స్టార్ గురు..దేవదాస్ కనకాల

స్టార్ గురు..దేవదాస్ కనకాల

కొందరి గురించి చెప్పడానికి మాటలు తడుముకోవాలి. మరికొందరి గురించి ఎన్ని మాటలు చెప్పినా తరగక అలసిపోవాలి. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి ప్రతిభావంతులు చాలామందే ఉన్నారు. వారిలో దేవదాస్ కనకాల ఒకరు. నటుడు… దర్శకుడు.. యాక్టింగ్​ ట్రైనర్​… ఇలా ఆయన గురించి చెప్పడానికి చాలా పదాలే ఉన్నాయి. ఇప్పుడాయన సినీ పరిశ్రమలో తన గురుతులు వదిలి వెళ్లిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్ (74)…  కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.

1945, జులై 30న యానాంలో జన్మించిన దేవదాస్ స్వగ్రామం… యానాం శివారులోని కనకాల పేట. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ. తండ్రి కనకాల తాతయ్య నాయుడు ఫ్రెంచ్ పాలనలో ఉన్న యానాంలో ఎమ్మెల్యే అయ్యారు. దేవదాస్ మొదట్నుంచీ మంచి విద్యార్థి. కోలంక గ్రామంలో ప్రైమరీ ఎడ్యుకేషన్​, పిఠాపురం మహారాజా కాలేజీలో పీయూసీ చేశారు. అనంతరం విశాఖపట్నంలోని ఏవీఎన్‌‌ కాలేజీలో డిగ్రీ చేస్తూ… ఆంధ్ర యూనివర్శిటీలో థియేటర్‌‌‌‌ఆర్ట్స్‌‌లో డిప్లొమా చేశారు. ఆ కాలంలోనే పుణె ఫిల్మ్ ఇన్‌‌స్టిట్యూట్​కి వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నారు. సాంగ్ అండ్ డ్రామా డివిజన్​లో నటుడిగా కెరీర్‌‌‌‌ ప్రారంభించారు. అక్కడ రాళ్లపల్లి, దర్శకుడు సత్యనారాయణరాజు, బుర్రకథ కళాకారుడు బెనర్జీ తదితరులతో కలిసి పని చేశారు. చెన్నైలోని అడయార్ ఫిల్మ్​ ఇనిస్టిట్యూట్​లో, హైదరాబాద్​లోని మధు ఫిల్మ్‌‌ఇన్‌‌స్టిట్యూట్​లో ప్రిన్సిపాల్​గా చేశారు. తెలుగు యూనివర్శిటీ రంగస్థల కళల శాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా విధులు నిర్వర్తించారు.

విలక్షణ నటుడు… వైవిధ్యమైన దర్శకుడు..

నటుడిగా దేవదాస్‌‌ది ఓ ప్రత్యేక శైలి. రంగస్థలమైనా, బుల్లితెర అయినా, వెండితెర అయినా… ఆ పాత్రకి తనదైన ప్రత్యేకతను తీసుకొచ్చేవారు దేవదాస్. అందుకే కళాతపస్వి విశ్వనాథ్ లాంటి లెజెండ్స్ తమకు నచ్చిన నటులను ప్రస్తావించేటప్పుడు వారిలో దేవదాస్ పేరు తప్పకుండా ఉంటుంది. సాక్షి రంగారావు దేవదాస్‌‌కి క్లాస్‌‌మేట్. ఆయనే దేవదాస్‌‌ని బాపు, ముళ్లపూడి వెంకట రమణలకు పరిచయం చేశారు. బాపు–రమణ తీసిన ‘బుద్ధిమంతుడు’లో ఏఎన్నార్​ స్నేహితుడిగా నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత   కె.విశ్వనాథ్‌‌ దర్శకత్వంలో మిత్రుడు వాసిరాజు ప్రకాశం తీసిన ‘కాలం మారింది’లో దళితుడి పాత్ర వేశారు. తనకు చాలా ఇష్టమైన పాత్రగా చెప్పుకునేవారు దేవదాసు.  విశ్వనాథ్​ దర్శకత్వంలోనే ‘ఓ సీత కథ’లో తాగుబోతు పాత్ర చేసే చాన్స్ వచ్చింది. వరుసగా మాంగల్యానికి మరో ముడి, ప్రేమ బంధం, గోరింటాకు, సిరిసిరి మువ్వ వంటి నాటి చిత్రాలతో మొదలుపెట్టి… ఒక్క మగాడు, నీ స్నేహం, మల్లీశ్వరి వంటి నేటి చిత్రాల వరకూ ఆయన ప్రయాణం ఆగకుండా సాగింది. ‘భరత్‌‌ అనే నేను’ ఆయన నటించిన చివరి చిత్రం. దేవదాస్​కు సావిత్రి అంటే వల్లమాలిన ఇష్టం. ఆమెతో కలిసి నటించలేకపోయానని ఫీలయ్యేవారు కూడా.

కంచు కంఠంతో ఆయన డైలాగ్‌‌చెప్పే తీరు దేవదాస్‌‌ని ఓ విలక్షణ  నటుడిగా నిలబెట్టాయి. మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కూడా తన ప్రతిభ చూపించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘చలిచీమలు’లో నూతన్ ప్రసాద్ చెప్పిన ‘నూటొక్క జిల్లాలకు అందగాణ్ని’ అనే డైలాగ్‌‌ చాలా పాపులర్. నాగమల్లి, నిజం, ఓ ఇంటి భాగోతం తదితర చిత్రాలు కూడా తీశారు.

కళకే అంకితం

ఐదు వేళ్లూ ఒకలా ఉండనట్టు ఫ్యామిలీలోని వారంతా ఒకేలా ఉండరంటారు. కానీ కనకాల కుటుంబంలో అందరూ ఒకేలా ఉంటారు. కుటుంబమంతా కళకే అంకితమైపోయారు. దేవదాస్ భార్య లక్ష్మీదేవి,  కూతురు శ్రీలక్ష్మి మంచి నటీమణులు. ఇక కొడుకు రాజీవ్ కనకాల ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోడలు సుమ టాప్​ యాంకర్. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కానీ అందరిదీ ఒకే దారి.

– సమీర నేలపూడి

మార్గదర్శకుడు

నటించడం చాలామంది చేయగలరు. కానీ నటనను నేర్పించడం అందరి వల్లా కాదు. ఒక వ్యక్తిలోని ప్రతిభను గుర్తించి, దానికి మెరుగులు దిద్ది, తిరుగులేని నటీనటులుగా తీర్చిదిద్దడం తేలికైన పని కాదు. దేవదాస్ ఈ విషయంలో దిట్ట.  చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్‌‌లాంటి స్టార్స్‌‌నుంచి నాజర్, రఘువరన్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్‌‌వరకు చాలామంది ఆయన దగ్గర నటనలో మెళకువలు నేర్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్​, భానుచందర్ వంటి వారంతా ఆయన నేర్పిన విద్యతోనే భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. అల్లరి నరేష్, సునీల్, మంచు మనోజ్ లాంటి యువ హీరోలు కూడా ఆయన దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నవారే. నటిస్తే తానొక్కడినే నటుడిగా ఎదుగుతానని, నటుల్ని తయారుచేస్తే తనను ప్రోత్సహించిన సినీ పరిశ్రమ రుణం తీర్చుకున్నవాడినవుతానని దేవదాస్ అనేవారు. తీర్చుకున్నారు కూడా.