
= దేవన్నపేట పంప్ హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ కు గోదావరి జలాలు
= ఒక మోటార్ ఆన్ చేసి నీటి విడుదల
= పది రోజుల నిరీక్షణకు తెర..60 వేల ఎకరాలకు నీరు
= అన్నదాతల్లో ఆనందం
హనుమకొండ/ ధర్మసాగర్: అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. దేవాదుల ప్రాజెక్టు థర్డ్ ఫేజ్‌లో భాగంగా దేవన్నపేట వద్ద నిర్మించిన పంపు హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు ఆఫీసర్లు నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. దేవన్నపేట పంప్ హౌజ్‌లోని మూడు మోటార్లలో ఒక దానిని రాత్రి 2.30 గంటల సుమారులో ఆన్ చేయగా.. 3.25 గంటల ప్రాంతంలో నీళ్లు ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరాయి.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారంలోని గోదావరి నదిపై నిర్మించిన జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం థర్డ్ ఫేజ్ కింద రామప్ప చెరువు నుంచి దేవన్నపేట వద్ద పంప్ హౌజ్ వరకు రూ.1,494 కోట్లతో 49.06 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం పూర్తికాగా ఇక్కడి నుంచి ఒక మోటార్ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో జనగామ జిల్లాలోని 60 వేల ఎకరాలకు ఇవాళ్టి నుంచి సాగునీరు అందనుండటంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది.
పది రోజుల నిరీక్షణ
ఈ నెల 18న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా దేవాదుల పంప్ హౌజ్ మోటార్‌ను ఆన్ చేసి, సాగునీరు విడుదల చేయాలని భావించారు. కానీ స్కాడా సిస్టంలో తలెత్తిన సమస్య వల్ల అవాంతరాలు ఏర్పడ్డాయి. పంప్ హౌజ్‌లో ఏర్పాటు చేసినవి ఆస్ట్రియాకు చెందిన ఆండ్రిట్జ్ కంపెనీ మోటార్లు కాగా ఆ కంపెనీకి చెందిన ముగ్గురు ఇంజినీర్లు అదే రోజు సాయంత్రం దేవన్నపేట పంప్ హౌజ్‌కు చేరుకుని సమస్యను పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమించారు.
అయినా ఫలితం లేకపోవడంతో ఎటుచేసి నీళ్లు విడుదల చేశాకే తిరుగు ప్రయాణమవ్వాలనుకున్న రాష్ట్ర మంత్రులు అర్ధరాత్రి వరకు ఎదురు చూసి వెళ్లిపోయారు. ఆ తరువాత ఆండ్రిట్జ్ కంపెనీ ఇంజినీర్లు స్కాడా లోపాలను సవరించగా.. ఇరిగేషన్ ఆఫీసర్లు రెండు రోజుల కిందట ట్రయల్ రన్ కు ఏర్పాట్లు చేశారు. కానీ పంప్ హౌజ్ లోని గేట్ వాల్వ్ లాక్ అవడంతో మరోసారి అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో హైదరాబాద్ నుంచి మరో ఇద్దరు నిపుణులను తీసుకొచ్చి పనులు చేయించారు.
అర్ధరాత్రి దాటాక గంగమ్మ పరవళ్లు
దేవన్నపేట పంప్ హౌజ్ వద్ద బుధవారం సాయంత్రం వరకు పనులన్నీ పూర్తి కాగా ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ పవర్ సప్లై సిస్టంలో సమస్య కారణంగా మూడుసార్లు మోటార్ ట్రిప్ అయ్యింది. దీంతో నిన్న రాత్రి ఎంత లేటైనా నీటిని విడుదల చేయాలన్న తపనతో ఆండ్రిట్జ్ ఇంజినీర్లతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అడ్వైజర్ పెంటారెడ్డి, హనుమకొండ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సీతారాం నాయక్, ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో పనులు చేపట్టి ఆ సమస్యనూ పరిష్కరించారు.
అనంతరం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో మోటార్ ను ఆన్ చేయగా.. దేవన్నపేట పంప్ హౌజ్ నుంచి దాదాపు ఆరున్నర కిలోమీటర్ల పైపులైన్ ద్వారా నీళ్లు ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకున్నాయి. అధికారులు తెల్లందాక అక్కడే ఉండి పనులు చేయించగా.. దాదాపు పది రోజుల నిరీక్షణకు తెరపడటంతో ఆఫీసర్లు, ఇంజినీర్లలో సంతోషం వ్యక్తమైంది.
60 వేల ఎకరాలకు సాగునీరు
దేవన్నపేట పంప్ హౌజ్ లో 31 మెగా వాట్స్ సామర్థ్యం కలిగిన ఆస్ట్రియాకు చెందిన ఆండ్రిట్జ్ కంపెనీ మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక దానిని ఆన్ చేసి 584 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ట్రయల్ సక్సెస్ కావడంతో ధర్మసాగర్ రిజర్వాయర్ కు నీళ్లు చేరుతుండగా.. ఇక్కడి నుంచి నష్కల్, అక్కడి నుంచి పాలకుర్తి ట్యాంక్ కు నీటిని విడుదల చేస్తున్నారు.
దీంతో ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి జనగామ జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లోని 60 వేల ఎకరాలకుపైగా సాగు నీరందుతోంది. అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా దేవాదుల థర్డ్ ఫేజ్ లో చేపట్టిన పనులన్నీ పూర్తయితే మొత్తంగా 5.22 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది.