![Champions Trophy 2025: బుమ్రా లేకపోతే ఏం కాదు.. టీమిండియా టైటిల్ గెలుస్తుంది: బీసీసీఐ సెక్రటరీ](https://static.v6velugu.com/uploads/2025/02/devajit-saikia-talked-about-the-exclusion-of-jasprit-bumrah-from-the-indian-champions-trophy-squad_Z390a4YkoC.jpg)
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీ మొత్తం 20 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. హైబ్రిడ్ మొదల్లో జరగనున్న ఈ టోర్నీకి పాకిస్థాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. అన్ని జట్లతో పోల్చుకుంటే పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. 2013 తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
భారత జట్టు బలంగా ఉన్నప్పటికీ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం పెద్ద లోటే అని చెప్పాలి. బుమ్రా మీద అతిగా ఆధారపడుతున్న టీమిండియా ఈ టోర్నీలో ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బుమ్రా లేకపోవడంతో ఫాస్ట్ బౌలింగ్ బలహీనంగా మారింది. ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చిన ఫాస్ట్ బౌలర్ షమీపైనే భారత్ అసలు పెట్టుకుంది. అతనితో పాటు అనుభవం లేని కుర్రాళ్ళు హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్స్ కూడా బుమ్రా ఉండాల్సిందని కామెంట్ చేస్తున్నారు. అయితే బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా బుమ్రా లేకపోయినా భారత్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. "ఛాంపియన్స్ ట్రోఫీకి మేము ఉత్తమ జట్టును ఎంచుకున్నాము. ఇండియా ట్రోఫీని గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. టీమిండియాకు బెంచ్ బలంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా లేనంత మాత్రనా జట్టుకు ఎలాంటి సమస్య ఉండదు. జట్టులో ప్రతిదీ సానుకూలంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. భారత పరిస్థితుల మాదిరిగానే దుబాయ్‌లో పరిస్థితులు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ను వైట్‌వాష్.. టీ20ల్లో 4-1 విజయంతో భారతదేశం టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆత్మ విశ్వాసంతో కనిపిస్తుంది". అని బీసీసీఐ సెక్రటరీ అన్నారు.