పౌరాణిక పాత్రలే ఎక్కువ

పౌరాణిక పాత్రలే ఎక్కువ

రామాయణంలో రాముడు, సీత తర్వాత గుర్తొచ్చేది హనుమంతుడు. ఈ మధ్య విడుదలైన ‘ఆదిపురుష్​’ సినిమాలో కూడా హనుమంతుడి క్యారెక్టర్​ చేసిన వ్యక్తి హైలైట్​ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు హనుమంతుడి క్యారెక్టర్​లో నటించిన యాక్టర్​ గురించి తెలుసుకోవాల​నుకున్న వాళ్లే ఎక్కువ. అతని పేరు... దేవదత్త గజానన్​ నగే. మరాఠీ టీవీ ఇండస్ట్రీలో పాపులర్​ యాక్టర్. బాలీవుడ్​లో ‘తన్హాజీ’ సినిమాలో ‘సూర్యాజీ’ అనే పవర్​ఫుల్​​ రోల్​లో కనిపించిన వీర యోధుడు. ఇతని గురించి మరిన్ని విశేషాలు తన మాటల్లోనే...    

నా పూర్తి పేరు దేవదత్త గజానన్ నగే. నేను పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని రాయ్​గఢ్​ జిల్లాలో అలీబాగ్​లో. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నా. బి.ఎస్సీ కెమిస్ట్రీ, బ్యాచిలర్​ ఆఫ్​ లా చదివా. హై స్కూల్​ వరకు మా జిల్లాలోనే చదువుకున్నా. పదేండ్లు పారామెడికల్​ ఫీల్డ్​లో పనిచేశా. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం ముంబయి వెళ్లా. అక్కడ మోడలింగ్​, ఫ్యాషన్​ షోల్లో పార్టిసిపేట్ చేశా. కొన్నాళ్లు స్కెచ్​ ఆర్టిస్ట్​గా కూడా చేశా. నటన మీద ఇంట్రెస్ట్​తో మరాఠీ థియేటర్​లో యాక్టింగ్​ కోర్స్​లో చేరా. ​ఆ తర్వాత 2011లో సీరియల్స్​​లో నటించే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి నా యాక్టింగ్ కెరీర్​ మొదలైంది. ‘వీర్​ శివాజీ’ అనే టీవీ సీరియల్​తో యాక్టింగ్​​లోకి అడుగుపెట్టా. ఆ సీరియల్​లో ‘తానాజీ మలుసరే’ అనే పాత్రలో నటించా. అలాగే ‘జై మల్హర్’ సీరియల్​లో ఖండోబా పాత్రలో నటించడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యా. ఫిట్​నెస్​ మీద ఇంట్రెస్ట్​ కాస్త ఎక్కువ నాకు. అందుకే రెగ్యులర్​గా జిమ్​కి వెళ్లి వర్కవుట్స్ చేస్తుంటా. ఇందులోకి రాకముందు ట్రెక్కింగ్​, రివర్ రాఫ్టింగ్​ నేర్పించేవాడిని. 

కెరీర్

సినిమాల విషయానికి వస్తే 2014లో ‘సంఘర్ష్’ సినిమాతో మరాఠీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. తర్వాత ‘వన్స్​ అపాన్​ ఏ టైమ్​ ఇన్​ ముంబై దోబారా’, ‘సత్యమేవ జయతే’, ‘తాన్హాజీ: ది అన్​ సంగ్ వారియర్’లో చేశా. ఈ మధ్య విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమాలో హనుమాన్​ పాత్రలో నటించా. ‘తన్హాజీ’  సినిమాలో మరాఠా యోధుడి పాత్ర నాది. శివాజీ సైన్యంలో కీలకంగా ఉండే సూర్యాజీ రోల్​ అది. అందులో సింహగఢ్​ యుద్ధంలో కళ్యాణద్వారం దగ్గర అక్కడి ప్రజలతో పోరాడి వాళ్లను అడ్డుకుంటాడు. అలాంటి పవర్​ఫుల్​ రోల్​లో చేయడం నాకు దక్కిన మంచి అవకాశం. ఎందుకంటే అందులో నా నటన చూసి, ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా ఎంతో మెచ్చుకున్నారు. ఆ తరువాత ఓం రౌత్​ నాకు మరో అవకాశం ఇచ్చాడు. ‘ఆది పురుష్​’తో ఓంతో రెండో సారి కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నా బాడీ బిల్డింగ్​ చూసే ఈ అవకాశం ఇచ్చారనుకుంటా. ఈ షూటింగ్​ చేసేటప్పుడు భక్తిగా చేశా. ఇందులో ఉన్న భారీ యాక్షన్ సీక్వెన్స్ చూసిన వాళ్లు థ్రిల్​ ఫీలవడం ఖాయం. ఇది నా జీవితాంతం బాగా గుర్తుండిపోతుంది.

ఈ లైఫ్​ ఇచ్చింది టీవీనే

టెలివిజన్​ నా లైఫ్​లో చాలా ఇచ్చింది. సూపర్​ హిట్ సీరియల్స్​లో నటించా. ప్రజలు ఇప్పటికీ నన్ను ఖండోబా క్యారెక్టర్​తో గుర్తుపడతారు. టీవీకి నేను చాలా దగ్గరయ్యా. ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నంత మాత్రాన టీవీని మర్చిపోలేదు. ముందుముందు ఎంత పెద్ద ప్రాజెక్ట్స్​లో పని చేసినా టీవీని మాత్రం మర్చిపోను. నాకు గుర్తింపు ఇచ్చింది టీవీనే. ​అందుకని, ఎప్పటికీ ఆ రెస్పెక్ట్​ ఉంటుంది. 

