
-
అధ్వాన్నంగా మారిన బెజ్జంకి డీ7 కెనాల్
-
11 గ్రామాల్లోని చెరువులు, 15 వేల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం
-
పూడిక తీయాలని రైతుల డిమాండ్
-
పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
సిద్దిపేట/కొహెడ, వెలుగు:కొత్త ప్రాజెక్టు, కొత్త కెనాల్.. ఇంకేముంది రైతులు నీళ్లకు కొదవే లేదనుకున్నారు. కానీ, అధికారుల నిర్లక్ష్యం వారికి శాపంగా మారుతోంది. కెనాల్ నిండా తుంగ(దర్భగడ్డి) పెరిగి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నా పట్టించుకోవడం లేదు. రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న తొలగించే పనులు చేపట్టడం లేదు. అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి బెజ్జంకి మండలానికి నీటిని సరఫరా చేసే డీ7 కెనాల్ పరిస్థితి ఇది. మూడు అడుగుల ఎత్తులో గడ్డి, జమ్ము పెరగడంతో నీళ్లు చివరి ఆయకట్టు వరకు వెళ్లడం లేదుని రైతులు వాపోతున్నారు.
15 వేల ఎకరాలకు నీరు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 10 కింద ఎండీఎల్7 (మీడియం డిస్టీబ్యూటరీ కెనాల్)ను 15.2 కిలో మీటర్ల మేర ఎనిమిది అడుగుల లోతుతో మూడేళ్ల కింద నిర్మించారు. ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కెనాల్ బెజ్జంకి మండలం వరకు సాగుతుంది. దీని ద్వారా కిష్టపూర్, గుండా రం, బెజ్జం కి,గూడెం, వడ్లూర్, బేగంపేట, లక్ష్మిపూర్, చీమలకుంట పల్లి, తోటపల్లి గ్రామాల్లోని 15 వేల ఎకరాలకు నీటిని అందించడంతో పాటు 11 గ్రామాల పరిధిలోని చెరువులను నింపుతున్నారు.
కెనాల్‌లో మిగిలింది రెండు ఫీట్లే
డీ 7 కెనాల్లో అత్యధిక భాగంగా దర్భగడ్డితో నిండిపోయింది. ఎనిమిది అడుగుల తోతులో ఉండే ఈ కెనాల్‌లో దాదాపు మూడడుగుల ఎత్తులో గడ్డి మొలవగా.. మరో మూడు అడుగులు మట్టితో నిండిపోయింది. దీంతో ప్రస్తుతం నీరు ప్రవహించే చాన్సే లేదు. వీటిని ఎప్పటికప్పుడు తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. పైగా యాసంగిలో సాగునీరు ఇచ్చామని, చెరువులు నింపామని గొప్పులు చెప్పుకుంటున్నారు. వానా కాలం సీజన్ ప్రారంభం అవుతున్నా పట్టించుకోకపోవడతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గడ్డి తొలగిస్తేనే చివరి భూములకు నీళ్లు
డీ 7 కెనాల్ లోని గడ్డిని తొలగిస్తేనే చివరి ఆయకట్టు భూములకు నీరు అందుతుంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున గడ్డి మొలచినా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే తొలగించకుంటే కెనాల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. - శ్రీనివాస్ రెడ్డి, రైతు లక్ష్మిపూర్
చర్యలు తీసుకుంటం
డీ 7 కెనాల్లో మొలచిన గడ్డి తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నం. కెనాల్ మెయింటెనెన్స్ వర్క్స్ కోసం ఉన్నతాధికారులతో మాట్లాడటమే కాకుండా
కిష్టాపూర్ నుంచి గడ్డి తొలగింపు పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ ను ఆదేశించినం. గత యాసంగి సీజన్‌లో కెనాల్ ద్వారా సాగునీరు ఇవ్వడంతో పాటు చెరువుల కూడా నింపినం.
- నాగేశ్వర రావు, ఇరిగేషన్ ఏఈ