- పాత కాంట్రాక్ట్ సంస్థను తప్పించి
- మేఘాకు ఇచ్చిన గత సర్కారు
- షాఫ్ట్‌ల దగ్గర సీపేజీలతో పనుల్లో ఆలస్యం
- ఆయకట్టు రైతులకు ఏళ్ల తరబడి ఎదురుచూపులే!
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: దేవాదుల లిఫ్టు స్కీంలో కీలకమైన టన్నెల్ పనుల్లో ఆలస్యం వల్ల 38టీఎంసీల గోదావరి నీటిని వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు 49 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణంలో ‘తెలంగాణ’ వచ్చే నాటికి 42 కిలోమీటర్లు పూర్తయింది. మిగిలిన 7కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం పనులను నాటి బీఆర్ఎస్ సర్కారు మేఘా కంపెనీకి అప్పగించగా, నత్తనకడక సాగుతున్నాయి. మరో కిలోమీటర్ పనులు మిగిలి ఉండడంతో 38 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తొమ్మిది జిల్లాల్లోని 4 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులకు ఎదురుచూపులే మిగిలాయి.
2008లో మొదలైన పనులు
జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం థర్డ్ ఫేజ్ కింద రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు రూ.1,410 కోట్లతో టన్నెల్ నిర్మాణం చేపట్టారు. 2008లో ఉమ్మడి ఏపీలోనే పనులు మొదలయ్యాయి. నల్గొండ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తర్వాత ఇరిగేషన్ శాఖ చేపట్టిన రెండో అతి పెద్ద టన్నెల్ ఇది. మొదట 54.88 కిలోమీటర్ల దూరం సొరంగం తవ్వాలని నిర్ణయించారు.
ఈ మేరకు హెచ్‌సీసీ, స్యూ, మేయిల్ కంపెనీలు జాయింట్ వెంచర్‌లో పనులు దక్కించుకున్నాయి. సబ్ లీజ్‌పై కోస్టల్ కంపెనీకి నిర్మాణ బాధ్యతను అప్పగించారు. డిసెంబర్ 8, 2008లో అగ్రిమెంట్ చేసుకోగా డిసెంబర్ 7, 2011 నాటికి పనులు పూర్తి చేయాలి. కానీ, శాయంపేట మండలం చలివాగు ప్రాజెక్ట్ వద్ద బుంగపడి టన్నెల్‌లోకి నీళ్లు చొచ్చుకొచ్చి, అప్పట్లో ముగ్గురు కార్మికులు చనిపోయారు. దీంతో రెండేండ్ల పాటు పనులు నిలిచిపోయాయి. తర్వాత కోస్టల్, హెసీసీ కంపెనీలు దివాలా తీయడంతో మరోసారి పనులు ఆపేశారు. అప్పటికే 42 కిలోమీటర్ల దూరం సొరంగం తవ్వి 15.52 కిలోమీటర్ల మేర లైనింగ్ పూర్తిచేశారు. 53 శాతం పనులకు అప్పటి ప్రభుత్వం రూ.799.97 కోట్ల బిల్లులు చెల్లించింది.
తెలంగాణలో 'మేఘా' సంస్థకు..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన కేసీఆర్ సర్కారు గతంలో 38 టీఎంసీలుగా ఉన్న దేవాదుల స్కీం కెపాసిటీని 60 టీఎంసీలకు పెంచింది. టన్నెల్ నిర్మాణ పనుల బాధ్యతలను 'మేఘా' సంస్థకు అప్పగించింది. టన్నెల్ లెంథ్ను 5.82 కిలోమీటర్లు తగ్గించి 49.06 కిలోమీటర్లకు కుదించారు. కొత్తగా సుమారు 4 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్, 7 కిలోమీటర్ల దూరం 3 మీటర్ల వ్యాసార్థం కలిగిన మూడు పైప్‌లైన్ల నిర్మాణం, పంప్‌హౌజ్, సర్జిఫూల్ నిర్మాణాలు చేపట్టాలని కేసీఆర్సర్కారు నిర్ణయించింది. ఎస్టిమేషన్‌ను రూ.84 కోట్లకు పెంచి రూ.1,494 కోట్లు చేశారు. మేఘా కంపెనీ కేవలం మిగిలిన 7 కిలోమీటర్ల టన్నెల్ తవ్వి లైనింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది.
