డిక్కీలో కుక్కి హాస్పిటల్​కు..25 కిలోమీటర్లు  అట్లనే తీసుకుపోయిన్రు 

  • అమానవీయంగా వ్యవహరించిన  అధికారి 
  • పోలీసుల వాహనం ఓవర్​స్పీడ్​గా నడపడం వల్లే ప్రమాదం 

చండూరు, వెలుగు : బైక్ పై వెళ్తున్న ఒకరిని దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు వెహికల్​వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా, బాధితుడిని దవాఖానాకు తరలించడంలో పోలీసులు అమానవీయంగా వ్యవహరించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్​రావు పోలీస్​ వెహికల్​లో మునుగోడు వెళ్తున్నారు. అదే టైంలో యాదాద్రి  జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన సంగిశెట్టి ధనుంజయ  (65) బైక్​పై మునుగోడు మీదుగా చండూరు వెళ్తున్నాడు. అయితే ఓవర్​స్పీడ్​తో వస్తున్న డీఎస్పీ వాహనం బోడంగిపర్తి శివారులోని టర్నింగ్​వద్ద ధనుంజయ బైక్​ను ఢీకొట్టింది. దీంతో ధనుంజయ ఎగిరి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే  వెహికల్​దిగిన డీఎస్పీ, ఇతర పోలీసులు.. బాధితుడిని  దవాఖానాకు తరలించాలని అనుకున్నారు. అయితే అంబులెన్స్​లోనో..లేక వారి వాహనం వెనక సీట్లోనో తీసుకెళ్లకుండా డిక్కీలో పడుకోబెట్టారు. బాధితుడికి దెబ్బలు తాకి రక్తమోడుతున్న అలాగే 25 కిలోమీటర్ల దూరంలోని నల్గొండ గవర్నమెంట్​హాస్పిటల్​కు తీసుకువెళ్లి అడ్మిట్​ చేశారు. అంతకుముందే ప్రమాదం జరిగిన చోటు నుంచే డీఎస్పీ వెళ్లిపోయారు. నల్గొండలో ధనుంజయ పరిస్థితి విషమంగా ఉందని గుర్తించిన డాక్టర్లు హైదరాబాద్​లోని ప్రైవేట్​దవాఖానాకు తరలించారని చండూరు ఎస్ఐ నవీన్​కుమార్​ చెప్పారు. ధనుంజయ బైక్​ను డీఎస్పీ వెహికల్ ​ఢీకొట్టిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.