దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌కు లీకేజీల బెడద.. క్వాలిటీ లోపమే కారణమా ?

దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌కు లీకేజీల బెడద.. క్వాలిటీ లోపమే కారణమా ?
  • ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌కు 100 మీటర్ల దూరంలో వాటర్‌‌‌‌ లీకేజీ
  • ఉనికిచర్ల శివారులో ఇదే సమస్య.. రిపేర్లు ప్రారంభించిన ఆఫీసర్లు

హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు: దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌కు లీకేజీలు ఏర్పడడం కలవరానికి గురిచేస్తోంది. థర్డ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌లో భాగంగా నిర్మించిన దేవన్నపేట పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ సుమారు దశాబ్దంన్నర తర్వాత ఓపెన్‌‌‌‌కాగా, ఇక్కడి నుంచి ధర్మసాగర్‌‌‌‌ వరకు నీటిని చేరవేసే పైప్‌‌‌‌లైన్లతో పాటు టన్నెల్‌‌‌‌కు లీకేజీలు ఏర్పడుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేవాదుల థర్డ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ పనుల్లో భాగంగా రామప్ప నుంచి దేవన్నపేట పంపింగ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ వరకు 49.06 కిలోమీటర్లు, ఈ తర్వాత ధర్మసాగర్ సమీపంలో 200 మీటర్ల టన్నెల్ నిర్మించారు. నాలుగు రోజుల నుంచి నీటిని విడుదల  చేస్తుండడంతో లీకేజీలు బయటపడుతున్నాయి. 

ధర్మసాగర్ వద్ద టన్నెల్‌‌‌‌కు లీకేజీ
దేవాదుల థర్డ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ పనుల్లో భాగంగా ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌కు సమీపంలో 200 మీటర్ల మేర నిర్మించిన టన్నెల్‌‌‌‌కు ఆదివారం మధ్యాహ్నం  లీకేజీ ఏర్పడింది. వాటర్‌‌‌‌ ఫ్లో ఎక్కువగా ఉండడంతో లీకేజీ అయిన ప్రాంతం నుంచి రిజర్వాయర్‌‌‌‌ వరకు రోడ్డు మొత్తం నీటిలో నిండిపోగా, చుట్టు పక్కల పంట పొలాలన్నీ నీట మునిగాయి. స్థానికులు, ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ సెక్యూరిటీ సిబ్బంది లీకేజీని గమనించి ఇరిగేషన్‌‌‌‌ ఈఈ సీతారాం నాయక్‌‌‌‌కు సమాచారం అందించారు. అంతేగాకుండా దేవన్నపేట పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ సమీపంలో ఓ చోట పైప్‌‌‌‌లైన్‌‌‌‌ నేల నుంచి పైకి లేచింది. దీంతో పాటు ఫస్ట్‌‌‌‌ఫేజ్‌‌‌‌లో భాగంగా దేవన్నపేట పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ నుంచి ఉనికిచర్ల మీదుగా ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ వరకు నిర్మించిన పైపులైన్‌‌‌‌ కూడా లీకైంది. దేవన్నపేట పంప్‌‌‌‌హౌస్‌‌‌‌కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉనికిచర్ల సమీపంలో పైప్‌‌‌‌లైన్‌‌‌‌ కింది భాగంలో లీకేజీ ఏర్పడడంతో స్థానిక రైతులు ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. 

వెంటనే చర్యలు చేపట్టిన ఆఫీసర్లు
ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ సమీపంలో ఔట్‌‌‌‌లెట్‌‌‌‌ వద్ద టన్నెల్‌‌‌‌తో పాటు ఉనికిచర్ల శివారులో పైప్‌‌‌‌లైన్‌‌‌‌కు లీకేజీలు ఏర్పడడంతో విషయం తెలుసుకున్న ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు వెంటనే రిపేర్లు ప్రారంభించారు. ఇందులో భాగంగా పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లో వాటర్‌‌‌‌ సప్లైని నిలిపివేయడంతో పాటు లీకేజీలు ఏర్పడిన చోట్ల డీవాటరింగ్‌‌‌‌కు చర్యలు చేపట్టారు. అనంతరం లీకేజీలకు రిపేర్లు చేసి, నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు సిబ్బంది తెలిపారు.

క్వాలిటీ లోపమే కారణమా ?
దేవాదుల థర్డ్ ఫేజ్‌‌‌‌లో భాగంగా సాయిపేట వద్ద రెండు రోజుల కింద పైప్‌‌‌‌లైన్‌‌‌‌ లీకేజీ ఏర్పడగా,  ఇప్పుడు ధర్మసాగర్‌‌‌‌ టన్నెల్‌‌‌‌, ఉనికిచర్ల సమీపంలో పైపులైన్‌‌‌‌ లీక్‌‌‌‌ అయింది. ఇందుకు పనుల్లో క్వాలిటీ లేకపోవడమే కారణమన్న చర్చ జరుగుతోంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ పనులు చేసిన మేఘా ఇంజినీరింగ్‌‌‌‌ సంస్థ ఆధ్వర్యంలోనే దేవాదుల పనులు కొనసాగాయి. అయితే నాణ్యతాలోపం కారణంగానే తరచూ లీకేజీలు బయటపడుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌ నాణ్యతా ప్రమాణాలపై విచారణ జరిపించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే లీకేజీలను అరికట్టి సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.