సీపేజీలతో లేట్అవుతోందట!
రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు 49 కిలోమీటర్ల దూరం భూ అంతర్భాగంలో 6 మీటర్ల వ్యాసార్థంతో టన్నెల్ తవ్వాలి. 5.6 మీటర్ల వెడెల్పుతో 'డి' షేపులో సిమెంట్ లైనింగ్ పూర్తి చేయాలి. ధర్మసాగర్ సమీపంలోని దేవన్నపేట దగ్గర రెండు షాఫ్ట్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో ఒకటి వాటర్ స్టోరేజీ కోసం అయితే రెండోది 3 మోటార్లు ఏర్పాటు చేయడానికి. కానీ, టన్నెల్ నిర్మాణ పనులు చేపడుతున్న షాఫ్ట్‌ల దగ్గర సరైన గ్రౌటింగ్ చేయకపోవడం వల్ల విపరీతమైన సీపేజీ(నీటి ఊటలు) వచ్చి పనులకు అంతరాయం కలుగుతోందని ఇరిగేషన్ ఆఫీసర్లు అంటున్నారు. దీనివల్ల ఇంకా కిలోమీటర్‌కు పైగా టన్నెల్ తవ్వే పనులు తరుచూ ఆగిపోతున్నాయని, అక్కడ మోటార్లను కూడా అమర్చలేకపోతున్నట్లు చెబుతున్నారు.
సాగు, తాగునీటిపై పడుతున్న ఎఫెక్ట్
దేవాదుల ఎత్తిపోతల పథకంలో అతికీలమైనది థర్డ్ ఫేజ్. ఇందులో థర్ఢ్ ప్యాకేజీ కింద చేపట్టిన రామప్ప టు ధర్మసాగర్ టన్నెల్ పనులు ముఖ్యమైంది. ఇది కంప్లీట్ చేస్తేనే ఏడాది పొడవునా 60 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో చేపట్టిన పైప్ లైన్ నిర్మాణ పనులు కంప్లీట్ కాగా, కేటాయించిన ప్రాంతాలకు నీళ్లను అందిస్తున్నారు. థర్డ్ ఫేజ్‌లో సైతం ప్యాకేజీ 1, ప్యాకేజీ 2 కింద చేపట్టిన పైప్‌లైన్ పనులు ఎప్పుడో కంప్లీట్ అయ్యాయి. దీంతో రామప్ప వరకు గోదావరి నీళ్లు వచ్చి ఆగిపోతున్నాయి.
ఇక మిగిలింది మూడో దశలో చేపట్టిన టన్నెల్ పనులే. ఇవి ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను కూడా సకాలంలో పూర్తిచేసి ఉంటే ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లోని సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అలాగే, దేవాదుల స్కీం ఆధారంగా భీంఘన్‌పూర్, చలివాగు, రామప్ప, ధర్మసాగర్ చెరువుల నుంచి మిషన్ భగీరథ స్కీం ద్వారా వేలాది గ్రామాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తాగునీరందించివచ్చని అంటున్నారు.
వచ్చే ఖరీఫ్ నాటికి పనులు పూర్తిచేస్తాం..!
టన్నెల్ నిర్మాణ పనులకు షాఫ్ట్‌ల దగ్గర సీపేజీ( నీటి ఊటలు) అడ్డుపడుతున్నాయి. దీనివల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి. త్వరగా పనులు కంప్లీట్ చేయాలని మేఘా కాంట్రాక్ట్ సంస్థ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. వచ్చే ఖరీఫ్ నాటికి టన్నెల్ పనులు కంప్లీట్ చేసి గోదావరి నీళ్లను ధర్మసాగర్ చెరువు వరకు తీసుకొస్తాం.
- శ్రీనివాస్ రెడ్డి చీఫ్ ఇంజినీర్, ఇరిగేషన్ శాఖ, వరంగల్