
హైదరాబాద్, వెలుగు: కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందో.. రాదో... ఆ దేవుడికే తెలుసని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను దేవుడిని నమ్ముతానని, అదృష్టం ఉంటే తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పారు. అయినా.. కాంగ్రెస్ లో ఏదైనా జరగవచ్చని, విజయశాంతికి ఎమ్మెల్సీ వస్తుందని ఎవరైనా ఊహించారా? అని ఎదురు ప్రశ్నవేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డినే అసెంబ్లీకి అటెండ్ అయ్యే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకడంతో మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు ఠంచన్‌గా వస్తున్నారని చెప్పారు. జనారెడ్డి కొడుకు విషయంలోనే సీఎం అంత కఠినంగా ఉండడంతో ఇక తామెంతా అనే భావనతో మిగిలిన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉంటున్నారని అన్నారు.