ప్రతి ఎకరాకు సాగునీరందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే బాలూనాయక్  

దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందించడమే తమ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో లబ్ధిదారులకు రైతు రుణమాఫీ పత్రాలు అందజేశారు. అనంతరం పెండ్లిపాకల రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరానికి సాగునీరందించేందుకు కృషి చేస్తానన్నారు.

దేశ చరిత్రలో ఇప్పటివరకు రూ.2 లక్షల రుణమాఫీ ఏ ముఖ్యమంత్రి చేయలేదని, సీఎం రేవంత్ రెడ్డి రైతుబిడ్డ కావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అంతకుముందు కొండమల్లేపల్లి పట్టణంలో సాయికృష్ణ షాపింగ్ మాల్ ను ఆయన ప్రారంభించారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండమల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు.

స్థానిక గ్రామ పంచాయతీలో 57 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉట్కూరి వెమన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, దూదిపాల శ్రీధర్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, నాయకులు మాధవ రెడ్డి, యుగేంధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.