
- యుద్ధప్రాతిపదికనకొనసాగుతున్న పనులు
- దేవాదుల నీటి విడుదల మరో రెండు రోజులు ఆలస్యం
హనుమకొండ, వెలుగు : దేవాదుల ప్రాజెక్ట్‌లో కీలకమైన, హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్‌హౌస్ మోటార్లలో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. పంప్‌హౌస్‌లోని మూడు మోటార్లలో ఒకటి ఓపెనింగ్‌కు సిద్ధం కావడంతో దానిని ప్రారంభించేందుకు మంగళవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు మంగళవారం దేవన్నపేట పంప్‌హౌస్‌కు వచ్చారు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా మోటార్ ఆన్ కాకపోవడంతో మంత్రులు అర్థరాత్రి వరకు వేచి చూసి వెనుదిరిగారు.
అయితే దేవాదుల పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేస్తున్న స్కాడా సిస్టంలో సమస్య తలెత్తడం వల్లే మోటార్లు ఆన్ కాలేదని తెలిసింది. నీటి ప్రవాహం, మోటార్ల పనితీరును అబ్జర్వ్ చేయడంతో పాటు అందులో లోపాలేమైనా తలెత్తితే ఈ స్కాడా సిస్టం అలర్ట్చేస్తుంది. అయితే ఆ సిస్టం పనిచేయకపోవడం తో రిపేర్లు ప్రారంభించారు.
ఆస్ట్రియా నుంచి టెక్నికల్ టీమ్
స్కాడా సిస్టంలో సమస్యలను పరిష్కరించేందుకు ఆస్ట్రియా నుంచి ప్రత్యేక టెక్నికల్ టీమ్ మంగళవారం సాయంత్రానికి దేవన్నపేటలోని దేవాదుల పంప్‌హౌస్‌కు చేరుకుంది. ఈ టీమ్‌లో 14 మంది ఇంజినీర్లు ఉండగా.. వారంతా కలిసి స్కాడా సిస్టంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు. కాగా ఇప్పటికే టెక్నికల్ టీమ్నిరంతరాయంగా పనిచేస్తోందని, ఒకటి రెండు రోజుల్లో పంప్‌హౌస్ వద్ద సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు తెలిపారు.