Team India: రూల్స్ మార్చేదే లేదంటున్న బీసీసీఐ.. కపిల్, కోహ్లీ చెప్పినా వినలేదుగా

Team India: రూల్స్ మార్చేదే లేదంటున్న బీసీసీఐ.. కపిల్, కోహ్లీ చెప్పినా వినలేదుగా

ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భారత్ 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ ఘోర ఓటమితో బీసీసీఐ ఆటగాళ్లపై కఠిన రూల్స్ విధించింది. వరుసగా టెస్టుల్లో ఓడుతున్నా.. పరుగులు చేయడంలో విఫలమవుతున్నా భారత క్రికెటర్లలో ఎటువంటి నిరుత్సాహం కనిపించలేదు. ఆహ్ పోతే పోయిందిలే అన్నట్టు పెళ్లాం, పిల్లలతో కలిసి సిడ్నీ, బ్రిస్బేన్ నగర వీధుల్లో ఎంజాయ్ చేశారు. ఇటువంటి వాటిపై పదే పదే విమర్శలు వస్తుండటంతో బీసీసీఐ అప్రమత్తం అయ్యింది.    

45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం జరిగే విదేశీ పర్యటనలో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ఆటగాళ్లతో రెండు వారాల కంటే ఎక్కువ ప్రయాణించడానికి అనుమతించబడరు. బీసీసీఐ విధించిన ఈ రూల్ తో ఆటగాళ్లు సంతోషంగా లేరు. విరాట్ కోహ్లీతో సహా చాలా అంది ఆటగాళ్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బీసీసీఐ ఈ రూల్ తొలిసారి విధించగా ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. కపిల్ దేవ్ లాంటి దిగ్గజాలు కుటుంబ సభ్యుల విషయంలో బీసీసీఐ బ్యాలెన్సింగ్ విధానం ఆలోచించాలని కోరాడు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా బీసీసీఐ మాత్రం తమ వైఖరిని మార్చుకోలేదు.       

Also Read :- అప్పుడు విరాట్ కోహ్లీ టీమ్ మేట్..వరల్డ్ కప్ ఫైనల్ టాప్ స్కోరర్

ప్రస్తుతానికి కుటుంబ విధానంలో విధించిన పరిమితులపై ఎటువంటి మార్పులు ఉండవని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఆటగాళ్లు, కోచ్‌లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది ప్రయోజనాల కోసం SOPలు రూపొందించబడ్డాయని.. కొంతమంది ఆటగాళ్లకు దీనిపై భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పటికీ బీసీసీఐ ఎలాంటి మార్పుల గురించి ఆలోచించడం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుత విధానం చెక్కుచెదరకుండా ఉంటుందని.. ఇది దేశానికి, మన సంస్థ బీసీసీఐకి చాలా ముఖ్యమైనదని సైకియా క్లారిటీ ఇచ్చారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అమలు చేయబడిందని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా బుధవారం (మార్చి 19) క్రిక్‌బజ్‌తో అన్నారు.