సదుపాయాలున్నాయట. బార్లో ఇద్దరు ఆడవాళ్లు పక్కపక్కనే కూర్చొని మందు తాగడం కనిపిస్తుందని చెబుతారు అక్క డికి వెళ్లిన విజిటర్స్.
అంతే కాదు.. బీచ్ లో, స్విమ్మింగ్ పూల్ లో, స్పాలో ఎక్కడ చూసినా ఆడ జంటలే కనిపిస్తాయట. 'ఇది మా సామ్రాజ్యం అనే ఓ గర్వం ఈ హోటల్లో ఆడవాళ్ల ముఖాల్లో సృష్టంగా కనిపిస్తుందంటున్నారు నిర్వాహకులు. సోమ్ గ్రూప్ అఫ్ హోటల్స్ కు చెందిన ఈ ఆడవాళ్ల హోటల్లో మిగతావాటి కంటే తక్కువే వసూలు చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి, మరింత మంది మహిళలను తమ హోటకు వచ్చేలా చేయటానికి తక్కువే వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేకించి మగవాళ్ల కోసమంటూ ఏదీ లేకపోయినా ఆడవాళ్లు కనిపించని హోటల్స్. బార్లు రెస్టారెంట్లకు కొదవే లేదు. ఏ పట్టణానికి వెళ్లినా వందల సంఖ్యలో కనిపిస్తాయి. అలాంటప్పుడు పట్టణానికో హోటల్ స్పెషల్ గా ఆడవాళ్ల కోసమే ఉంటే బెటరే కదా..