
1999లో గోదావరి జలాలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్న సంకల్పంతో సీహెచ్ విద్యాసాగర్ రావు నాయకత్వంలో బీజేపీ ఇచ్చంపల్లి (గోదావరి) నుంచి పాదయాత్ర మొదలుపెట్టి 250 కి.మీలు నడిచి ప్రజల అభిప్రా యాలను కూడగట్టింది. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో రెండు సిమెంటు బస్తాలు వేసుకొని వచ్చి, 2001లో కరీంనగర్ జిల్లా గంగారం వద్ద దేవాదుల ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి.. వరంగల్, కరీంనగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లోని సుమారు ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం వల్లే ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చారు. తప్పితే రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధితో మాత్రం కాదు.
దేవాదుల లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును మూడు దశలుగా విభజించారు. గంగారం నుంచి 5.18 టీఎంసీలు లిఫ్టు చేసి, భీమగణపురం చలివాగు ద్వారా 138 కి.మీలు దూరంలో ఉన్న ధర్మసాగర్ చెరువులోకి ఎత్తిపోసి, సుమారు లక్షా 23వేల ఎకరాలను సాగులోకి తీసుకురావాలన్న అంచనాలతో ఫేజ్ 1 నిర్ధారించారు. గంగారం నుంచి భీమగణఫురం ద్వారా, పులుకుర్తి నుంచి ధర్మసాగర్ వరకు పైప్ లైన్ ద్వారా మొత్తం 7.25 టీఎంసీల నీటిని తరలించి, 1లక్షా 38వేల ఎకరాలకు అందించాలని ఫేజ్ 2లో డిజైన్ చేశారు. 29 టీఎంసీలను కొంత పైప్ లైన్, కొంత టన్నెల్ ద్వారా గంగారం నుంచి భీమగణపురం, రామప్ప ద్వారా 113 కి.మీ తరలించి ధర్మసాగర్ చెరువులో ఎత్తిపోసి 2లక్షల 41వేల ఎకరాలకు సాగునీరు అందించేలా మూడో దశకు ప్రణాళిక రూపొందించారు.
ఇప్పటికీ పూర్తికాని దేవాదుల మూడో దశ
దేవాదుల వద్ద లైవ్ స్టోరేజ్ (ప్రత్యక్ష నీటి నిల్వ) లేదని, మొదటి రెండు దశలకే నీరు సరిపోతుందని భావించడమే మూడోదశ పనులు ముందుకు సాగకపోవడానికి కారణం. అయితే, కంతనపల్లి వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో 100 టీఎంసీలు ఎత్తిపోసేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే కంతనపల్లి ప్రాజెక్టుకు అనుమతులు పొందారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2009 ఫిబ్రవరిలో జలయజ్ఞంలో భాగంగా రూ.10వేల కోట్ల అంచనాలతో కంతనపల్లి ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా దేవాదుల వరకు నీళ్లు నిలిచి, నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, 50 టీఎంసీలు దేవాదుల ద్వారా వాడుకోవచ్చని భావించారు. ఇంకా కంతనపల్లి లిఫ్టు ఇరిగేషన్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1లో 3.10 లక్షల ఎకరాలకు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో 4.40 లక్షల ఎకరాలకు కలిపి మొత్తం 7.50 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కంతనపల్లి ప్రాజెక్టు కథ!
కంతనపల్లి ప్రాజెక్టు పూర్తి అనుమతులు పొంది, సుమారు రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ నికర జలాల కేటాయింపు ప్రాజెక్టును పక్కకు పెట్టి, తుపాకుల గూడెం వద్ద 6-7 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఒక బ్యారేజీ నిర్మించారు. కేవలం దేవాదుల లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు లైవ్ స్టోరేజ్ కోసమే ఈ బ్యారేజీ నిర్మించినప్పటికీ, ఇప్పటికీ దేవాదుల మూడోదశ పూర్తి కాలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టును చూపి కంతనపల్లిని నిలిపేశారు. అయితే, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2 ఆయకట్టు స్థిరీకరణలో కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం చెందడంతో మళ్లీ కంతనపల్లి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
కాళేశ్వరానికి నిధుల మళ్లింపు
నక్సల్స్ ప్రాంతాలలోని అభివృద్ధి పథకం కింద ఈ దేవాదుల ప్రాజెక్టుకు కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేసింది. 2020 వరకు ఈ మూడో దశ ప్రాజెక్టు పూర్తి చేయాలని, తద్వారా ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, 2017-–18లో కేంద్ర ప్రభుత్వం రూ.380 కోట్లు తన వాటా కింద ప్రత్యేకంగా నిధులిచ్చింది.