‘ఆదిపురుష్’ ఎక్స్​పీరియెన్స్

మంచి విజన్​ ఉన్న ఫిల్మ్​ మేకర్ ఓం. ఆర్టిస్ట్​లని ఎక్కువ స్ట్రెస్​ చేయడు. అంతేకాకుండా వాళ్ల నుంచి చాలా ఈజీగా తనకు కావాల్సిన పర్ఫార్మెన్స్​ని రాబడతాడు. ఆయనతో నాకు ఎమోషనల్​ బాండింగ్​​ ఉంది. ఈ సినిమా ద్వారా ప్రభాస్, సన్నీ సింగ్, కృతి సనన్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. షూటింగ్​ మొదలుపెట్టే ముందు ప్రతి రోజు మేం ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేసేవాళ్ళం. మనోజ్ ముంతాషిర్ మంచి డైలాగ్స్​ రాశాడు. పురాణ కథకు అతని రచన ప్రాణం పోసింది. ‘ఆదిపురుష్’ కంటే ముందే ‘తాన్హాజీ’లో సైఫ్ అలీఖాన్​తో కలిసి నటించా. కాబట్టి నాకు ఆయనతో మరోసారి స్క్రీన్​ షేర్​ చేసుకోవడం చాలా కంఫర్టబుల్​గా అనిపించింది. 

భాషాభేదం లేదు

నేను మరాఠీ ఇండస్ట్రీ నుంచి వచ్చి హిందీ భాషలో నటిస్తున్నా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నటీనటుల్లో హిందీ, మరాఠీ అనే తేడాలేం లేవు. ఏ నటుడిలో ఎంత సత్తా ఉందో అనేది డైరెక్టర్​కి తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ల సినిమాకు సెట్​ అయ్యే వాళ్లను సెలక్ట్ చేసుకుంటారు. మరాఠీ ఇండస్ట్రీ విషయానికొస్తే యాక్టర్స్​ ఎక్కువమంది ఫిట్​నెస్​కి ఇంపార్టెన్స్​ ఇస్తారు. అది మంచి మార్పు అనిపిస్తుంది.

మరాఠీలోకి మళ్లీ...

మరాఠీలో అవకాశాలు వస్తే చేయడానికి రెడీగా ఉన్నా. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్​ ఉన్నాయి. వాటి గురించి డిస్కషన్స్​ అవుతున్నాయి. అలాగే టీవీలో వచ్చే అవకాశాలు ఎక్కువమందికి రీచ్​ అవుతాయనేది నా నమ్మకం. అందుకే మళ్లీ టీవీలో చేసే అవకాశం వస్తే రెండో ఆలోచన లేకుండా ఓకే చెప్తా. మళ్లీ టీవీలో ఎప్పుడు కనిపిస్తానా అని ఎదురుచూస్తున్నా. అంతేకాదు.. ‘ఆది పురుష్​’ సినిమా షూటింగ్​లో ఉన్నప్పుడు కూడా సీరియల్స్​ అవకాశాలు కొన్ని వచ్చాయి. ఇప్పుడు సినిమా రిలీజ్​ కూడా అయిపోయింది. కాబట్టి ఫ్రీగానే ఉన్నా. త్వరలోనే ఒక షో చేయబోతున్నా. మరో హిస్టారికల్ సినిమాలో నటిస్తున్నా. దాని డీటెయిల్స్​ మాత్రం ఇప్పుడే చెప్పను. నా పర్సనల్​ లైఫ్​ గురించి చెప్పాలంటే... నా భార్య పేరు కంచన్. తను టీచర్​. మాకు ఒక కొడుకు ఉన్నాడు. తన పేరు నిహార్ నగే. జీ మరాఠీ ‘ఉత్సవ్​ నాట్యంచ అవార్డ్స్​ 2015’లో ‘జై మల్హర్’ సీరియల్​లో నేను చేసిన రోల్​కి అవార్డ్​ వచ్చింది” అని ముగించాడు దేవదత్త. 

హనుమంతుడితో నాకు ఉన్న బంధం

నేను హనుమంతుడి భక్తుడిని. నాకు ఎక్సర్​సైజ్ చేయడం పదిహేడేండ్ల నుంచే అలవాటైంది. నేను వెళ్లిన ఫస్ట్​ జిమ్ సెంటర్​ పేరు ‘హనుమాన్’. హనుమంతుడిని కొలిచే నేను రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ క్యారెక్టర్​ గురించి చెప్పాలంటే... హనుమంతుడిలా కనిపించేందుకు నా శరీరాకృతిని మార్చుకోవడానికి చాలా కష్టపడ్డా. ఎందుకంటే మొదటి నుంచి నాది జిమ్​ బాడీనే. కాకపోతే హనుమంతుడిలా కనపడాలంటే సరైన శరీరాకృతి ఉండాలని కష్టపడ్డా. 2011లో ఉన్న బాడీకీ, ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది. అప్పటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పులను  ఫొటోలు తీసి సోషల్​ మీడియాలో అప్​లోడ్ కూడా చేశా.

 జై మల్హర్​తో పాపులారిటీ

జై మల్హర్​ సీరియల్ మరాఠీలో లాంగ్​ రన్నింగ్​ షో. ఇది శివుడి అవతారాల్లో ఒకటైన లార్డ్ ఖందోబ అనే పాత్ర మీద ఆధారపడి ఉంటుంది. ఈ సీరియల్​ని జై మార్తాండ్​’ పేరుతో థాయ్​ భాషలోకి డబ్బింగ్ చేశారు. విదేశీ భాష​లో డబ్​ అయిన మొదటి మరాఠీ సీరియల్​ ఇది. 

 ప్రజ్ఞ