బీఆర్ఎస్​కు దేవరకొండ మున్సిపల్​ చైర్మన్​ రాజీనామా

నల్గొండ, వెలుగు : దేవరకొండ నియోజకవర్గంలో మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి వర్గం దాదాపు ఖాళీ అయింది. కాంగ్రెస్​ అభ్యర్థిగా బాలూనాయక్​ను ప్రకటించిన తెల్లారే ఆయన వర్గం నేతలు మూకుమ్మడిగా బీఆర్ఎస్​కు రాజీనామా చేసి.. కాంగ్రెస్​లో చేరారు.  దేవరకొండ మున్సిపల్​ చైర్మన్​ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ జానీ యాదవ్, మున్సిపల్​ మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్​నాయక్, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్యతో సహా పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్​లు బీఆర్ఎస్​కు రాజీనామా చేసి  శనివారం  బాలూనాయక్​ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్​​ను  ఓడించి, బాలూనాయక్​ విజయానికి కృషి చేస్తామని వారు ప్రకటించారు. 

రవీంద్ర కుమార్​నాయక్​కు, గుత్తా వర్గానికి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, శనివారం దేవరకొండలో బీఆర్ఎస్​ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. మంత్రి జగదీశ్​రెడ్డితో పాటు  గుత్తా కొడుకు అమిత్​ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో​అమిత్​ మాట్లాడుతూ,  గత 30 ఏండ్ల నుంచి తన తండ్రితో ఉన్నవారు  చిన్నచిన్న సమస్యలను సాకుగా చూపి పార్టీని వీడాలనుకోవడం బాధగా ఉందని, పార్టీకి రాజీనామా చేసే నాయకులు పునరాలోచన చేయాలని  కోరారు.   

సాగర్​లోనూ ఆగని వలసలు..

నాగార్జునసాగర్​ నియోజకవర్గంలోనూ వలసల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే నోముల భగత్​కు వ్యతిరేకంగా త్రిపురారం మాజీ జడ్పీటీసీ ధన్​ సింగ్​ యాదవ్​ శనివారం జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.