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నిధులను కూడా కాళేశ్వరానికి దారి మళ్లించారు. దేవాదుల ప్రాజెక్టుకు 484 మెగావాట్ల విద్యుత్ అవసరం అని తెలిసినా, దానికి సంబంధించిన పనులు కూడా పూర్తి కాలేదు.
ప్రధానికి ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వానికి ఏది?
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి తెలంగాణకు కావాల్సిన కొన్ని ప్రాజెక్టులను ఆశించారు. అదే సమయంలో నరేంద్ర మోదీ దేవాదుల ప్రాజెక్టు, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2 ప్రాజెక్టుల పెండింగ్ పనుల పూర్తి విషయంలో రాతపూర్వకంగా ప్రశ్నించారు. ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేసి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న శ్రద్ధ, రాష్ట్ర
ప్రభుత్వానికి లేకపోవడం విచారకరం.
రిపేర్లు లేక..
దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2 పూర్తయినప్పటికీ నిర్వహణ సామర్థ్యం కొరవడడంతో ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. ఫేజ్ 1లో చలివాగు వద్ద ఉన్న రెండు మోటార్లలో ఒకటి ఏడాది క్రితం చెడిపోయినా, ఇప్పటి వరకూ దానికి మరమ్మతులు చేసి సరిచేయలేదు. దేవాదుల ఫేజ్ 2లో పైప్ లైన్ లీకేజీలకు అడ్డుకట్ట వేయడం లేదు. ఫలితంగా ధర్మసాగర్లో సరిపోను నీరు పంపింగ్ చేయలేకపోతున్నారు. నీళ్లు ఉండీ ధర్మసాగర్ నుంచి తపాసుపల్లి వరకు ఉన్న అన్ని రిజర్వాయర్ల కింద ఉన్న పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న పంటలను చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొరవడిన నిర్వహణ
ప్రాజెక్టులు కట్టడం దేవుడెరుగు, ఉన్న ప్రాజెక్టులకు సరైన నిర్వహణ లేక, నిధులు విడుదల చేయక, విద్యుత్ బిల్లులు చెల్లించక, సరైన యంత్రాంగం ఏర్పాటు చేయకపోవడంతో, పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అన్ని పెద్ద చెరువులు, ప్రాజెక్టు కాలువలు, లిఫ్టుల కింద ఉన్న ఆయకట్టుకు నీరు అందే విధంగా నిర్వహణ సామర్థ్యం పెంచాలని రైతులు కోరుతున్నారు. వివిధ ప్రాజెక్టులు, చెరువుల కింద కూడా రైతులు విద్యుత్ కనెక్షన్ తీసుకొని, బోర్లు వేసి సొంత పెట్టుబడితో పంటలకు నీళ్లు అందిస్తున్నారు. తద్వారా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది. రైతులకు పెట్టుబడి ఖర్చు పెరిగి, అప్పులపాలు అవుతున్నారు. ప్రభుత్వం ముందుగా మైనర్, మీడియం, మేజర్ , లిఫ్టు ప్రాజెక్టుల నిర్వహణ కోసం తగిన నిధులు కేటాయించి, నిర్వహణ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపర్చాలి. తద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, విద్యుత్ ఆదా అవుతుంది. రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రాజెక్టులు కట్టడంలోనే కాదు, వాటి నిర్వహణలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది.
ఎండిపోయిన పంటలు
100 టీఎంసీల నికర జలాల అనుమతి ఉన్న కంతనపల్లి ప్రాజెక్టును పక్కకు పెట్టారు. దేవాదుల ద్వారా నీళ్లు ఎత్తిపోసి, వరంగల్లోని ఎగువ ప్రాంతాలకు (జనగామ, చేర్యాల, పాలకుర్తి), నల్గొండ, మెదక్ జిల్లాలకు, కొంతభాగం కరీంనగర్ జిల్లా ఆయకట్టుకు సాగునీరు అందించాలని పెట్టుకున్న లక్ష్యం నేటికీ నెరవేరలేదు. వరంగల్ జిల్లా ఎగువ ప్రాంతాలకు వరద కాలువ నీటిని తీసుకురావాలని ముందు ప్రణాళిక రూపొందించారు. ఆ తర్వాత ఆ ఆయకట్టును దేవాదుల కిందికి మార్చారు. దేవాదులను పూర్తి చేయక, కొంత ఆయకట్టును మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు కిందికి మార్చారు. కాళేశ్వరం పూర్తిగా విఫలం చెందడం, వరద కాలువ నీరు రాకపోవడం, దేవాదుల ప్రాజెక్టు పూర్తికాకపోవడం, పూర్తయిన మొదటి, రెండో దశల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల వరంగల్ జిల్లా ఎగువ ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- నరహరి వేణుగోపాల్ రెడ్డి,
బీజేపీ సీనియర్ నేత