- వరదనీటితో మునిగిన వరి పంట
- మోటార్లను నిలిపేసిన అధికారులు
శాయంపేట, వెలుగు: దేవాదుల ఫేజ్-– 2 పైప్ లైన్ వాల్వ్ ఆదివారం తెల్లవారుజామున లీకైంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్ కు వెళ్లే పైప్ లైన్ వాల్వ్ జోగంపల్లి పరిధిలో లీకైంది. సుమారు 150 మీటర్ల ఎత్తున నీరు ఎగిసిపడింది. నీరంతా పక్కనే ఉన్న వరి పొలాల్లోకి చేరింది. పంట చేతికొచ్చే సమయంలో నీరు చేరడంతో స్థానిక రైతులు ఆందోళన చెందారు.
వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో మోటార్లను బంద్ చేశారు. పైప్ లైన్ లోని మిగిలిన నీరు వాల్వ్ద్వారా బయటికి వస్తుండగా పక్కనే భానుకుంట చెరువులోకి మళ్లించారు. వాల్వ్లీకేజీకి మరమ్మతులు చేపట్టి మోటార్లను ఆన్ చేస్తామని ఆఫీసర్లు తెలిపారు.